ఏంటమ్మా.. ఇదీ! | funday horror story | Sakshi
Sakshi News home page

ఏంటమ్మా.. ఇదీ!

Published Sun, Apr 22 2018 12:23 AM | Last Updated on Sun, Apr 22 2018 12:23 AM

funday horror story - Sakshi

‘‘బాస్‌ పిలుస్తున్నారు’’.సెక్షన్‌లోకి రాగానే.. అజయ్‌తో చెప్పింది పూజ. వాల్‌క్లాక్‌లో టైమ్‌ చూశాడు అజయ్‌. పదకొండు దాటి తొమ్మిది నిమిషాలైంది. ‘చచ్చాన్రా.. దేవుడా’ అనుకున్నాడు. తొమ్మిది నిముషాలు అలస్యం అయినందుకు బాస్‌ ఏమీ అనడు. నిన్న ఆఫీస్‌ టైమ్‌ అయిపోయాక కూడా తను ఆఫీస్‌లోనే ఉన్నాడు. అందుకు అంటాడు. అదీ అతడి భయం. ఆఫీస్‌ అవర్స్‌ ముగిశాక ఆఫీస్‌లో ఎందుకు ఉండవలసి వచ్చిందో ఎక్స్‌ప్లనేషన్‌ ఇవ్వాలి. క్రితం రోజు స్టాఫ్‌ ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్‌ పంచ్‌ స్టేట్‌మెంట్‌ రోజూ బాస్‌ కన్నా ముందే అతడి టేబుల్‌ మీదకు వచ్చి ఉంటుంది. దాన్ని చూసి లోపలికి పిలుస్తాడు బాస్‌. తన ఔట్‌గోయింగ్‌లో ‘ఓవర్‌ స్టే’ అని ఉంటుంది. అందుకే తనను పిలిచి ఉంటాడు అనుకున్నాడు అజయ్‌. బాస్‌ క్యాబిన్‌ తలుపు మూసి ఉంది! సాధారణంగా అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఎవరికైనా అక్షింతలు పడబోతున్నప్పుడు మాత్రం అవి మూసుకుని ఉంటాయి. అది ఆయన అలవాటు. మూసి తిడతాడు. అదొక్కటే కాదు. ఇంకా కొన్ని రూల్స్‌ ఫాలో అవుతాడు బాస్‌. అవి ఆ బాస్‌ కన్నా పైవాళ్లు పెట్టిన రూల్స్‌ కావు. తనకు తను పెట్టుకున్నవి. ఆయనెప్పుడూ ఉమెన్‌ స్టాఫ్‌ని తిట్టడు. బాగా కోపం వస్తే మెల్లిగా మందలిస్తాడు. ‘ఏంటమ్మా.. ఇదీ!’ అని. దాన్నే తీవ్రస్థాయి అనుకోవాలి! వాళ్లని తిట్టే ఆ మాత్రపు తిట్టును కూడా మగవాళ్లను తిట్టినట్టుగా తలుపు మూసి తిట్టరు ఆయన. తలుపు తెరిచి ఉన్నప్పుడే లోపలికి పిలిపిస్తాడు. మృదువుగా.. ‘ఏంటమ్మా.. ఇది!’ అంటాడు. పూజ దగ్గరికి వచ్చి మెల్లిగా చెవి దగ్గర అడిగాడు అజయ్‌.. ‘‘ఎంతసేపైంది వచ్చి?’’ అని.‘‘నేనా.. ఇప్పుడే’’ అంది పూజ నవ్వుతూ.

అజయ్‌ కోపంగా చూశాడు. ‘‘నువ్వెప్పుడొస్తే ఏంటి? బాస్‌ వచ్చి ఎంతసేపైందో చెప్పు?’’ అన్నాడు. ‘‘లోపలికి వెళ్తావుగా.. చెప్తాడులే.. వచ్చి ఎంతసేపైందో’’ అంది పూజ నవ్వుతూ. కొరకొర చూశాడు అజయ్‌. ‘‘వెళ్లు.. ఇప్పటికే రెండుసార్లు బెల్‌ కొట్టాడు.. నీ కోసం’’.. అంది.పూజ కూర్చునే వరుసకు రెండు వరుసల అవతల సరిగ్గా ఆమెకు ఎదురుబొదురుగా ఉంటుంది అజయ్‌ సీటు. అక్కడికి వెళ్లబోతుంటే.. ‘‘ముందు బాస్‌ని కలువు. మళ్లీ బెల్లు కొడతారేమో’’ అంది పూజ. నేరుగా బాస్‌ క్యాబిన్‌కి వెళ్లి, మూసి ఉన్న తలుపుపై వేళ్లతో తట్టాడు అజయ్‌.. ‘మే ఐ కమిన్‌ సర్‌’ అన్నట్లు!‘కమిన్‌’ అని అటువైపు నుంచి ఏమీ వినిపించలేదు. బాస్‌ మెల్లిగా ‘కమిన్‌’ అన్నాడేమో, తనకు వినిపించి ఉండదనుకుని డోర్‌ నాబ్‌ని కిందికి తిప్పి తలుపును కొద్దిగా లోపలికి తోసి.. మళ్లీ ‘మే ఐ కమిన్‌ సర్‌’ అంటూ తల లోపలికి పెట్టి చూసి.. నివ్వెరపోయాడు అజయ్‌.

పగలపడి నవ్వుతోంది పూజ. పూజ నవ్వు ఆగట్లేదు. అజయ్‌నే చూస్తూ పడీ పడీ నవ్వుతోంది. తనని ఫూల్‌ని చేశానన్న ఆనందం అది. అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకు ఇంతగా ఎందుకు సంతోషపడిపోతారో అతడికి అర్థం కాదు. వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. లాంగ్‌షాట్‌లో అతడినే చూస్తూ నవ్వుతోంది పూజ. ఆమె ముఖానికీ, తన ముఖానికీ మధ్య సిస్టమ్‌ మానిటర్‌ అడ్డు వచ్చేలా తన కుర్చీని కాస్త కిందికి అడ్జెస్ట్‌  చేసుకున్నాడు అజయ్‌. అతడలా కూర్చున్న కొద్దిసేపటికే బాస్‌ క్యాబిన్‌ నుంచి బెల్‌ మోగింది! వచ్చినట్లున్నాడు!సీట్లోంచి పైకి లేవబోయాడు అజయ్‌. ‘‘పూజా..’’ పెద్దగా పిలిచాడు బాస్‌.తిట్టేందుకు పిలవకపోయినా, తిట్టినట్టు పిలవడం బాస్‌ అలవాటు. 

‘‘కూర్చోమ్మా..’’ అన్నాడు బాస్, పూజ లోపలికి వెళ్లగానే. ఆయనెప్పుడూ స్టాఫ్‌ని కూర్చోమని అనడు. ఆ అవసరమే రాదు. రెండు ముక్కల్లో చెప్పాల్సింది చెప్పి పంపించేస్తాడు. ‘‘లుక్‌.. పూజా.. ఆఫీస్‌ అవర్స్‌ అయిపోయాక కూడా ఎవరైనా ఆఫీస్‌లోనే ఉన్నారంటే.. నేననుకోవడం.. సమ్‌ అదర్‌ ఇన్‌టెన్షన్‌ ఏదో వాళ్లకు ఉంటుందని.. అదర్‌ దేన్‌ ఆఫీస్‌ వర్క్‌. అది నాకు ఇష్టం లేదు. మార్నింగ్‌ లేట్‌గా వచ్చినందుకు ఈవెనింగ్‌ లేట్‌ అయ్యేంత వరకు పని చేయవలసిన అవసరం, అంత పని ఉండే సెక్షన్‌ ఏమీ కాదు మనది. అజయ్‌ ఈ మధ్య రిపీటెడ్‌గా.. తన షిఫ్ట్‌ అయ్యాక కూడా ఆఫీస్‌లోనే ఉంటున్నాడు’’ అన్నాడు బాస్‌. 
ఆమెకు కొంచెం అర్థమైంది. ‘‘పనైపోయాక కూడా అజయ్‌ ఆఫీసులోనే ఉండడం.. నీ కోసమేనని నేను అనుకుంటున్నాను పూజా’’ అన్నాడు బాస్‌.పూజ మౌనంగా ఉండిపోయింది. ఆయనా ఇంకేమీ మాట్లాడలేదు. కనీసం.. ‘ఏంటమ్మా.. ఇదీ!’ అని కూడా మందలించలేదు. ‘ఈ మాట చెప్దామనే..’ అన్నట్లు మాత్రం చూశాడు. పూజ బయటికి వచ్చింది. బయటికి రాగానే ‘ఏంటటా?’ అన్నట్లు చూశాడు అజయ్‌. ‘క్యాంటీన్‌లో చెప్తా’ అన్నట్లు సైగ చేసింది పూజ.

ఇదంతా రెండేళ్ల క్రిందటి మాట. ఇప్పటికీ ఆ క్యాబిన్‌లోంచి అప్పుడప్పుడు ‘పూజా’, ‘అజయ్‌’ అనే పిలుపులు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి! పూజకు, అజయ్‌కి మాత్రమే కాదు. మిగతా స్టాఫ్‌కు కూడా. అలా వినిపించినప్పుడు.. ‘నాకు వినిపించింది! నీకు వినిపించిందా?’ అన్నట్లు ఒకరివైపు ఒకరు చూసుకుంటారు. బాస్‌ ఆత్మ ఇక్కడే తిరుగుతోందని అనుకుంటూ ఉంటారు. కొత్తగా వచ్చిన లేడీ బాస్‌ కూడా ఒక రోజు స్టాఫ్‌ని అడిగింది.. ‘ఎవరో ఎవర్నో పిలిచినట్లు నాకు అనిపిస్తోంది. మీకు అనిపిస్తోందా’ అని. అలాంటప్పుడు పూజ, అజయ్‌ బాధగా ఒకర్నొకరు చూసుకుంటారు. వాళ్లిద్దరంటే పాత బాస్‌కు వాత్సల్యం. వాళ్లక్కూడా ఆయనంటే ఇష్టం. 

‘‘వాయిస్‌గా కాకుండా, బాస్‌గా ఎదురైతే.. ఆయన్ని నేనొకటి అడుగుతాను’’ అన్నాడు ఓ రోజు అజయ్‌ ఎమోషనల్‌గా. అంతక్రితమే సెక్షన్‌లో అందరికీ మళ్లీ ఒకసారి బాస్‌ గొంతు వినిపించింది!‘ఏమని అడుగుతావ్‌?’ అన్నట్లు అజయ్‌ వైపు చూసింది పూజ. ‘‘సార్‌.. ఆఫీస్‌ అయ్యాక కూడా మీరింకా  ఆఫీస్‌లోనే ఎందుకు ఉంటున్నారు సార్‌ అని అడుగుతాను’’ అంటూ.. కురుస్తున్న కళ్లపై వేళ్లను అదిమి పెట్టుకున్నాడు అజయ్‌. పూజ మృదువుగా అజయ్‌ చేతిని పట్టుకుంది. ‘‘పనైపోయాక కూడా అజయ్‌ ఆఫీసులోనే ఉండడం..  నీ కోసమేనని నేను అనుకుంటున్నాను పూజా’’ అన్నాడు బాస్‌.
- మాధవ్‌ శింగరాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement