ప్రతి 20 నిమిషాలకు ఓ మహిళపై లైంగిక దాడి | Section 375 Special Story | Sakshi
Sakshi News home page

న్యాయం చూడాలి

Published Sat, Aug 17 2019 7:32 AM | Last Updated on Sat, Aug 17 2019 8:19 AM

Section 375 Special Story - Sakshi

న్యాయం కావాలి అని అడగడం ప్రతి పౌరుడి హక్కు! జరుగుతోంది అన్యాయం అని తెలిస్తే కదా.. న్యాయం గురించి అడిగేది!! ముందు న్యాయం ఏమిటో చెప్పే కన్నా.. అన్యాయం ఏంటో చూపించాలి!
దానికి బాలీవుడే దిక్సూచీ!! న్యాయం కావాలంటే .. న్యాయం చూడాలని ఎన్నో సినిమాలను ఆవిష్కరించింది!!

నాలుగైదేళ్ల కిందట అనుకుంటా.. హైదరాబాద్‌లోని ‘లామకాన్‌’లో ఎల్‌జీబీటీక్యూ ఫెస్టివల్‌ ఏదో జరుగుతోంది. లోపలికి వెళ్లే ముందు ఆ ఇంటి ప్రహరీ గేట్‌కు.. ‘‘ప్లీజ్‌ లీవ్‌ యువర్‌ ప్రిజుడీస్‌ హియర్‌’’ అని రాసున్న బోర్డ్‌ ఉంది. అంటే భ్రమలు, భ్రాంతులు తొలగించుకొమ్మని అర్థం. ఇప్పుడు బాలీవుడ్‌ అదే చేస్తోంది. నాలుగు ఫైట్లు, ఆరు డ్యుయెట్లు, ఐటమ్‌ సాంగ్, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక వ్యాంప్‌ వంటి స్టీరియో టైప్‌ ఫార్ములాను కత్తిరించింది. సమకాలీన సమస్యల మీద ఫోకస్‌ చేసింది. హీరోయిన్‌ అయినా.. హీరో అయినా.. ఆఖరకు విలన్‌ అయినా కథే! కథావసరంగా పాత్రలు పుట్టుకు రావాలి కాని పాత్రల కోసం కథ అల్లట్లేదు. సమకాలీన ఆలోచనా ధోరణులు, అనుబంధాలు, సామాజిక అంశాలనే థీమ్‌గా తీసుకుంటోంది. అలా తెరకెక్కి కమర్షియల్‌ హిట్లయినవి ఉన్నాయి. క్రిటిక్స్‌ ప్రశంసలు పొందినవి ఉన్నాయి. విదేశీ ఫిల్మోత్సవ్‌లలో సందడి చేసి భారతీయ సినిమా పట్ల గౌరవాన్ని పెంపొందించనవీ ఉన్నాయి. థియేటర్ల నుంచి సైలెంట్‌గా ప్రేక్షకుల మెదళ్లకెక్కి చెరగని ముద్ర వేసినవీ ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ప్రస్తావించుకోకపోతే మార్పును స్వాగతించనట్టే!

పైగా వాటి గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కూడా. కిందటి నెలలోనే ‘ఆర్టికల్‌ 15’ సినిమా విడుదలై టాక్‌ ఆఫ్‌ ది కంట్రీ అయింది. సెప్టెంబర్‌ 13న ‘‘సెక్షన్‌ 375’’ చిత్రం రిలీజ్‌కానుంది. ట్రయిలర్స్‌తో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.

సెక్షన్‌ 375..
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని ‘సెక్షన్‌ 375’ రేప్‌ గురించి తెలియజేస్తుంది. స్త్రీ ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమె పట్ల ఎలాంటి సెక్సువల్‌ యాక్ట్‌ జరిగినా దాన్ని రేప్‌ కిందే పరిగణిస్తుందీ సెక్షన్‌. దీనికి సంబంధించి ఆరు రకాల వివరాలనూ ఇందులో పొందుపర్చారు. ఆమెకు ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా, ఆమెను బెదిరించి, భయాందోళనలకు గురి చేసి ఆమె అనుమతి తీసుకున్నా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, పెళ్లికి ముందే ఆమెతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఆమె మానసిక స్థితి బాగా లేనప్పుడు ఆమె నుంచి అనుమతి తీసుకున్నా, దాని పర్యవసానాలు తెలియక ఆమె అనుమతి ఇచ్చినా, పద్దెనిమిదేళ్ల లోపున్న అమ్మాయి ఇష్టపడి, అనుమతి ఇచ్చినా.. జరిగిన సెక్సువల్‌ యాక్ట్‌ రేప్‌ కిందకే వస్తుందని ఈ సెక్షన్‌లో ఉంది. అలాగే ఎలాంటి సెక్సువల్‌ యాక్ట్‌ను రేప్‌గా పరిగణిస్తారో కూడా వివరిస్తోందీ సెక్షన్‌. నిజ జీవితంలోని రేప్‌ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ ఐపీసీ 375ను చర్చించే కోర్ట్‌ రూమ్‌ మూవీయే‘సెక్షన్‌ 375’. ట్రైలర్‌ను బట్టి ఒక దళిత కాస్ట్‌ అసిస్టెంట్‌ను సినిమా డైరెక్టర్‌ రేప్‌ చేసిన కేస్‌ను డిఫెన్స్, ప్రాసిక్యూట్‌ అడ్వకేట్స్‌ వాదిస్తూంటారు. డిఫెన్స్‌ లాయర్‌గా అక్షయ్‌ ఖన్నా, ప్రాసిక్యూటర్‌గా రిచా చద్దా నటించారు. ఈ దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక మహిళ లైంగిక దాడిని ఎదర్కోవాల్సి వస్తోందని, ప్రతి లక్షమంది మహిళల్లో 1.8 మంది మహిళలు రేప్‌ జరిగే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, రేప్‌ చేసిన వాళ్లలో కేవలం 25 శాతం మంది నేరస్తులకు మాత్రమే శిక్ష పడ్తోందని, దాదాపు 75 శాతం కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్‌ లెక్క చెప్తోంది. ‘‘సెక్షన్‌ 375’’కు అజయ్‌ బహెల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆర్టికల్‌ 15..
కుల మత జాతి ప్రాంత లింగ వివక్ష లేకుండా దేశంలోని పౌరులంతా సమానమే. అన్నిచోట్లా అందరికీ ప్రవేశం ఉంటుంది. అలాగని స్త్రీలు, పిల్లలు, వెనకబడిన వర్గాల వాళ్ల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలనుకున్నప్పుడు ఈ ఆర్టికల్‌ 15 వర్తించదు. వెనకబడిన వర్గాలను మిగిలిన పౌరులతో సమానంగా చేయడానికి ఈ ఆర్టికల్‌ సహకరిస్తుంది. 2014, ఉత్తరప్రదేశ్‌లోని బదాన్‌లో ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్‌ చేసి, చంపి అదే ఊళ్లో చెట్టుకు ఉరేసిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా కుల వ్యవస్థ గురించి, అది చేసే దారుణాల గురించి మాట్లాడుకునే స్థితిలో ఉండడమే విషాదం. తమ కూలి మూడు రూపాయలు పెంచమని అడిగిన పాపానికి ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్‌ చేసి, చంపి.. వాళ్ల ఔఖాద్‌ అంటే వాళ్ల స్థానం ఏంటో చూపించామని విర్రవీగిన ఆ ఊరి కామందుతో తలపడిన ఒక యంగ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ పోరాటమే ‘ఆర్టికల్‌ 15’. పాతుకుపోయిన నాలుగంచెల కుల వ్యవస్థ, ఓట్ల కోసం దాన్ని కాపాడుకుంటున్న రాజకీయ వ్యవస్థ.. అధికారం కోసం అట్టడుగు వర్గాలను చీలుస్తున్న పాలనా వ్యవస్థను సినిమాటిక్‌గా షో చేయకుండా వాస్తవానికి దగ్గరగా చూపించిన సినిమా. లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్క్రీన్‌ అయి ఆడియెన్స్‌ అవార్డ్‌నూ అందుకుంది. ఆయుష్మాన్‌ ఖురానా, ఈషా తల్వార్, సయానీ గుప్తా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు అనుభవ్‌ సిన్హా దర్శకుడు. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌కానున్నట్టు అంచనా.

అలీగఢ్‌..
అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్‌ నిజ జీవిత కథే ‘అలీగఢ్‌’ మూవీ. స్వలింగ సంపర్కం నేరమని.. తర్వాత జరిగిన ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాల ఫలితంతో నేరం కాదని చెప్పిన ఆర్టికల్‌ 377ను ఇండికేట్‌ చేసిన సినిమా ఇది. కథేంటంటే.. ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రాంచంద్ర్‌ సిరాస్‌ హోమోసెక్సువల్‌ రిలేషన్‌షిప్స్‌ను వీడియో తీసి బయటపెడ్తారు కొందరు. దాంతో సిరాస్‌ను కాలేజ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తారు. కుటుంబ సభ్యులూ అతణ్ణి ఇంట్లోంచి వెళ్లగొడ్తారు. హ్యూమన్‌ ఇంటరెస్ట్‌ స్టోరీ ఇది. ఎల్‌జీబీటీ హక్కుల గురించి డిస్కస్‌ చేసిన చలన చిత్రం. ‘‘ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా జొరబడే హక్కు ఎవరికీ లేదు.. ఆ మనిషి సమాజానికి హాని తలపెడితే తప్ప. అలాగే స్వలింగ సంపర్కం అనేది ఒక ధోరణి కాదని, నేచురల్‌ సెక్స్‌లాగే అదీ బయాలాజికల్‌ ఇన్‌స్టింక్ట్‌’’ అని అర్థం చేయించే సినిమా. హన్సల్‌ మెహతా దర్శకత్వం వహించారు. ప్రొఫెసర్‌ పాత్రలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించారు. ఇరోస్‌ నౌ, అమేజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఆర్టికల్‌ 377 సడలింపు తర్వాత ఎల్‌జీబీటీ రైట్స్‌ మీద వచ్చిన మరో సినిమా ‘‘377’’. ఇది జీ5లో స్ట్రీమ్‌ అవుతోంది.

పింక్‌...
అమ్మాయి కట్టూబొట్టూ తీరు, వెళ్లే పార్టీలు, కలుసుకునే మనుషులను బట్టి ఆ అమ్మాయి మీద ఫలానా అని లేబుల్‌ వేసి.. చొరవ తీసుకొని ఒంటి మీద చేయి వేసే మగవాళ్లకు లెంప కాయ ‘పింక్‌’. అమ్మాయి ‘‘నో’’ అంటే ‘‘నో’’ అనే .. దానికి ఇంకా ఏ అర్థాలు ఉండవనీ.. వెదకొద్దని హెచ్చరించిన సినిమా. స్త్రీల లైంగిక హక్కులు, ఇష్టాయిష్టాల స్వేచ్ఛ గురించి మొదటి సారి స్క్రీన్‌ మీద చర్చించిన చిత్రం. ఆధునిక దుస్తుల్లో, అంతే ఆధునిక జీవనశైలితో ఉన్న అమ్మాయిలు మగవాళ్లతో చనువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్లు పడగ్గదికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కాదని.. తీర్పునిస్తుంది. మురికి తలపులతో ఉన్న మనసులను శుభ్రంగా కడిగేస్తుంది పింక్‌. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

పాడ్‌మన్‌...
బహిష్టు.. అనే మాటను గట్టిగా అనడానికి ఆడవాళ్లే సాహసించని సమాజంలో ఓ భర్త.. ఆ క్రమం చుట్టూ ఉన్న అనారోగ్య వాతావరణాన్ని గూర్చి మథనపడి.. ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపెడ్తాడు. అదే ‘పాడ్‌మన్‌’ సినిమా. నిజ జీవిత గాథ. రుతుక్రమం పట్ల ఉన్న అపోహలు, అంధవిశ్వాసాలకు చెక్‌ పెట్టి.. సైలెన్స్‌ను బ్రేక్‌ చేసింది. ఇదీ సినిమాకు కథాంశమే అని నిరూపించింది. నెట్‌ఫ్లిక్స్, జీ5ల్లో ఉంది.

