పర్యాటకాభివృద్ధికి బాటలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పూడికతో ఉనికి కోల్పోయిన మెట్ల బావులకు మహర్దశ కలిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావి, భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయం వద్ద ఉన్న మెట్ల బావులకు అప్పటి కలెక్టర్ జితేష్ వి పాటిల్ చొరవతో పూర్వ వైభవం చేకూరింది. దీంతో పర్యాటకులు వాటిని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మెట్ల బావులు ఉనికి కోల్పోతున్న విషయమై ‘సాక్షి’ అక్షర సమరం సాగించింది.
2022 జనవరి 29న లింగంపేటలోని నాగన్న బావి ఉనికి కోల్పోతున్న వైనంపై ‘మెట్ల బావిలో నిర్లక్ష్యపు పూడిక’ శీర్షికన, తరువాత వరుసగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. నాగన్నగారి బావిని సందర్శించిన కలెక్టర్.. గ్రామస్తులతో కలిసి ముళ్ల పొదలు, చెట్లను తొలగించడంతో మొదలైన పనులు.. పూడిక తొలగించే వరకు కొనసాగింది.
రెయిన్ వాటర్ ప్రాజెక్టు అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ కల్పనా రమేశ్‌తో మాట్లాడి.. వారి సహకారంతో దానికి పూర్వవైభవం తీసుకువచ్చారు. భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయ ప్రాంగణంలో మరుగున పడిన మెట్ల బావిని అద్భుతంగా తీర్చిదిద్దారు. మెట్ల బావి వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు.
సిద్దరామేశ్వరా లయం దర్శనానికి వెళ్లిన వారంతా.. మెట్ల బావి కట్టడాన్ని చూసి అబ్బురపడుతున్నారు. ఫొటోలు దిగుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో రెండు మెట్ల బావులు, రాజంపేట మండల కేంద్రంలో ఒకటి, లింగంపేట మండలం శెట్పల్లి, నాగిరెడ్డిపేట మండలం మాటూరు గ్రామాల్లో మెట్ల బావులను గుర్తించి.. వాటిలో పేరుకుపోయిన పూడికను తొలగించి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది.
నాగన్నగారి బావిని సందర్శించిన ‘జూపల్లి’
లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావిని గత నెలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో కలిసి సందర్శించారు. మెట్ల బావికి పూర్వవైభవం తేవడాన్ని అభినందించారు. పర్యాటక శాఖ ద్వారా మరింత వైభవం తీసుకొస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధతో పూర్వవైభవం వచ్చింది.
ప్రస్తుత కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దానికి మరింత వన్నె తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా మెట్ల బావులను కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్ల బావులకు పూర్వవైభవం సమకూరడం పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment