గంటల కొద్దీ ఫోన్‌ కాల్స్‌! | Three Mysterious Deaths In Kamareddy: Police Call data collected | Sakshi
Sakshi News home page

గంటల కొద్దీ ఫోన్‌ కాల్స్‌!

Published Sat, Dec 28 2024 5:10 AM | Last Updated on Sat, Dec 28 2024 5:10 AM

Three Mysterious Deaths In Kamareddy: Police Call data collected

కామారెడ్డి మూడు మరణాల కేసులో కీలక విషయాలు 

ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్, నిఖిల్‌ మధ్య సుదీర్ఘ ఫోన్‌ సంభాషణ  

శ్రుతి, నిఖిల్‌ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానం 

ఇంకా వీడని మిస్టరీ.. కాల్‌డేటా పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో వారి ఫోన్‌కాల్, వాట్సాప్‌ చాటింగ్‌ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ ఫోన్‌ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మ రం చేసిన పోలీసులు.. వారి కాల్‌ డేటాను సేకరించారు.  

చనిపోయేదాకా ఫోన్‌కాల్స్‌ 
బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు కాల్‌ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్‌ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్‌లు వాడగా, నిఖిల్‌ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్‌ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్‌లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి, నిఖిల్‌తో సాయికుమార్‌ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.  

ఒక్కచోటుకు చేరి..: భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ నుంచి సాయికుమార్‌ ఒక్కడే తన కారులో బయలుదేరి 44వ నంబర్‌ జాతీయ రహదారి మీదుగా కామారెడ్డి వైపు వెళ్లాడు. బీబీపేట నుంచి నిఖిల్‌ తన బైకుపై దోమకొండ, బీటీఎస్‌ మీదుగా హైవేకు చేరుకున్నట్టు తెలుస్తోంది. శ్రుతి బస్సులోనే బయలుదేరిందని, ఆమె నర్సన్నపల్లి శివారు వద్ద బస్సు దిగిందని అంటున్నారు. ఓ దాబా వద్ద ముగ్గురూ ఆగారని ప్రచారం జరుగుతుండగా.. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో స్పష్టత రాలేదు.

నిఖిల్‌ తన బైకును అక్కడే వదిలేసి ఎస్సై కారులో వెళ్లినట్టు స్పష్టత వచ్చింది. అదే కారులో శ్రుతి కూడా ఎక్కిందని అంటున్నారు. ముగ్గురూ బైపాస్‌ ద్వారా అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకొని, కొంతసేపు అక్కడ మాట్లాడుకొని ఉంటారని భావిస్తున్నారు. తరువాత ఏమైందో ఏమో ముగ్గురూ చెరువులో పడి చనిపోవడం మిస్టరీగా మారింది. ఎవరైనా ఒకరు దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దూకారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ప్రేమ వ్యవహారమే కారణమా? 
శ్రుతి, నిఖిల్‌ వాట్సాప్‌ మెసేజ్‌లను పోలీసులు పరిశీలించా రు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్‌ మెసేజ్‌ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్‌ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement