section
-
సహజీవనంలో ఆమెకు ఆ హక్కుందా?
ప్రియ, భార్గవ్.. మూడేళ్లుగా లివ్ ఇన్ టుగెదర్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఆరు నెలల కిందట ప్రియకు ఉద్యోగం పోయింది. దాంతో ఇంటి బాధ్యత అంతా భార్గవ్దే. అయితే ప్రియ ఇటీవల భార్గవ్ ఏం చేసినా తప్పు పడుతోంది. ఎవరితో మాట్లాడనివ్వకుండా.. తనతో తప్ప ఎవరితో ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తోంది. ఆఫీస్ అవసరాల రీత్యా భార్గవ్ కొలీగ్స్‌కి ఫోన్ చేసినా, ఫోన్ ని అతను అటెండ్ అయినా పెద్ద యుద్ధమే! గొడవలే! భరించలేక భార్గవ్ ఒకరోజు ‘ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు.. నీతో కలసి ఉండలేను’ అన్నాడు. దాంతో ప్రియ ‘నాతో బ్రేకప్ చేసుకుంటే నీ మీద రేప్ కేసు పెడతా’ అని బెదిరించింది. హడలిపోయాడు భార్గవ్. నిజంగానే ప్రియకు ఆ హక్కు ఉందా?కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా.. మోసపూరితంగా, ఓ పథకం ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ స్త్రీతో శారీరక సంబంధం నెరపితే.. సదరు పురుషుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రేప్ అయితే యావజ్జీవం కూడా పడవచ్చు. జూన్ 30 వరకు అమల్లో ఉన్న పాత శిక్షాస్మృతి ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసపూరితంగా స్త్రీతో శారీరకసంబంధం నెరపిన పురుషుడిపై ఐపీసీ 376, ఐపీసీ 420 సెక్షన్ లను కలిపి కేసు నమోదు చేసేవారు. అయితే, ఆ పురుషుడు మొదటినుంచీ మోసం చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు అని రుజువుకాకపోతే మాత్రం దాన్ని రేప్‌గా పరిగణించలేమని హైకోర్ట్, సుప్రీంకోర్టు పేర్కొన్న సందర్భాలు, తీర్పులూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా చూడాల్సినదేంటంటే.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా చేసుకుంటానని నమ్మించి కేవలం శారీరక సంబంధం కోసమే అతను లివ్ ఇన్‌లో ఉన్నాడా అనే అంశం. మొదట బాగానే ఉన్నాడు.. పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు.. కానీ తర్వాత మనస్పర్థలు, భేదాభి్రపాయాలు వచ్చి విడి΄ోవాలనుకుంటున్నాడు అని రుజువైతే శిక్ష పడదు. భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం కూడా లివ్ ఇన్ రిలేషన్ లోని పురుషుడు ‘మోసపూరితమైన ఆలోచనతోనే రిలేషన్ మొదలు పెట్టాడు’ అని రుజువు చేయాలి. అయితే ఈ కేస్ స్టడీలో భార్గవ్ మీద ప్రియ కేసు పెట్టే అవకాశం కచ్చితంగా ఉంది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇన్నాళ్లు లివ్ ఇన్ లో ఉండి ఇప్పుడు వద్దు అంటున్నాడని ప్రియ రుజువు చేయగలిగితే భార్గవ్‌కి పదేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సెక్షన్ 69 వలన సహజీవనం, ప్రేమ అనే అంశాలు ఆది నుంచీ అనుమానంతో మొదలయ్యే ప్రమాదం ఉంది. సహజీవనానికి ముందు లేదా కలసి ఉంటున్న క్రమంలో ఒకరిపై ఒకరు స్పష్టత తెచ్చుకోవడం అవసరం. ఇలాంటి రిలేషన్స్ వ్యక్తిగతమైనప్పటికీ, వీలైనంత మేర అందరికీ తెలిసేలా ఉండడం లేదా కనీసం సన్నిహితులకైనా తెలిసుండటం వల్ల కొంతవరకు రక్షణ కలగవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
రైలులో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు!
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్లో మంగళవారం అర్థరాత్రి దానాపూర్-లోకమాన్య తిలక్ టెర్మినస్ హోలీ స్పెషల్ రైలులో మంటలు చెలరేగాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భోజ్‌పూర్ జిల్లా పరిధిలోని బిహియా- కరిసాత్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హోలీ ప్రత్యేక రైలులోని ఏసీ బోగీలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయాందోళనకు గురై ప్రాణాలను కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు దూకేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యూపీ రైల్వే లైన్‌లోని ఓహెచ్‌ఈలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గంలో నడిపారు. నేటి (బుధవారం) ఉదయం ట్రాక్‌ను క్లియర్ చేసిన తర్వాత, నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, పాట్నా ఎల్టిటి ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లను వాటి షెడ్యూల్ మార్గం గుండా రాకపోకలకు అనుమతించారు. ఈ హోలీ స్పెషన్ రైలులో అగ్నిప్రమాదానికి గురైన కోచ్‌ను తొలగించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. -
పక్కా కమర్షియల్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్‌కే మొగ్గు
బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి తల్లికీ పునర్జన్మ వంటిదే. సహజంగా సాధారణ (నార్మల్) డెలివరీ, సిజేరియన్ అని రెండు పద్ధతులు ఉంటాయి. సాధారణ పద్ధతిలో కాకుండా శస్త్రచికిత్స ద్వారా బిడ్డకు జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ – సెక్షన్ డెలివరీ అంటారు. సాధారణ పద్ధతిలో డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లి, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సిజేరియన్ చేస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా కాసుల కోసం.. లేనిపోని భయాందోళనలు సృష్టించి సిజేరియన్ ఆపరేషన్‌కు ఒప్పిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: = గుత్తి మండలానికి చెందిన లక్ష్మీదేవి గత బుధవారం పురిటినొప్పులు రాగానే అనంతపురంలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు వచ్చింది. నాలుగు గంటల వ్యవధిలోనే ఆమెకు సిజేరియన్ చేసి కాన్పు చేశారు. పూర్తి స్థాయిలో రక్తపరీక్షలు చేయకుండానే కోత కాన్పు కానిచ్చేశారు. = ఉవరకొండకు చెందిన 21 ఏళ్ల సుల్తానా రజియా రెండో కాన్పు కోసం అనంతపురం వచ్చింది. మొదటి కాన్పు సుఖప్రసవం అయినా రెండో కాన్పులో మాత్రం ఆ అవకాశం లేదని సిజేరియన్ చేయాలని ఓ నర్సింగ్ హోం డాక్టర్లు చెప్పారు. దీంతో విధిలేక సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సుఖప్రసవం జరిగి తల్లీ బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వాస్పత్రిలోనూ అవసరమైన అన్ని వసతులూ కల్పించింది. సిజేరియన్ ప్రసవాలు అత్యవసరమైతేనే చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా కోత కాన్పులు (సిజేరియన్లు) చేస్తూనే ఉన్నాయి. పేషెంటు రావడమే ఆలస్యం... ఏదో ఒక కారణం చెప్పి సిజేరియన్ ప్రసవం చేస్తున్నారు. సిజేరియన్ ద్వారా ప్రసవం చేయడం అటు తల్లికీ బిడ్డకూ మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరిస్తున్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో కోతల ప్రసవాలకు నియంత్రణే లేకుండాపోతోంది. వ్యాపారంగా మారిన ప్రసవాలు ప్రసవాలు పక్కా వ్యాపారమయ్యాయి. సాధారణ ప్రసవమైతే నర్సింగ్‌హోంలో రూ.10 వేలు కూడా బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే ఆస్పత్రి శ్రేణులను బట్టి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తారు. మూడు రోజులు ఇన్పేòÙంటుగా ఉంటే కనిష్టంగా రూ.50వేలు వేయొచ్చు. దీనికోసమే ఎక్కువ నర్సింగ్ హోంలలో సిజేరియన్ ప్రసవాలకే మొగ్గుచూపుతున్నారు. అదే ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటుతో పోల్చుకుంటే చాలా తక్కువ సిజేరియన్ ప్రసవాలుంటాయి. ఇకనైనా ప్రైవేట్ వైద్యులు తల్లీబిడ్డల ఆరోగ్యం దృష్ట్యా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. అనవసరంగా సిజేరియన్ చేయొద్దు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ చేశామంటే దానికి ఆడిట్ జరుగుతుంది. కారణం కచ్చితంగా చెప్పాలి. అందుకే ప్రభుత్వాస్పత్రుల్లో విధిలేకపోతే తప్ప సిజేరియన్ చేయం. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా నియంత్రణ ఉంది. డీఎంహెచ్ఓ పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరైనా సరే ప్రత్యేక కారణం లేకుండా సిజేరియన్ ప్రసవం చేయకూడదు. –డాక్టర్ కృష్ణవేణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్), అనంతపురం సిజేరియన్ డెలివరీతో నష్టాలు = డెలివరీ సమయంలో తల్లికి ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. = సిజేరియన్ గాయం వల్ల తల్లికి భవిష్యత్‌లో ఇతర సమస్యలు రావచ్చు. = ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు సోకితే తల్లికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. = సాధారణ ప్రసవమైతే వెంటనే శిశువుకు తల్లిపాలు వస్తాయి. సిజేరియన్ అయితే ఆలస్యం కావచ్చు. = సిజేరియన్ ప్రసవం వల్ల శిశువుకు శ్వాసకోశ సమస్యలు రావచ్చు. = ఒకసారి సిజేరియన్ అయితే రెండోసారి గర్భం దాల్చినప్పుడు మరిన్ని సమస్యలుంటాయి. = సిజేరియన్ వల్ల దీర్ఘకాలంలో వెన్నుపూస సమస్యలు లేదా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. -
ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం..
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. మరో రెండు రోజుల్లో దసరా .. ఆ తర్వాత దీపావళి .. అలా అలా కాలం గడిపేయకండి. నెమ్మదిగా, నిశ్చింతగా, చింత లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన, జరగబోయే ఆర్థిక వ్యవహారాల మీద ఒక కన్నేయండి. నిశితంగా పరిశీలించుకోండి. ప్రశ్నించుకోండి. పరీక్షించండి. పదండి ముందుకు.. ఈ విషయంలో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. మీ ముందుకు వస్తున్నారు. www.incometaxindia.gov.inని వెంటనే దర్శించండి. తరచుగా మీకు వచ్చే సందేహాలు, సమస్యలు, మిమ్మల్ని వేధించే ప్రశ్నలు.. మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం, నియమాలు, వాడాల్సిన ఫారంలు, దాఖలు చేయాల్సిన రిటర్నులు.. ఇలా ఎన్నెన్నో.. సవరణలు, వివరణలు, ఉదాహరణలు.. కొన్ని వందల ప్రశ్నలకు చక్కటి జవాబులు ఇందులో ఉన్నాయి. మీకు అర్థమయ్యే విధంగా, సులభంగా వివరించే Frequently Asked Questions.... సామాన్యమైన సందేహాలు, ప్రాథమిక అంశాలు మొదలు ప్రాముఖ్యమైన అంశాల వరకు.. చిన్న చిన్న సందేహాలు మొదలు పెద్ద సమస్యల వరకు.. అస్సెస్సీ తరఫు నుండి అసెస్మెంట్ పద్ధతి వరకు.. ఒక్క మాటలో చెప్పాలంటే అ నుండి అః వరకూ అన్నీ .. చట్టంలోని అన్ని అంశాలకు సంబంధించి కొన్ని వందల ప్రశ్నలకు జవాబులున్నాయి. వెబ్సైట్ దర్శించి ప్రతి చాప్టర్ చదవండి. కొన్ని మీకు వర్తించవచ్చు కొన్ని వర్తించకపోవచ్చు. ఏది ఏమిటనేది మీకు అర్థమవుతుంది. సులువుగా ఉంటుంది. నాన్–రెసిడెంట్లు, సీనియర్ సిటిజన్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, అన్ని వర్గాల వారికీ జీతం, ఇంటద్దె, వ్యాపారం/వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, పాన్, టాన్ .. ఇలా .. గిఫ్టులు, బహుమతులు, వ్యవసాయ ఆదాయం అన్నింటికీ జవాబులు ఉన్నాయి. నవంబర్ / డిసెంబర్లో సెక్షన్ 192 ప్రకారం కేవలం జీతం మీద ఆదాయం .. అంటే వేతన జీవులకు ప్రత్యేకంగా సర్క్యులర్ విడుదల చేస్తారు. అన్ని గవర్నమెంటు శాఖలకు చేరుతుంది. ఇతరులకు కూడా లభ్యమవుతుంది. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. వెబ్సైట్లో దొరుకుతుంది. ఇందులో అన్ని అంశాలు ఉంటాయి. ఏది మంచిది.. ఏది మీకు పనికొచ్చేది తెలుసుకునేందుకు ఉదాహరణలు ఉంటాయి. ఎక్కువ మందిని దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తారు. మీ నిజమైన పరిస్థితికి.. అంటే వాస్తవానికి దగ్గర్లో ఉంటాయి. అది చదవండి. అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కలు తేల్చి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. కొన్ని డాక్యుమెంట్లు వ్యవహారం జరిగిన / జరిపిన వెంటనే దొరుకుతాయి. వాటి కాపీలు తీసుకుని భద్రపర్చుకోండి. ఒక ఫైలు తెరవండి. అందులో అన్నీ దాచండి. బ్యాంకు ఎంట్రీలకు వివరణ రాసుకోండి. జ్ఞాపక శక్తి కన్నా ‘డాక్యుమెంట్’ చేయడమే మంచిది. -
జలమండలి అధికారుల బస్తీ బాట
సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా జలమండలి అధికారులు బస్తీబాట పడుతున్నారు. బస్తీలు, కాలనీలనే తేడా లేకుండా క్షేత్ర స్థాయిలో తమ సిబ్బందితో కలిసిపర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. వీలైనంతమేర ఆయాసమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతొ జలమండలి అధికారులు గడయిర 15 రోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. రోజుకో బస్తీ, రోజుకోకాలనీ చొప్పున ఆయా సెక్షన్లలోని సిబ్బందితో పాటు మేనేజర్లు, సిబ్బంది అంతా తిరుగుతూ స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్నారు. బంజారాహిల్స్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలినంగర్, తట్టికాన సెక్షన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ మొదలైంది. నల్లాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం, డ్రెయినేజీ సమస్యలు, కలుషిత నీటి సరఫరా తదితర సమస్యలను స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయా సెక్షన్లలోని సిబ్బంది అధికారులు ఎంపిక చేసిన బస్తీల్లో నిత్యం పర్యటిస్తూ సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపుతున్నారు. కొన్ని అక్కడే.. మరికొన్ని ఉన్నతాధికారుల నివేదనలో... స్పెషల్ డ్రైవ్‌లో వెలుగుచూస్తున్న కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు జలమండలి జీఎం హరిశంకర్ తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని కొన్ని సమస్యలను బస్తీవాసులు, కాలనీవాసులు అధికారులు దృష్టికి తెస్తుంటే వాటికి మాత్రం వెంటనే కాకుండా ప్రతిపాదనలు రూపొందించి వాటికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పరిష్కరిస్తామంటూ స్థానికులకు హామీ ఇస్తున్నారు. ♦ తట్టికాన సెక్షన్ పరిధిలో 15 బస్తీలు, ఫిలింనగర్ సెక్షన్‌పరిధిలో 13 బస్తీలు, జూబ్లీహిల్స్ సెక్షన్ పరిధిలో రెండు బస్తీలు, బంజారాహిల్స్ సెక్షన్ పరిధిలో 8 బస్తీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా సెక్షన్ల పరిధిలో నాలుగైదు బస్తీల్లో ఈ పర్యటనలు పూర్తయ్యాయి. స్థానికులను కలుపుకొని... నిత్యం ప్రజాప్రతినిధులు సమస్యల మీద ఆయా బస్తీలు, కాలనీల్లో తిరుగుతుంటారు. ఈ సారి అధికారులు ఎవరు ఫిర్యాదు చేసినా, చేయకపోయినా నేరుగా సమస్య ఉన్న ప్రాంతాలకే వెళ్లి వారితో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్థానికంగా ఉండే నేతలను వెంటబెట్టుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తిస్తున్నారు. ♦ ఆయా సెక్షన్లలో పని చేసే మేనేజర్లకు సైతం క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తెలుస్తుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. తద్వారా త్వరితగతిన సమస్యలు పరిష్కారమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. పాత పైపుల స్థానంలో... చాలా చోట్ల డ్రెయినేజీ పైపులు దెబ్బతినగా మరికొన్ని చోట్ల మ్యాన్‌హోళ్లు లీకవుతున్నాయి. 20 నుంచి 30 సంవత్సరాల క్రితం వేసిన పైపులు అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా వేసినవే. ప్రస్తుతం పరిమితికి మించి వినియోగంలో ఉన్నాయని పలువురు బస్తీవాసులు ఫిర్యాదు చేస్తున్నారు. పాత పైపుల స్థానంలో కొత్తవి వేయాలని అధికారులకు సూచిస్తున్నారు. -
మ్యూజిక్ ఇష్టపడే వారికి ఫేస్బుక్ గుడ్‌న్యూస్..
ముంబై: సంగీత ప్రియులకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ శనివారం శుభవార్త ప్రకటించింది. ఫేస్బుక్ తన అధికారిక సెక్షన్లో సంగీతానికి సంబంధించిన వీడియోలను(మ్యూజిక్ వీడియోలు)అందించనుంది. ఇప్పటికే సంగీత సంస్థలతో ఫేస్బుక్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే గత సంవత్సరం నుండే దేశీయ సంగీత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, సంగీత ప్రియులను ఆకర్శించడమే తమ అభిమతమని ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్ మానీష్ చోప్రా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంగీతాన్ని ప్రపంచానికి చేరవేసే అన్ని సాంకేతిక వనరులను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. కాగా మ్యూజిక్ ఫీచర్లు ఇండియా,ధాయ్‌లాండ్, యూఎస్ తదితర దేశాలలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఫేస్‌బుక్‌కు వీడియోలు అందించే కంపెనీల వివరాలు టీసిరీస్ మ్యూజిక్, జీమ్యూజిక్ కంపెనీ, యష్ రాజ్ ఫిల్మ్స్ తదితర కంపెనీలు వీడియోలు అందిస్తాయి. మరోవైపు సోనీ మ్యూజిక్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, బీఎమ్జీ తదితర దిగ్గజ సంస్థలతో ఫేస్బుక్ కలిసి పనిచేయనుంది. వినియోగదారులు సంగీత వీడియోల సెక్షన్‌కు వెళ్లి కావాల్సిన కళాకారుల పాటలను కూడా వీక్షించగలరు. ఫేస్బుక్ గ్రూప్స్, మెసెంజర్లతో వీడియోలను పంచుకోవచ్చు. -
ప్రతి 20 నిమిషాలకు ఓ మహిళపై లైంగిక దాడి
న్యాయం కావాలి అని అడగడం ప్రతి పౌరుడి హక్కు! జరుగుతోంది అన్యాయం అని తెలిస్తే కదా.. న్యాయం గురించి అడిగేది!! ముందు న్యాయం ఏమిటో చెప్పే కన్నా.. అన్యాయం ఏంటో చూపించాలి! దానికి బాలీవుడే దిక్సూచీ!! న్యాయం కావాలంటే .. న్యాయం చూడాలని ఎన్నో సినిమాలను ఆవిష్కరించింది!! నాలుగైదేళ్ల కిందట అనుకుంటా.. హైదరాబాద్‌లోని ‘లామకాన్’లో ఎల్జీబీటీక్యూ ఫెస్టివల్ ఏదో జరుగుతోంది. లోపలికి వెళ్లే ముందు ఆ ఇంటి ప్రహరీ గేట్‌కు.. ‘‘ప్లీజ్ లీవ్ యువర్ ప్రిజుడీస్ హియర్’’ అని రాసున్న బోర్డ్ ఉంది. అంటే భ్రమలు, భ్రాంతులు తొలగించుకొమ్మని అర్థం. ఇప్పుడు బాలీవుడ్ అదే చేస్తోంది. నాలుగు ఫైట్లు, ఆరు డ్యుయెట్లు, ఐటమ్ సాంగ్, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక వ్యాంప్ వంటి స్టీరియో టైప్ ఫార్ములాను కత్తిరించింది. సమకాలీన సమస్యల మీద ఫోకస్ చేసింది. హీరోయిన్ అయినా.. హీరో అయినా.. ఆఖరకు విలన్ అయినా కథే! కథావసరంగా పాత్రలు పుట్టుకు రావాలి కాని పాత్రల కోసం కథ అల్లట్లేదు. సమకాలీన ఆలోచనా ధోరణులు, అనుబంధాలు, సామాజిక అంశాలనే థీమ్‌గా తీసుకుంటోంది. అలా తెరకెక్కి కమర్షియల్ హిట్లయినవి ఉన్నాయి. క్రిటిక్స్ ప్రశంసలు పొందినవి ఉన్నాయి. విదేశీ ఫిల్మోత్సవ్లలో సందడి చేసి భారతీయ సినిమా పట్ల గౌరవాన్ని పెంపొందించనవీ ఉన్నాయి. థియేటర్ల నుంచి సైలెంట్‌గా ప్రేక్షకుల మెదళ్లకెక్కి చెరగని ముద్ర వేసినవీ ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ప్రస్తావించుకోకపోతే మార్పును స్వాగతించనట్టే! పైగా వాటి గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కూడా. కిందటి నెలలోనే ‘ఆర్టికల్ 15’ సినిమా విడుదలై టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది. సెప్టెంబర్ 13న ‘‘సెక్షన్ 375’’ చిత్రం రిలీజ్‌కానుంది. ట్రయిలర్స్తో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. సెక్షన్ 375.. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ‘సెక్షన్ 375’ రేప్ గురించి తెలియజేస్తుంది. స్త్రీ ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమె పట్ల ఎలాంటి సెక్సువల్ యాక్ట్ జరిగినా దాన్ని రేప్ కిందే పరిగణిస్తుందీ సెక్షన్. దీనికి సంబంధించి ఆరు రకాల వివరాలనూ ఇందులో పొందుపర్చారు. ఆమెకు ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా, ఆమెను బెదిరించి, భయాందోళనలకు గురి చేసి ఆమె అనుమతి తీసుకున్నా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, పెళ్లికి ముందే ఆమెతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఆమె మానసిక స్థితి బాగా లేనప్పుడు ఆమె నుంచి అనుమతి తీసుకున్నా, దాని పర్యవసానాలు తెలియక ఆమె అనుమతి ఇచ్చినా, పద్దెనిమిదేళ్ల లోపున్న అమ్మాయి ఇష్టపడి, అనుమతి ఇచ్చినా.. జరిగిన సెక్సువల్ యాక్ట్ రేప్ కిందకే వస్తుందని ఈ సెక్షన్లో ఉంది. అలాగే ఎలాంటి సెక్సువల్ యాక్ట్‌ను రేప్‌గా పరిగణిస్తారో కూడా వివరిస్తోందీ సెక్షన్. నిజ జీవితంలోని రేప్ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ ఐపీసీ 375ను చర్చించే కోర్ట్ రూమ్ మూవీయే‘సెక్షన్ 375’. ట్రైలర్‌ను బట్టి ఒక దళిత కాస్ట్ అసిస్టెంట్‌ను సినిమా డైరెక్టర్ రేప్ చేసిన కేస్‌ను డిఫెన్స్, ప్రాసిక్యూట్ అడ్వకేట్స్ వాదిస్తూంటారు. డిఫెన్స్ లాయర్‌గా అక్షయ్ ఖన్నా, ప్రాసిక్యూటర్‌గా రిచా చద్దా నటించారు. ఈ దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక మహిళ లైంగిక దాడిని ఎదర్కోవాల్సి వస్తోందని, ప్రతి లక్షమంది మహిళల్లో 1.8 మంది మహిళలు రేప్ జరిగే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, రేప్ చేసిన వాళ్లలో కేవలం 25 శాతం మంది నేరస్తులకు మాత్రమే శిక్ష పడ్తోందని, దాదాపు 75 శాతం కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ లెక్క చెప్తోంది. ‘‘సెక్షన్ 375’’కు అజయ్ బహెల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్టికల్ 15.. కుల మత జాతి ప్రాంత లింగ వివక్ష లేకుండా దేశంలోని పౌరులంతా సమానమే. అన్నిచోట్లా అందరికీ ప్రవేశం ఉంటుంది. అలాగని స్త్రీలు, పిల్లలు, వెనకబడిన వర్గాల వాళ్ల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలనుకున్నప్పుడు ఈ ఆర్టికల్ 15 వర్తించదు. వెనకబడిన వర్గాలను మిగిలిన పౌరులతో సమానంగా చేయడానికి ఈ ఆర్టికల్ సహకరిస్తుంది. 2014, ఉత్తరప్రదేశ్‌లోని బదాన్లో ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్ చేసి, చంపి అదే ఊళ్లో చెట్టుకు ఉరేసిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా కుల వ్యవస్థ గురించి, అది చేసే దారుణాల గురించి మాట్లాడుకునే స్థితిలో ఉండడమే విషాదం. తమ కూలి మూడు రూపాయలు పెంచమని అడిగిన పాపానికి ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్ చేసి, చంపి.. వాళ్ల ఔఖాద్ అంటే వాళ్ల స్థానం ఏంటో చూపించామని విర్రవీగిన ఆ ఊరి కామందుతో తలపడిన ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ పోరాటమే ‘ఆర్టికల్ 15’. పాతుకుపోయిన నాలుగంచెల కుల వ్యవస్థ, ఓట్ల కోసం దాన్ని కాపాడుకుంటున్న రాజకీయ వ్యవస్థ.. అధికారం కోసం అట్టడుగు వర్గాలను చీలుస్తున్న పాలనా వ్యవస్థను సినిమాటిక్‌గా షో చేయకుండా వాస్తవానికి దగ్గరగా చూపించిన సినిమా. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ అయి ఆడియెన్స్ అవార్డ్‌నూ అందుకుంది. ఆయుష్మాన్ ఖురానా, ఈషా తల్వార్, సయానీ గుప్తా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకుడు. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్కానున్నట్టు అంచనా. అలీగఢ్.. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్ నిజ జీవిత కథే ‘అలీగఢ్’ మూవీ. స్వలింగ సంపర్కం నేరమని.. తర్వాత జరిగిన ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాల ఫలితంతో నేరం కాదని చెప్పిన ఆర్టికల్ 377ను ఇండికేట్ చేసిన సినిమా ఇది. కథేంటంటే.. ప్రొఫెసర్ శ్రీనివాస్ రాంచంద్ర్ సిరాస్ హోమోసెక్సువల్ రిలేషన్‌షిప్స్‌ను వీడియో తీసి బయటపెడ్తారు కొందరు. దాంతో సిరాస్‌ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. కుటుంబ సభ్యులూ అతణ్ణి ఇంట్లోంచి వెళ్లగొడ్తారు. హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీ ఇది. ఎల్జీబీటీ హక్కుల గురించి డిస్కస్ చేసిన చలన చిత్రం. ‘‘ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా జొరబడే హక్కు ఎవరికీ లేదు.. ఆ మనిషి సమాజానికి హాని తలపెడితే తప్ప. అలాగే స్వలింగ సంపర్కం అనేది ఒక ధోరణి కాదని, నేచురల్ సెక్స్లాగే అదీ బయాలాజికల్ ఇన్స్టింక్ట్’’ అని అర్థం చేయించే సినిమా. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు. ప్రొఫెసర్ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటించారు. ఇరోస్ నౌ, అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆర్టికల్ 377 సడలింపు తర్వాత ఎల్జీబీటీ రైట్స్ మీద వచ్చిన మరో సినిమా ‘‘377’’. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది. పింక్... అమ్మాయి కట్టూబొట్టూ తీరు, వెళ్లే పార్టీలు, కలుసుకునే మనుషులను బట్టి ఆ అమ్మాయి మీద ఫలానా అని లేబుల్ వేసి.. చొరవ తీసుకొని ఒంటి మీద చేయి వేసే మగవాళ్లకు లెంప కాయ ‘పింక్’. అమ్మాయి ‘‘నో’’ అంటే ‘‘నో’’ అనే .. దానికి ఇంకా ఏ అర్థాలు ఉండవనీ.. వెదకొద్దని హెచ్చరించిన సినిమా. స్త్రీల లైంగిక హక్కులు, ఇష్టాయిష్టాల స్వేచ్ఛ గురించి మొదటి సారి స్క్రీన్ మీద చర్చించిన చిత్రం. ఆధునిక దుస్తుల్లో, అంతే ఆధునిక జీవనశైలితో ఉన్న అమ్మాయిలు మగవాళ్లతో చనువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్లు పడగ్గదికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కాదని.. తీర్పునిస్తుంది. మురికి తలపులతో ఉన్న మనసులను శుభ్రంగా కడిగేస్తుంది పింక్. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. పాడ్‌మన్... బహిష్టు.. అనే మాటను గట్టిగా అనడానికి ఆడవాళ్లే సాహసించని సమాజంలో ఓ భర్త.. ఆ క్రమం చుట్టూ ఉన్న అనారోగ్య వాతావరణాన్ని గూర్చి మథనపడి.. ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపెడ్తాడు. అదే ‘పాడ్‌మన్’ సినిమా. నిజ జీవిత గాథ. రుతుక్రమం పట్ల ఉన్న అపోహలు, అంధవిశ్వాసాలకు చెక్ పెట్టి.. సైలెన్స్‌ను బ్రేక్ చేసింది. ఇదీ సినిమాకు కథాంశమే అని నిరూపించింది. నెట్‌ఫ్లిక్స్, జీ5ల్లో ఉంది. టాయ్‌లెట్.. సేమ్ అండ్ షేమ్.. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా.. గ్రామీణ భారతం.. ఆ మాటకొస్తే నగరాల్లోని స్లమ్స్‌లో కూడా మరుగుదొడ్లు లేని పరిస్థితి. రియల్‌లైఫ్‌లోని ప్రియాంక అనే నవ వధువే ఈ సినిమాకు ప్రేరణ. ఓ ఇంటి కోడలు అత్తింట్లో మరుగుదొడ్డి కట్టించుకోవడమే కథ.. అదే హీరోయిన్.. హీరో అన్నీ! ఇదీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. న్యూ బిగినింగ్.. ఇలా దాదాపు 2000 సంవత్సరం నుంచీ బాలీవుడ్ కొత్త స్క్రీన్‌ను షేర్ చేస్తోంది. మనుషులనే పాత్రలుగా మలిచి జీవితాలను ఆవిష్కరిస్తోంది. కళ్లముందు కనిపిస్తున్నా మెదడుకు ఎక్కించుకోని విషయాలెన్నిటినో కథలుగా రాసుకుంటోంది. అందరికీ తెలియాల్సిన రాజ్యాంగ అధికరణల నుంచి అందరికి కావాల్సిన మరుగుదొడ్ల వరకు ఏ చిన్న డిటైల్నూ మిస్ చేయట్లేదు. ఇలాంటి సినిమాలతో బాలీవుడ్ న్యూ బిగినింగ్‌ను స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అక్షరం లేని, రాని చోట దృశ్యమే ఆయుధం అవుతుంది. సమస్యల అవగాహనకు సినిమాను మించిన మాధ్యమం ఏముంటుంది? అందుకే వీటిని మల్టీప్లెక్స్‌లకే కాకుండా గ్రామాల్లోని టాకీసులకూ పంపాలి. అందరూ చూసేలా చేయాలి. ఔర్ కు .. ‘ఉరి’ తీసిన కెమెరాతోనే ఇస్లామాఫోబియా ఇతివృత్తంగా ‘ముల్క్’ను, ‘హమీద్’, ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’అంటూ కశ్మిరీల పోరాటాన్నీ చూపించింది బాలీవుడ్. కశ్మీరియత్ ఉనికి అవసరాన్ని చెప్పింది. ‘నిల్ బట్టి సన్నాటా’తో స్త్రీ చదువును ప్రోత్సహిస్తూనే ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’, ‘వీరే దీ వెడ్డింగ్’లతో మహిళా సాధికారత మరో కోణాన్నీ పరిచయం చేసింది. ‘ఆలిఫ్’, ‘సూపర్ థర్టి’తో అందరికీ చదువుకునే రైట్ ఉందని డాల్బీ డిజిటల్ సౌండ్‌తో నినదించింంది. వీటన్నిటినీ నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5, ఇరోస్ నౌల్లో వీక్షించొచ్చు. ఇలాంటి కొత్త ట్రెండ్‌తో సెట్స్ మీద ఇంకెన్ని సినిమాలున్నాయో! వేచి చూద్దాం.. ఈ చేంజ్‌కు వెల్కమ్ చెప్దాం!– సరస్వతి రమ -
సర్కార్ ఎఫెక్ట్: పీక్స్‌లో 49-పీ
స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా అభ్యంతరకరమైన దృశ్యాలంటూ తమిళనాడు సర్కార్ గుర్రుగా ఉండటం ఒక ఎత్తయితే.. ఈ మూవీ ఒక కీలక అంశంపై చర్చకు తెరతీయడం మరోఎత్తు. అదే సెక్షన్ 49-పీ. ఓటు హక్కుపై అవగాహనపెంచడం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కొంత ప్రయత్నం చేసిన ఈ మూవీ 49-పీ అంశాన్ని చర్చకు తెచ్చిందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. ఈ మూవీలో 49పీ’ అనే ప్రస్తావన హీరో విజయ్ ద్వారా తేవడంతో ఒక్కసారిగా 49-పీపై జనానికి ఆసక్తి పెరిగింది. సర్కార్ మూవీని దర్శించిన ప్రేక్షకజనం గూగుల్‌లో 49పీ’ కోసం భారీగా సెర్చ్ చేసేశారు. దీంతో గూగుల్ ట్రెండింగ్ అనలిటిక్స్‌లో టాప్‌లో నిలిచింది. సినిమా విడుదలైన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో సర్కార్ మూవీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని ట్విటర్లో పోస్ట్ చేసింది. చర్చకు నేపథ్యం సన్ పిక్చర్స్ బ్యానర్ లో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటుగా, తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీ కథలో ఎన్నారై సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలో నెంబర్ వన్ కార్పొరేట్ సంస్థకు సీఈవో పని చేస్తుంటారు. ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో ఆయన ఓటు ఎవరో దొంగ ఓటు వేస్తారు. ఈ క్రమంలో ‘సెక్షన్ 49పి’ అంటూ ఒక చట్టాన్ని బయటపెడతారు. దీంతో ‘సెక్షన్ 49పి’ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటుందని ఆ విషయం తమకు తెలియదని, సినిమా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసినందుకు సర్కార్ యూనిట్ తోపాటు, తమఅభిమాన హీరో విజయ్‌కు కూడా ధన్యవాదాలు చెబుతున్నారు ఫ్యాన్స్. 49-పీ అంటే ఏమిటి? తన ఓటును మరొకరు వేసి దుర్వినియోగపర్చినప్పుడు, ఒక పౌరుడు తన ఓటును కాపాడుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు సదరు ఓటురు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరే అవకాశాన్ని ఈ సెక్షన్ పౌరుడికి కల్పిస్తుంది. ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961’లోని సెక్షన్ 49పీ చెబుతున్న అంశం ఇదే! ఈ విషయాన్నే ‘సర్కార్’ మూవీలో హీరో విజయ్ చేత చెప్పించారు డైరెక్టర్ మురుగదాస్. మరోవైపు తమిళనాడు సర్కార్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలను, డైలాగులను తొలగించేందుకు ఈ మూవీ మేకర్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటర్లకు మిక్సర్ గ్రైండ్లను అభ్యర్థులు పంపిణీ చేసే సీన్ తో సహా..ఇంకా పలు వివాదాస్పద డైలాగులను ఎడిట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. Google search trends peak for #49P after the release of #Sarkar. https://t.co/677MFHqDia@ARMurugadoss #BlockBusterSarkar #Thalapathykingofboxoffice pic.twitter.com/szBBPY1vIH — Sun Pictures (@sunpictures) November 7, 2018 -
ఏంటమ్మా.. ఇదీ!
‘‘బాస్ పిలుస్తున్నారు’’.సెక్షన్లోకి రాగానే.. అజయ్‌తో చెప్పింది పూజ. వాల్‌క్లాక్‌లో టైమ్ చూశాడు అజయ్. పదకొండు దాటి తొమ్మిది నిమిషాలైంది. ‘చచ్చాన్రా.. దేవుడా’ అనుకున్నాడు. తొమ్మిది నిముషాలు అలస్యం అయినందుకు బాస్ ఏమీ అనడు. నిన్న ఆఫీస్ టైమ్ అయిపోయాక కూడా తను ఆఫీస్‌లోనే ఉన్నాడు. అందుకు అంటాడు. అదీ అతడి భయం. ఆఫీస్ అవర్స్ ముగిశాక ఆఫీస్‌లో ఎందుకు ఉండవలసి వచ్చిందో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. క్రితం రోజు స్టాఫ్ ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ పంచ్ స్టేట్మెంట్ రోజూ బాస్ కన్నా ముందే అతడి టేబుల్ మీదకు వచ్చి ఉంటుంది. దాన్ని చూసి లోపలికి పిలుస్తాడు బాస్. తన ఔట్‌గోయింగ్‌లో ‘ఓవర్ స్టే’ అని ఉంటుంది. అందుకే తనను పిలిచి ఉంటాడు అనుకున్నాడు అజయ్. బాస్ క్యాబిన్ తలుపు మూసి ఉంది! సాధారణంగా అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఎవరికైనా అక్షింతలు పడబోతున్నప్పుడు మాత్రం అవి మూసుకుని ఉంటాయి. అది ఆయన అలవాటు. మూసి తిడతాడు. అదొక్కటే కాదు. ఇంకా కొన్ని రూల్స్ ఫాలో అవుతాడు బాస్. అవి ఆ బాస్ కన్నా పైవాళ్లు పెట్టిన రూల్స్ కావు. తనకు తను పెట్టుకున్నవి. ఆయనెప్పుడూ ఉమెన్ స్టాఫ్‌ని తిట్టడు. బాగా కోపం వస్తే మెల్లిగా మందలిస్తాడు. ‘ఏంటమ్మా.. ఇదీ!’ అని. దాన్నే తీవ్రస్థాయి అనుకోవాలి! వాళ్లని తిట్టే ఆ మాత్రపు తిట్టును కూడా మగవాళ్లను తిట్టినట్టుగా తలుపు మూసి తిట్టరు ఆయన. తలుపు తెరిచి ఉన్నప్పుడే లోపలికి పిలిపిస్తాడు. మృదువుగా.. ‘ఏంటమ్మా.. ఇది!’ అంటాడు. పూజ దగ్గరికి వచ్చి మెల్లిగా చెవి దగ్గర అడిగాడు అజయ్.. ‘‘ఎంతసేపైంది వచ్చి?’’ అని.‘‘నేనా.. ఇప్పుడే’’ అంది పూజ నవ్వుతూ. అజయ్ కోపంగా చూశాడు. ‘‘నువ్వెప్పుడొస్తే ఏంటి? బాస్ వచ్చి ఎంతసేపైందో చెప్పు?’’ అన్నాడు. ‘‘లోపలికి వెళ్తావుగా.. చెప్తాడులే.. వచ్చి ఎంతసేపైందో’’ అంది పూజ నవ్వుతూ. కొరకొర చూశాడు అజయ్. ‘‘వెళ్లు.. ఇప్పటికే రెండుసార్లు బెల్ కొట్టాడు.. నీ కోసం’’.. అంది.పూజ కూర్చునే వరుసకు రెండు వరుసల అవతల సరిగ్గా ఆమెకు ఎదురుబొదురుగా ఉంటుంది అజయ్ సీటు. అక్కడికి వెళ్లబోతుంటే.. ‘‘ముందు బాస్‌ని కలువు. మళ్లీ బెల్లు కొడతారేమో’’ అంది పూజ. నేరుగా బాస్ క్యాబిన్‌కి వెళ్లి, మూసి ఉన్న తలుపుపై వేళ్లతో తట్టాడు అజయ్.. ‘మే ఐ కమిన్ సర్’ అన్నట్లు!‘కమిన్’ అని అటువైపు నుంచి ఏమీ వినిపించలేదు. బాస్ మెల్లిగా ‘కమిన్’ అన్నాడేమో, తనకు వినిపించి ఉండదనుకుని డోర్ నాబ్‌ని కిందికి తిప్పి తలుపును కొద్దిగా లోపలికి తోసి.. మళ్లీ ‘మే ఐ కమిన్ సర్’ అంటూ తల లోపలికి పెట్టి చూసి.. నివ్వెరపోయాడు అజయ్. పగలపడి నవ్వుతోంది పూజ. పూజ నవ్వు ఆగట్లేదు. అజయ్‌నే చూస్తూ పడీ పడీ నవ్వుతోంది. తనని ఫూల్‌ని చేశానన్న ఆనందం అది. అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకు ఇంతగా ఎందుకు సంతోషపడిపోతారో అతడికి అర్థం కాదు. వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. లాంగ్షాట్లో అతడినే చూస్తూ నవ్వుతోంది పూజ. ఆమె ముఖానికీ, తన ముఖానికీ మధ్య సిస్టమ్ మానిటర్ అడ్డు వచ్చేలా తన కుర్చీని కాస్త కిందికి అడ్జెస్ట్ చేసుకున్నాడు అజయ్. అతడలా కూర్చున్న కొద్దిసేపటికే బాస్ క్యాబిన్ నుంచి బెల్ మోగింది! వచ్చినట్లున్నాడు!సీట్లోంచి పైకి లేవబోయాడు అజయ్. ‘‘పూజా..’’ పెద్దగా పిలిచాడు బాస్.తిట్టేందుకు పిలవకపోయినా, తిట్టినట్టు పిలవడం బాస్ అలవాటు. ‘‘కూర్చోమ్మా..’’ అన్నాడు బాస్, పూజ లోపలికి వెళ్లగానే. ఆయనెప్పుడూ స్టాఫ్‌ని కూర్చోమని అనడు. ఆ అవసరమే రాదు. రెండు ముక్కల్లో చెప్పాల్సింది చెప్పి పంపించేస్తాడు. ‘‘లుక్.. పూజా.. ఆఫీస్ అవర్స్ అయిపోయాక కూడా ఎవరైనా ఆఫీస్‌లోనే ఉన్నారంటే.. నేననుకోవడం.. సమ్ అదర్ ఇన్టెన్షన్ ఏదో వాళ్లకు ఉంటుందని.. అదర్ దేన్ ఆఫీస్ వర్క్. అది నాకు ఇష్టం లేదు. మార్నింగ్ లేట్‌గా వచ్చినందుకు ఈవెనింగ్ లేట్ అయ్యేంత వరకు పని చేయవలసిన అవసరం, అంత పని ఉండే సెక్షన్ ఏమీ కాదు మనది. అజయ్ ఈ మధ్య రిపీటెడ్‌గా.. తన షిఫ్ట్ అయ్యాక కూడా ఆఫీస్‌లోనే ఉంటున్నాడు’’ అన్నాడు బాస్. ఆమెకు కొంచెం అర్థమైంది. ‘‘పనైపోయాక కూడా అజయ్ ఆఫీసులోనే ఉండడం.. నీ కోసమేనని నేను అనుకుంటున్నాను పూజా’’ అన్నాడు బాస్.పూజ మౌనంగా ఉండిపోయింది. ఆయనా ఇంకేమీ మాట్లాడలేదు. కనీసం.. ‘ఏంటమ్మా.. ఇదీ!’ అని కూడా మందలించలేదు. ‘ఈ మాట చెప్దామనే..’ అన్నట్లు మాత్రం చూశాడు. పూజ బయటికి వచ్చింది. బయటికి రాగానే ‘ఏంటటా?’ అన్నట్లు చూశాడు అజయ్. ‘క్యాంటీన్లో చెప్తా’ అన్నట్లు సైగ చేసింది పూజ. ఇదంతా రెండేళ్ల క్రిందటి మాట. ఇప్పటికీ ఆ క్యాబిన్లోంచి అప్పుడప్పుడు ‘పూజా’, ‘అజయ్’ అనే పిలుపులు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి! పూజకు, అజయ్‌కి మాత్రమే కాదు. మిగతా స్టాఫ్‌కు కూడా. అలా వినిపించినప్పుడు.. ‘నాకు వినిపించింది! నీకు వినిపించిందా?’ అన్నట్లు ఒకరివైపు ఒకరు చూసుకుంటారు. బాస్ ఆత్మ ఇక్కడే తిరుగుతోందని అనుకుంటూ ఉంటారు. కొత్తగా వచ్చిన లేడీ బాస్ కూడా ఒక రోజు స్టాఫ్‌ని అడిగింది.. ‘ఎవరో ఎవర్నో పిలిచినట్లు నాకు అనిపిస్తోంది. మీకు అనిపిస్తోందా’ అని. అలాంటప్పుడు పూజ, అజయ్ బాధగా ఒకర్నొకరు చూసుకుంటారు. వాళ్లిద్దరంటే పాత బాస్‌కు వాత్సల్యం. వాళ్లక్కూడా ఆయనంటే ఇష్టం. ‘‘వాయిస్‌గా కాకుండా, బాస్‌గా ఎదురైతే.. ఆయన్ని నేనొకటి అడుగుతాను’’ అన్నాడు ఓ రోజు అజయ్ ఎమోషనల్‌గా. అంతక్రితమే సెక్షన్లో అందరికీ మళ్లీ ఒకసారి బాస్ గొంతు వినిపించింది!‘ఏమని అడుగుతావ్?’ అన్నట్లు అజయ్ వైపు చూసింది పూజ. ‘‘సార్.. ఆఫీస్ అయ్యాక కూడా మీరింకా ఆఫీస్‌లోనే ఎందుకు ఉంటున్నారు సార్ అని అడుగుతాను’’ అంటూ.. కురుస్తున్న కళ్లపై వేళ్లను అదిమి పెట్టుకున్నాడు అజయ్. పూజ మృదువుగా అజయ్ చేతిని పట్టుకుంది. ‘‘పనైపోయాక కూడా అజయ్ ఆఫీసులోనే ఉండడం.. నీ కోసమేనని నేను అనుకుంటున్నాను పూజా’’ అన్నాడు బాస్. - మాధవ్ శింగరాజు -
మళ్లీ ఉత్కంఠ
దివీస్ బాధిత గ్రామాల్లో ఈ నెల 28 వరకూ 144 సెక్షన్ అమలు నేడు భూముల్లోకి వెళ్లేందుకు రైతుల సన్నద్ధం సీపీఎం ఆధ్వర్యంలో రెఢీ పోలీసుల మోహరింపు... తొండంగి: కోన తీరంలో దివీస్ లేబరేటరీస్‌కు ప్రభుత్వం కేటాయించిన రైతుల భూముల్లోకి బాధిత గ్రామాల ప్రజలు వెళ్లేందుకు గురువారం ప్రయత్నించనున్న నేపథ్యంలో తీరప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దివీస్‌కు ప్రభుత్వం దానవాయిపేట, కోదాడ గ్రామల పంచాయతీల పరిధిలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 671 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి విదితమే. సుమారు పది నెలల నుంచి రైతులు దివీస్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు, విప్లవ సంఘాలు మద్దతు పలకడంతో పలు దఫాలుగా ఉద్యమంలో భాగంగా రోడ్‌షోలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. రైతుల స్వాధీనంలో ఉన్న భూముల్లోనూ, హైకోర్టు స్టేటస్కో ఇచ్చిన భూముల్లోనూ దివీస్ యాజమాన్యం ప్రహరీ గోడ, ఇతర నిర్మాణాలను చేపట్టడం ప్రారంభించింది. దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ బాధిత గ్రామాల రైతులు రెవెన్యూ, పోలీసు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులపాటు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే, విచారణలు చేపట్టి ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరగలేదని ప్రకటించడంతో ప్రభుత్వాధికారుల తీరుపై ఆ ప్రాంత ప్రజలు మరింత మండిపడుతున్నారు. దీంతో బాధిత గ్రామాల రైతులు సీపీఎం ఆధ్వర్యంలో గురువారం తమ భూముల్లోకి ప్రవేశించి సాగు చేసుకునేందుకు సన్నద్ధమవడంతో ప్రభుత్వం భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎనిమిది రోజులపాటు 144 సెక్షన్... కోన ప్రాంతంలో రైతులు దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలో తమ భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్న నేపధ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా తీరప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు ఒంటిమామిడి పోలీస్‌స్టేన్ హెచ్‌సీ మాణిక్యం తెలిపారు. బాధిత గ్రామాల్లోనూ, బీచ్‌రోడ్డులోనూ సుమారు 300 మంది -
జిల్లాలో నిషేధాజ్ఞలు : ఎస్పీ
కాకినాడ క్రైం : నెల రోజుల పాటు జిల్లాలో నిషేధాజ్ఞలు విధిస్తూ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టరాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెక్షన్-30 ప్రకారం శాంతి భద్రతలు, అంతర్గత భద్రత పరిరక్షణలో భాగంగా నవంబర్ ఒకటి నుంచి 30 వరకూ కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్ల పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు, ఆందోళనలు నిర్వహించరాదని, మైక్‌లతో ప్రచారం చేపట్టరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. -
144 సెక్షన్ ఎత్తేయాలి
డీజీపీని కలిసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల జనగామ : జనగామలో కొనసాగుతున్న 144 సెక్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గురువారం హైదరాబాద్‌లో డీజీపీ అనురాగ్‌శర్మను క లిసి కోరారు. జనగామ కాంగ్రెస్ శ్రే ణులతో కలిసి పొన్నాల డీజీపీ కా ర్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భం గా పొన్నాల మాట్లాడుతూ రెండు నెలలకు పైగా 144 సెక్షన్ విధించి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నా రు. జనగామను 11వ జిల్లాగా చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మాట తప్పుతున్నారని విమర్శించా రు. ఆయన చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం జనగామ నియోజకవర్గాన్ని ముక్కలు చేయకుండా, జిల్లా చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. పొన్నాల వెంట నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, రంగరాజు ప్రవీణ్ కుమార్, ధర్మపు రి శ్రీనివాస్, ఎండి అన్వర్, మేడ శ్రీ నివాస్, మంగ సత్యం, మేకల రాం ప్రసాద్, పన్నీరు రాధిక,ఆలేటి ల క్ష్మి,వెన్నెం శ్రీలత,మజార్ షరీఫ్, వ ంగాల మల్లారెడ్డి, సిద్దిరాములు, జక్కుల వేణుమాధవ్, కొండ శ్రీని వాస్,మాజీద్, అన్వర్ ఉన్నారు. -
బరితెగించిన ‘చేపల’ మాఫియా!
అధికారుల సంతకాలు ఫోర్జరీ ఆలస్యంగా వెలుగు చూసిన వైనం ఇరిగేషన్‌శాఖ ఉద్యోగి హస్తం విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ డివిజన్లో చేపల చెరువుల మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరింజేసుకునేందుకు ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనఆలస్యంగా వెలుగు చూసింది. చేపల చెరువుల అనుమతుల ఫైళ్లలో తమ సంతకాలు ఫోర్జరీ చేశారని గమనించిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ఈలకు తెలియజేశారు. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగి సాయంతో ఈ వ్యవహారం నడిపించారని అనుమానిస్తున్నారు. ఆ ఉద్యోగి నెలరోజులుగా సెలవులో ఉండడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈఏడాది గుడివాడ డివిజన్లోని గుడివాడ, నందివాడ, కైకలూరు. మండవల్లి, కలిదిండి మండలాల్లో పెద్ద ఎత్తున చేపల చెరువుల తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే నందివాడ మండలంలోని వివిధ గ్రామాల్లో 20 మంది రైతులు 400 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. పోలుకొండ డ్రైనేజీ సెక్షన్ పరిధిలో రైతులు చేసిన దరఖాస్తులపై డ్రైనేజీ శాఖ జేఈ కవిత, ఆ శాఖ డీఈ హరనాధ్ బాబు సంతకాలు ఫోర్జరీ చేసి జిల్లా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌కు పంపారు. అయితే చేపల చెరువుల అనుమతుల విషయంలో తాము క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉందని, డ్రైనేజీ గట్లు ఆనుకుని ఉన్న చెరువుల అనుమతులపై పరిశీలించాల్సి ఉందని డ్రైనేజీ శాఖ ఈఈ వాసంతి కలెక్టర్‌కు నివేదిక పంపారు. దీంతో సంబంధిత ఫైళ్లన్నీంటిని కలెక్టర్ రఘునందన్‌రావు వెనక్కి పంపారు. దీనిపై విచారణకు జేసీని నియమించారు. దీంతో గతనెల మూడో వారంలో జిల్లా జేసీ గుడివాడకు వచ్చి ఇరిగేషన్ డ్రైనేజీ శాఖలతోపాటు, రెవెన్యూశాఖ అధికారులను పిలిపించి మాట్లాడారు. ఫైళ్లను చూపించారు. పోలుకొండ సెక్షన్ పరిధిలో ఉన్న ఫైళ్లను చూసిన డ్రైనేజీ శాఖ డీఈ హరనాధ్‌బాబు, జేఈ కవిత ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సంతకాలు తమవి కావని తేల్చారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌కు, ఇరిగేషన్‌శాఖ ఎస్ఈకి వీరిద్దరూ వివరణ ఇచ్చారు. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని విచారణకు ఆదేశించినట్లు సమాచారం. డ్రైనేజీ డీఈ హరనాద్బాబును, డ్రైనేజీ శాఖ పోలుకొండ సెక్షన్ జేఈ కవితను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈవిషయమై తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామనిచెప్పారు. తమ సంతకాలు ఫోర్జరీ అయిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులు విచారణలో నిజానిజాలు వెలుగులోకొస్తాయని తెలిపారు. రెవెన్యూశాఖ తప్పిదాలే ఫోర్జరీలకు దారి తీసిందా?... చేపల చెరువుల అనుమతుల విషయంలో రెవెన్యూశాఖది కీలక బాధ్యత. చెరువుల అనుమతులకు 8శాఖల అధికారులతో సమావేశమై సంతకాలు తీసుకోవాల్సి ఉంది. అలా కాకుండా చేపల చెరువుల యజమానులకు నేరుగా ఫైళ్లు ఇచ్చి ఎవరికి వారే ఆయా శాఖల అధికారుల వద్దకు వెళ్లి సంతకాలు పెట్టించుకురమ్మని పంపుతున్నారు. ఫలితంగా ఈఫోర్జరీ వ్యవహారానికి తెరలేసినట్లు తేలింది. పరారీలో ఇరిగేషన్‌శాఖ ఉగ్యోగి? ఇరిగేషన్‌శాఖ గుడివాడ డివిజన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఫోర్జరీ వ్యవహారానికి సాయపడ్డాడని తెలుస్తోంది. పోలుకొండ సెక్షన్ జేఈ ప్రొహిబిషన్‌లో ఉండటంతో ఆమె నిజాయితీగా వ్యవహరిస్తారని తెలిసిన చేపల చెరువుల యజమానులు ఇరిగేషన్ శాఖఉగ్యోగిని ప్రోత్సహించి ఫోర్జరీ వ్యవహారానికి తెగబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయట పడిన నాటినుంచి ఇరిగేషన్‌శాఖలో పనిచేసే ఉద్యోగి ఉన్నతాధికారులకు కనీస సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. గత నెల 18నుంచి ఆయన విధులకు రావటం లేదని ఇరిగేషన్‌శాఖ డీఈ అనీల్‌బాబు పేర్కొన్నారు. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపితేనే వాస్తవం తేలుతుందని పలువురు పేర్కొంటున్నారు.