కడుపుకోత! | Telangana top in Cesareans | Sakshi
Sakshi News home page

కడుపుకోత!

Published Fri, Sep 15 2017 1:02 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

కడుపుకోత!

కడుపుకోత!

► రాష్ట్రంలో 58 శాతం ప్రసవాలు సిజేరియన్లే
► దేశంలోనే టాప్‌ తెలంగాణ


బిడ్డకు జన్మనిస్తున్న అమ్మ కడుపుకోతకు గురవుతోంది.. అత్యవసర పరిస్థితిలో ఆదుకోవాల్సిన సిజేరియన్‌ విధానం.. అనవసరంగా, అడ్డదిడ్డంగా ఆపరేషన్లు చేసే విచ్చలవిడి వ్యవహారానికి మూలంగా మారిపోయింది. అసలు ప్రసవం అంటేనే ‘కోత’అన్నట్లుగా తయారైంది. అందులోనూ మన రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ నమోదవుతున్న ప్రసవాల్లో ఏకంగా 58 శాతం సిజేరియన్లే కావడం ఆందోళనకరంగా మారింది. దీనికి వైద్యులు, ఆస్పత్రుల ధన దాహం ప్రధానంగా కారణమవుతోంది. బిడ్డ అడ్డం తిరిగిందని భయపెడుతూనో, మరేదో కారణం చెబుతూనో సిజేరియన్‌ చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వాల నిర్లక్ష్యం, తగిన నైపుణ్యం లేని వైద్య సిబ్బంది, మహిళల ఆరోగ్య పరిస్థితులు, అవగాహన లేమి వంటివి కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి.
– సాక్షి, హైదరాబాద్‌


ప్రభుత్వాల నిర్లక్ష్యంతో..
మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీసే సిజేరియన్ల నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 75 శాతం, ప్రభుత్వాస్పత్రులలో 41 శాతం సిజేరియన్లు జరుగుతుండటం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రుల ధన దాహం, వాటిపై సర్కారు నియంత్రణ లేకపోవడం, వైద్యశాఖలో నిఘా, చర్యలు తీసుకునే యంత్రాంగం పెద్దగా లేకపోవడం వంటివి ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.


ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ..
జాతీయ స్థాయిలో చూస్తే సిజేరియన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ల శాతం అధికంగా ఉండటం ఆందోళనకరం. హైదరాబాద్‌లోని మూడు బోధనాస్పత్రుల్లో సిజేరియన్ల శాతం 38 నుంచి 43 వరకు ఉంది. జిల్లాల్లోని ఆస్పత్రుల్లోనైతే ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంది.

వైద్యులు, సౌకర్యాల కొరత
పెరుగుతున్న గర్భిణుల సంఖ్యకు తగినట్లుగా ప్రభు త్వాస్పత్రుల్లో వైద్య సిబ్బంది, సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల వైపు మొగ్గు పెరుగుతోందని కేంద్ర నివేదిక స్పష్టం చేసింది. ఇక సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినప్పుడు ఏదైనా అయితే వైద్యుల నిర్లక్ష్యమంటూ రోగుల బంధువులు గొడవపడటం, న్యాయస్థానాలను ఆశ్రయించడం పెరిగిపోతోంది. దీంతో వైద్యులు ముందు జాగ్రత్తగా ఆపరేషన్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

సిజేరియన్లు 15% మించకూడదు
దేశంలో ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్న సిజేరియన్‌ కాన్పులు, వాటితో వచ్చే దుష్ప్రభావాలు, సిజేరియన్లను తగ్గించడానికి సూచనలను పేర్కొంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తాజాగా నివేదిక రూపొందించింది. దాని ప్రకారం రాష్ట్రంలో సిజేరియన్‌ కాన్పులు ఏకంగా 58 శాతంగా నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా ప్రసవాలలో సిజేరియన్లు గరిష్టంగా 15 శాతం మించకూడదు.  ఇక ప్రసవించే సమయంలో మహిళలు మృతిచెందుతున్న శాతం సాధారణ కాన్పుల్లో 8.6 శాతంగా ఉంటే.. సిజేరియన్లలో 9.2 శాతంగా ఉంది. దీనిని బట్టి చూసినా సిజేరియన్ల నియంత్రణ అత్యావశ్యకమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

చాలా కారణాలున్నాయి
కాన్పు కష్టమైన సమయాల్లో, తల్లీబిడ్డల్లో ఎవరికైనా ప్రాణహాని ఉండే సందర్భాల్లో మాత్రమే సిజేరియన్‌ చేయాలి. కానీ రాష్ట్రంలో వైద్యులు విచ్చలవిడిగా పెద్దాపరేషన్లు చేస్తున్నారు. తొలి ప్రసవం సిజేరియన్‌ అయితే రెండోసారి కాన్పు సమయంలో ఏ మాత్రం ఆలోచించకుండా ఆపరేషన్‌ చేసేస్తున్నారు.
కొందరు మహిళలు తొలికాన్పు సమయంలో ఎదురైన నొప్పులు, ఇతర అనుభవాలకు భయపడి రెండో కాన్పు సిజేరియన్‌కు వెళ్తున్నారు.
ఇటీవల మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకుని ముప్పై ఏళ్ల వయసు దాటాక తొలి సంతానానికి జన్మ ఇస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు తల్లీబిడ్డలకు ప్రాణహా ని ఉంటుండటంతో వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు.
ఆరోగ్య బీమా ఉన్న మహిళల్లో చాలా మంది సిజేరియన్‌ ఆపరేషన్లకు వెళుతుండడం గమనార్హం.

కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి
వైద్యపరంగా సాధారణ కాన్పు, శస్త్రచికిత్స ప్రక్రియ ఒక్కటే. కానీ సాధారణ కాన్పు అయినప్పుడు రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే చాలు. సిజేరియన్‌ అయితే మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి. ఇక సిజేరియన్‌ చేసినప్పుడు గర్భాశయానికి పేగులు అతుక్కుపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. దానివల్ల కడుపునొప్పి, పనులు చేసే సమయాల్లో ఇబ్బంది ఉంటుంది. కానీ ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ. ఇక శస్త్రచికిత్స వల్ల నడుము నొప్పి వస్తుందనే అభిప్రాయం అవాస్తవం. సామాజికంగా, జీవనశైలిపరంగా వచ్చిన మార్పుల వల్లే సిజేరియన్‌ కాన్పులు పెరుగుతున్నాయి..     – డాక్టర్‌ కొత్తగట్టు శ్రీనివాస్, గైనకాలజిస్ట్‌  

సిజేరియన్ల శాతం తగ్గించేందుకు చర్యలు
మన రాష్ట్రంలో సిజేరియన్ల శాతం ఎక్కువగానే ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు బహుముఖ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువ కాన్పులు చేయడం వల్ల.. సిజేరియన్ల సంఖ్య తగ్గుతోంది. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది.. – వాకాటి కరుణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement