డిచ్‌పల్లి : జిల్లాలోని మోడల్ స్కూళ్లల్లో ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డిచ్‌పల్లి శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లి దండ్రులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఆదరా బాదరగా ఏర్పాటు చేసిందని, కానీ వాటిలో మౌలిక వసతులు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు.
ఉపాధ్యాయులు, లెక్చరర్లు లేక విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలు ఉదయం పాఠశాలకు వచ్చి, ఒకటి రెండు తరగతులు పూర్తయిన తర్వాత ఖాళీగా కూర్చుని సాయంత్రం ఇళ్లకు వెళుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే మోడల్ స్కూళ్లు, కళాశాలల్లో ఉపాధ్యాయులను, లెక్చరర్లను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాస్తారోకోతో రహదారిపై ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి ఎస్సై-2 శ్రీధర్‌గౌడ్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను సముదాయించి రాస్తారోకో విరమింప జేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కార్తీక్, సతీశ్, శ్రీకాంత్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రవి, ఉపసర్పంచ్ గంగాధర్, మోహన్, సత్యప్రసాద్ పాల్గొన్నారు.
‘మోడల్’ టీచర్లను నియమించాలి
Published Wed, Aug 6 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement