![Pregnant women in remote villages of Kamareddy district prefer normal deliveries](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/delivry.jpg.webp?itok=lkDJ6j7-)
కామారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నార్మల్ డెలివరీలకే గర్భిణుల ప్రాధాన్యత
డెలివరీ రోజు దాకా పొలం పనులకు వెళ్లడం మామూలే
నొప్పులు మొదలయ్యాక డెలివరీల కోసం పీహెచ్‌సీలకు పయనం
తప్పదని వైద్యులు చెబితేనే సిజేరియన్లకు అంగీకారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఓవైపు ప్రసవాల కోసం కడుపు‘కోత’లు (సిజేరియన్లు) పెరుగుతున్నప్పటికీ పలు మారుమూల గ్రామాల్లో మాత్రం నేటికీ సాధారణ ప్రసవాలే అత్యధికంగా జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని శివారు గ్రామాల్లో నిండు గర్భిణులు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పురిటినొప్పులు భరించేందుకే మొగ్గుచూపుతున్నారు తప్ప శస్త్రచికిత్సలకు ఇష్టపడటంలేదు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేయించుకుంటున్నారు. ఆయా గ్రామాల పరిధిలో గత ఐదేళ్లలో జరిగిన కాన్పుల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే 90 శాతానికిపైగా సాధారణ ప్రసవాలే జరగడం గమనార్హం.
జీవన విధానమూ భిన్నమే..
మూడు రాష్ట్రాల కూడలిగా.. త్రిభాషా సంగమంగా పిలిచే జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, పెద్దకొడప్‌గల్, డోంగ్లీ, మద్నూర్ తదితర మండలాల్లో ప్రజల ఆచార వ్యవహారాలతోపాటు జీవన విధానం కూడా భిన్నమే.
వ్యవసాయమే వారి జీవనాధారం. రాళ్ల భూములే అయినా వాటిలోనూ రకరకాల పంటలు పండిస్తారు. ఇంటిల్లిపాదితోపాటు గర్భిణులు సైతం పొద్దున్నే పొలంబాట పడుతుంటారు. ఒక్కోసారి పొలం పనులకు వెళ్లిన గర్భిణులకు పురిటినొప్పులు మొదలై పొలం దగ్గరే కాన్పులు జరిగిన ఘటనలు సైతం ఉన్నాయి.
పీహెచ్‌సీలకే ప్రాధాన్యం..
మారుమూల గ్రామాలైనప్పటికీ ప్రభుత్వ వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. దీంతో వారంతా దూరాన ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్లకుండా నొప్పులు మొదలవగానే ప్రభుత్వ అంబులెన్స్‌ల ద్వారానే సమీపంలోని పీహెచ్‌సీలకు వెళ్తున్నారు. అక్కడి వైద్య సిబ్బంది ఏదైనా సమస్య ఉందని గుర్తిస్తే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి లేదా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు.
హైరిస్క్ ఉంటేనే రిఫర్ చేస్తాం
మా దగ్గర నార్మల్ డెలివరీలే చేస్తాం. హైరిస్క్ ఉంటే బాన్సువాడకు రిఫర్ చేస్తాం. గర్భిణులు మా సిబ్బంది చెప్పి నట్లు నడుచుకుంటారు. తప్పని సరి అయితేనే సిజేరియన్‌కు ఒప్పుకుంటారు. – డాక్టర్ విఠల్ పాటిల్, మెడికల్ ఆఫీసర్, జుక్కల్
చెప్పినట్టు వింటారు
మా ఊళ్లో అందరూ ఏఎన్‌ఎం వచ్చిన రోజు వచ్చి చెకప్ చేయించుకుంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి డెలివరీ అయ్యేదాకా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు. అందుకే నార్మల్ డెలివరీలు అవుతాయి. – కవిత, అంగన్‌వాడీ టీచర్, శివాపూర్
రెండు కాన్పులూ నార్మలే...
నాకు రెండు కాన్పులూ నార్మల్‌గానే జరిగాయి. అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు అందిస్తారు. భోజనం పెడతారు. మా ఊళ్లో అందరూ నార్మల్ డెలివరీ అవుతారు. – సరోజన, బాలింత, శివాపూర్
Comments
Please login to add a commentAdd a comment