నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు అయిదవ నెల. ఎలాంటి పరిస్థితిలో సిజేరియన్‌కి వెళ్లొచ్చో చెప్తారా?
– సీహెచ్. రమోల, చెన్నై
మీకిప్పుడు అయిదవ నెల అంటున్నారు. సాధారణంగా సుఖ ప్రసవమా? లేక సిజేరియనా అనేది తొమ్మిదవ నెలలో అయితే కచ్చితంగా చెప్పగలుగుతాం. తల్లీ, బిడ్డ కండిషన్‌ను ఫిజికల్ ఎగ్జామ్, స్కానింగ్ ద్వారా చెప్పవచ్చు. కానీ కొన్ని కండిషన్స్‌లో మాత్రం తప్పకుండా సిజేరియనే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంతకుముందేమైనా గర్భసంచికి సంబంధించిన సర్జరీ, రెండు లేదా ఎక్కువసార్లు సిజేరియన్ అయినా, మైయోమెక్టమీ (ఫైబ్రాయిడ్‌ను తొలగించే శస్త్రచికిత్స) సర్జరీ అయినా, యూటరైన్ అనామలీస్ (పుట్టకతోనే గర్భసంచీకి సంబంధించిన సమస్య) ఉన్నా, తొమ్మిదోనెలలో మాయ కిందకి ఉన్నా, పొట్టలో బిడ్డ ట్రాన్స్‌వర్స్ పొజిషన్ లేదా బ్రీచ్ పొజిషన్‌లో ఉన్నా, కవలలు, ట్రిప్‌లెట్స్ ఉన్నా.
బిడ్డ రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉన్నా, బిడ్డ నాలుగున్నర కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్నా, బీపీతో ఫిట్స్ వచ్చినా, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, తొమ్మిదవనెలలో 38–39 వారాల మధ్య ముందుగానే అనుకుని సిజేరియన్ చేస్తారు. ఒకవేళ సాధారణ కాన్పులో నొప్పులు వస్తున్నప్పుడు.. బిడ్డ హార్ట్ బీట్ తగ్గినా, రక్తస్రావం అధికంగా అవుతున్నా.. ప్రోగ్రెస్ సరిగా లేనప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది.
ఏ ప్రాబ్లమ్ లేకపోయినా ఈ మధ్య మెటర్నల్ రిక్వెస్ట్ మీద కొంతమందికి ఆపరేషన్ చేస్తున్నారు. ఇది తల్లి ఆరోగ్యానికి అంత మంచిదికాదు. పేషంట్, కుటుంబానికి కౌన్సెలింగ్ చేసి.. సాధారణ కాన్పుతో ఉన్న ఉపయోగాలను, ఆపరేషన్ వల్ల కలిగే ఇబ్బందులను వివరించి అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లను ఆపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment