ప్రియ, భార్గవ్.. మూడేళ్లుగా లివ్ ఇన్ టుగెదర్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఆరు నెలల కిందట ప్రియకు ఉద్యోగం పోయింది. దాంతో ఇంటి బాధ్యత అంతా భార్గవ్‌దే. అయితే ప్రియ ఇటీవల భార్గవ్ ఏం చేసినా తప్పు పడుతోంది. ఎవరితో మాట్లాడనివ్వకుండా.. తనతో తప్ప ఎవరితో ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తోంది. ఆఫీస్ అవసరాల రీత్యా భార్గవ్ కొలీగ్స్‌కి ఫోన్ చేసినా, ఫోన్ ని అతను అటెండ్ అయినా పెద్ద యుద్ధమే! గొడవలే! భరించలేక భార్గవ్ ఒకరోజు ‘ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు.. నీతో కలసి ఉండలేను’ అన్నాడు. దాంతో ప్రియ ‘నాతో బ్రేకప్ చేసుకుంటే నీ మీద రేప్ కేసు పెడతా’ అని బెదిరించింది. హడలిపోయాడు భార్గవ్. నిజంగానే ప్రియకు ఆ హక్కు ఉందా?
కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా.. మోసపూరితంగా, ఓ పథకం ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ స్త్రీతో శారీరక సంబంధం నెరపితే.. సదరు పురుషుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రేప్ అయితే యావజ్జీవం కూడా పడవచ్చు. జూన్ 30 వరకు అమల్లో ఉన్న పాత శిక్షాస్మృతి ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసపూరితంగా స్త్రీతో శారీరకసంబంధం నెరపిన పురుషుడిపై ఐపీసీ 376, ఐపీసీ 420 సెక్షన్ లను కలిపి కేసు నమోదు చేసేవారు.
అయితే, ఆ పురుషుడు మొదటినుంచీ మోసం చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు అని రుజువుకాకపోతే మాత్రం దాన్ని రేప్‌గా పరిగణించలేమని హైకోర్ట్, సుప్రీంకోర్టు పేర్కొన్న సందర్భాలు, తీర్పులూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా చూడాల్సినదేంటంటే.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా చేసుకుంటానని నమ్మించి కేవలం శారీరక సంబంధం కోసమే అతను లివ్ ఇన్‌లో ఉన్నాడా అనే అంశం. మొదట బాగానే ఉన్నాడు.. పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు.. కానీ తర్వాత మనస్పర్థలు, భేదాభి్రపాయాలు వచ్చి విడి΄ోవాలనుకుంటున్నాడు అని రుజువైతే శిక్ష పడదు. భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం కూడా లివ్ ఇన్ రిలేషన్ లోని పురుషుడు ‘మోసపూరితమైన ఆలోచనతోనే రిలేషన్ మొదలు పెట్టాడు’ అని రుజువు చేయాలి.
అయితే ఈ కేస్ స్టడీలో భార్గవ్ మీద ప్రియ కేసు పెట్టే అవకాశం కచ్చితంగా ఉంది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇన్నాళ్లు లివ్ ఇన్ లో ఉండి ఇప్పుడు వద్దు అంటున్నాడని ప్రియ రుజువు చేయగలిగితే భార్గవ్‌కి పదేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సెక్షన్ 69 వలన సహజీవనం, ప్రేమ అనే అంశాలు ఆది నుంచీ అనుమానంతో మొదలయ్యే ప్రమాదం ఉంది. సహజీవనానికి ముందు లేదా కలసి ఉంటున్న క్రమంలో ఒకరిపై ఒకరు స్పష్టత తెచ్చుకోవడం అవసరం. ఇలాంటి రిలేషన్స్ వ్యక్తిగతమైనప్పటికీ, వీలైనంత మేర అందరికీ తెలిసేలా ఉండడం లేదా కనీసం సన్నిహితులకైనా తెలిసుండటం వల్ల కొంతవరకు రక్షణ కలగవచ్చు.
– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్
Comments
Please login to add a commentAdd a comment