టాయ్‌లెట్‌..
సేమ్‌ అండ్‌ షేమ్‌.. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా.. గ్రామీణ భారతం.. ఆ మాటకొస్తే నగరాల్లోని స్లమ్స్‌లో కూడా మరుగుదొడ్లు లేని పరిస్థితి. రియల్‌లైఫ్‌లోని ప్రియాంక అనే నవ వధువే ఈ సినిమాకు ప్రేరణ. ఓ ఇంటి కోడలు అత్తింట్లో మరుగుదొడ్డి కట్టించుకోవడమే కథ.. అదే హీరోయిన్‌.. హీరో అన్నీ! ఇదీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

న్యూ బిగినింగ్‌..
ఇలా దాదాపు 2000 సంవత్సరం నుంచీ బాలీవుడ్‌ కొత్త స్క్రీన్‌ను షేర్‌ చేస్తోంది. మనుషులనే పాత్రలుగా మలిచి జీవితాలను ఆవిష్కరిస్తోంది. కళ్లముందు కనిపిస్తున్నా మెదడుకు ఎక్కించుకోని విషయాలెన్నిటినో కథలుగా రాసుకుంటోంది. అందరికీ తెలియాల్సిన రాజ్యాంగ అధికరణల నుంచి అందరికి కావాల్సిన మరుగుదొడ్ల వరకు ఏ చిన్న డిటైల్‌నూ మిస్‌ చేయట్లేదు. ఇలాంటి సినిమాలతో బాలీవుడ్‌ న్యూ బిగినింగ్‌ను స్టార్ట్‌ చేసిందని చెప్పొచ్చు. అక్షరం లేని, రాని చోట దృశ్యమే ఆయుధం అవుతుంది. సమస్యల అవగాహనకు సినిమాను మించిన మాధ్యమం ఏముంటుంది? అందుకే వీటిని మల్టీప్లెక్స్‌లకే కాకుండా గ్రామాల్లోని టాకీసులకూ పంపాలి. అందరూ చూసేలా చేయాలి.

ఔర్‌ కు ..
‘ఉరి’ తీసిన కెమెరాతోనే ఇస్లామాఫోబియా ఇతివృత్తంగా ‘ముల్క్‌’ను, ‘హమీద్‌’, ‘నో ఫాదర్స్‌ ఇన్‌ కశ్మీర్‌’అంటూ కశ్మిరీల పోరాటాన్నీ చూపించింది బాలీవుడ్‌. కశ్మీరియత్‌ ఉనికి అవసరాన్ని చెప్పింది. ‘నిల్‌ బట్టి సన్నాటా’తో స్త్రీ చదువును ప్రోత్సహిస్తూనే ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’, ‘వీరే దీ వెడ్డింగ్‌’లతో మహిళా సాధికారత మరో కోణాన్నీ పరిచయం చేసింది. ‘ఆలిఫ్‌’, ‘సూపర్‌ థర్టి’తో అందరికీ చదువుకునే రైట్‌ ఉందని డాల్బీ డిజిటల్‌ సౌండ్‌తో నినదించింంది. వీటన్నిటినీ నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5, ఇరోస్‌ నౌల్లో వీక్షించొచ్చు. ఇలాంటి కొత్త ట్రెండ్‌తో సెట్స్‌ మీద ఇంకెన్ని సినిమాలున్నాయో! వేచి చూద్దాం.. ఈ చేంజ్‌కు వెల్‌కమ్‌ చెప్దాం!– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement