సర్కార్‌ ఎఫెక్ట్‌: పీక్స్‌లో 49-పీ | section 49-p top in google search | Sakshi
Sakshi News home page

సర్కార్‌ ఎఫెక్ట్‌: పీక్స్‌లో 49-పీ

Published Fri, Nov 9 2018 11:29 AM | Last Updated on Fri, Nov 9 2018 12:21 PM

section 49-p  top in google  search - Sakshi

స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్‌, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.  ముఖ‍్యంగా  అభ్యంతరకరమైన దృశ్యాలంటూ తమిళనాడు సర్కార్‌ గుర్రుగా ఉండటం ఒక ఎత్తయితే.. ఈ మూవీ ఒక కీలక అంశంపై చర్చకు  తెరతీయడం మరోఎత్తు. అదే సెక్షన్‌ 49-పీ.

ఓటు హక్కుపై అవగాహనపెంచడం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కొంత ప్రయత్నం చేసిన ఈ మూవీ  49-పీ  అంశాన్ని  చర్చకు  తెచ్చిందంటే ఏ మాత్రం అతిశయోక్తి  కాదేమో. ఈ మూవీలో 49పీ’ అనే ప్రస్తావన హీరో  విజయ్ ద్వారా తేవడంతో ఒక‍్కసారిగా 49-పీపై  జనానికి ఆసక్తి పెరిగింది. సర్కార్‌ మూవీని దర్శించిన ప్రేక్షకజనం గూగుల్లో 49పీ’ కోసం  భారీగా సెర్చ్‌  చేసేశారు. దీంతో గూగుల్ ట్రెండింగ్ అనలిటిక్స్‌లో టాప్‌లో  నిలిచింది. సినిమా విడుదలైన 24 గంటల్లోనే ఈ పరిణామం  చోటు చేసుకుంది. దీంతో సర్కార్ మూవీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్  ఈ విషయాన్ని  ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

చర్చకు నేపథ్యం
సన్ పిక్చర్స్ బ్యానర్ లో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటుగా, తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే.  ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీ కథలో ఎన్నారై సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలో నెంబర్ వన్ కార్పొరేట్ సంస్థకు సీఈవో పని చేస్తుంటారు. ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో ఆయన ఓటు ఎవరో దొంగ ఓటు వేస్తారు. ఈ క్రమంలో ‘సెక్షన్ 49పి’ అంటూ ఒక చట్టాన్ని బయటపెడతారు.  దీంతో  ‘సెక్షన్ 49పి’  తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటుందని ఆ విషయం తమకు తెలియదని, సినిమా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసినందుకు సర్కార్ యూనిట్ తోపాటు, తమఅభిమాన హీరో విజయ్‌కు కూడా ధన్యవాదాలు చెబుతున్నారు ఫ్యాన్స్‌.

49-పీ అంటే ఏమిటి?
తన ఓటును మరొకరు వేసి దుర్వినియోగపర్చినప్పుడు,  ఒక  పౌరుడు తన ఓటును కాపాడుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు సదరు ఓటురు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరే అవకాశాన్ని ఈ  సెక్షన్‌ పౌరుడికి కల్పిస్తుంది.  ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961’లోని సెక్షన్ 49పీ చెబుతున్న అంశం ఇదే!  ఈ విషయాన్నే ‘సర్కార్’ మూవీలో హీరో విజయ్ చేత చెప్పించారు డైరెక్టర్ మురుగదాస్.

మరోవైపు తమిళనాడు సర్కార్‌ గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలను, డైలాగులను తొలగించేందుకు ఈ మూవీ మేకర్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది.  ముఖ్యంగా ఓటర్లకు మిక్సర్ గ్రైండ్లను అభ్యర్థులు పంపిణీ చేసే సీన్ తో సహా..ఇంకా పలు వివాదాస్పద డైలాగులను ఎడిట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement