బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి తల్లికీ పునర్జన్మ వంటిదే. సహజంగా సాధారణ (నార్మల్) డెలివరీ, సిజేరియన్ అని రెండు పద్ధతులు ఉంటాయి. సాధారణ పద్ధతిలో కాకుండా శస్త్రచికిత్స ద్వారా బిడ్డకు జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ – సెక్షన్ డెలివరీ అంటారు. సాధారణ పద్ధతిలో డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లి, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సిజేరియన్ చేస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా కాసుల కోసం.. లేనిపోని భయాందోళనలు సృష్టించి సిజేరియన్ ఆపరేషన్‌కు ఒప్పిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం:
= గుత్తి మండలానికి చెందిన లక్ష్మీదేవి గత బుధవారం పురిటినొప్పులు రాగానే అనంతపురంలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు వచ్చింది. నాలుగు గంటల వ్యవధిలోనే ఆమెకు సిజేరియన్ చేసి కాన్పు చేశారు. పూర్తి స్థాయిలో రక్తపరీక్షలు చేయకుండానే కోత కాన్పు కానిచ్చేశారు.
= ఉవరకొండకు చెందిన 21 ఏళ్ల సుల్తానా రజియా రెండో కాన్పు కోసం అనంతపురం వచ్చింది. మొదటి కాన్పు సుఖప్రసవం అయినా రెండో కాన్పులో మాత్రం ఆ అవకాశం లేదని సిజేరియన్ చేయాలని ఓ నర్సింగ్ హోం డాక్టర్లు చెప్పారు. దీంతో విధిలేక సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
సుఖప్రసవం జరిగి తల్లీ బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వాస్పత్రిలోనూ అవసరమైన అన్ని వసతులూ కల్పించింది. సిజేరియన్ ప్రసవాలు అత్యవసరమైతేనే చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా కోత కాన్పులు (సిజేరియన్లు) చేస్తూనే ఉన్నాయి. పేషెంటు రావడమే ఆలస్యం... ఏదో ఒక కారణం చెప్పి సిజేరియన్ ప్రసవం చేస్తున్నారు. సిజేరియన్ ద్వారా ప్రసవం చేయడం అటు తల్లికీ బిడ్డకూ మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరిస్తున్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో కోతల ప్రసవాలకు నియంత్రణే లేకుండాపోతోంది.
వ్యాపారంగా మారిన ప్రసవాలు
ప్రసవాలు పక్కా వ్యాపారమయ్యాయి. సాధారణ ప్రసవమైతే నర్సింగ్‌హోంలో రూ.10 వేలు కూడా బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే ఆస్పత్రి శ్రేణులను బట్టి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తారు. మూడు రోజులు ఇన్‌పేòÙంటుగా ఉంటే కనిష్టంగా రూ.50వేలు వేయొచ్చు. దీనికోసమే ఎక్కువ నర్సింగ్ హోంలలో సిజేరియన్ ప్రసవాలకే మొగ్గుచూపుతున్నారు. అదే ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటుతో పోల్చుకుంటే చాలా తక్కువ సిజేరియన్ ప్రసవాలుంటాయి. ఇకనైనా ప్రైవేట్ వైద్యులు తల్లీబిడ్డల ఆరోగ్యం దృష్ట్యా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు.
అనవసరంగా సిజేరియన్ చేయొద్దు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ చేశామంటే దానికి ఆడిట్ జరుగుతుంది. కారణం కచ్చితంగా చెప్పాలి. అందుకే ప్రభుత్వాస్పత్రుల్లో విధిలేకపోతే తప్ప సిజేరియన్ చేయం. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా నియంత్రణ ఉంది. డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరైనా సరే ప్రత్యేక కారణం లేకుండా సిజేరియన్ ప్రసవం చేయకూడదు.
–డాక్టర్ కృష్ణవేణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్), అనంతపురం
సిజేరియన్ డెలివరీతో నష్టాలు
= డెలివరీ సమయంలో తల్లికి ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది.
= సిజేరియన్ గాయం వల్ల తల్లికి భవిష్యత్‌లో ఇతర సమస్యలు రావచ్చు.
= ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు సోకితే తల్లికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది.
= సాధారణ ప్రసవమైతే వెంటనే శిశువుకు తల్లిపాలు వస్తాయి. సిజేరియన్ అయితే ఆలస్యం కావచ్చు.
= సిజేరియన్ ప్రసవం వల్ల శిశువుకు శ్వాసకోశ సమస్యలు రావచ్చు.
= ఒకసారి సిజేరియన్ అయితే రెండోసారి గర్భం దాల్చినప్పుడు మరిన్ని సమస్యలుంటాయి.
= సిజేరియన్ వల్ల దీర్ఘకాలంలో వెన్నుపూస సమస్యలు లేదా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment