తన పిల్లలతో సుభాష్‌చంద్రబోస్‌చారి (ఫైల్)
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్) : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ చారి (32) పాఠాలు బోధిస్తూనే గుండెపోటుతో మృతిచెందారు. కళాశాల వర్గాలు తెలిపిన వివరాలు ప్రకారం.. సుభాష్ చంద్రబోస్ చారి రోజులాగే బుధవారం విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా గుండె పోటుకు గురయ్యాడు.
వెంటనే తోటి అధ్యాపకులు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్ ఆయనను పరిశీలించి ఇంజెక్షన్ ఇచ్చాడు. కొద్దిసేపటికి నొప్పి అధికం కాగా సుభాష్ చంద్రబోస్ మృతి చెందాడు. అయితే తోటి అధ్యాపకులు హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
మృతుడు సుభాష్ చంద్రబోస్ చారి వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య, కూతురు, 8 నెలల బాబు ఉన్నారు. సుభాష్‌చంద్రబోస్ మృతి తెలియగానే ఆయన కుటుంబసభ్యులు, బంధువులు పరిగి నుంచి బయలుదేరి రాత్రికి నిజామాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు.
అధ్యాపకులు, విద్యార్థుల కంటతడి..
డిచ్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ జువాలజీ విభాగంలో సుభాష్ చంద్రబోస్ 2012 లో కాంట్రాక్టు అధ్యాపకుడిగా చేరాడు. నాణ్యమైన బోధన అందిస్తూ విద్యార్థులకు చేరువయ్యారు. ఆయన మృతిని చూసి తట్టుకోలేకపోయిన అధ్యాపకులు, విద్యార్థులు కంట తడి పెట్టారు.
ఒత్తిడితోనే గుండెపోటు..?
సొంత జిల్లాకు బదిలీ చేయాలని సుభాష్ చంద్రబోస్ ఉన్నతాధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భార్యాపిల్లలకు దూరంగా ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతిచెందారని తోటి అధ్యాపకులు వాపోయారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ప్రిన్సిపాల్ రామదాస్, అధ్యాపకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment