డిచ్‌పల్లిలో ప్రభుత్వ స్థలం కబ్జా | occupy the government place in dichpally | Sakshi
Sakshi News home page

డిచ్‌పల్లిలో ప్రభుత్వ స్థలం కబ్జా

Published Wed, Feb 5 2014 4:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

occupy the government place in dichpally

 డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: ఒకప్పుడు బతుకుదెరువు పేరు చెప్పి ప్రభుత్వ స్థలాల్లో చిన్నచిన్న కోకాలు, రేకుల షెడ్లు వేసుకున్న వారే ఇప్పుడు ఆ స్థలాలను కబ్జా చేస్తున్నారు.ఏళ్ల నుంచి ఇక్కడ మేమే ఉంటున్నాం, కాబట్టి ఈ స్థలం మాదే అంటూ దబాయిస్తున్నారు. స్థానిక అధికారులను ప్రలోభపెట్టి ఇంటి నెంబరు పొందడంతో పాటు ఆ స్థలాలను తమ పేరిట మార్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా వాటిలో పక్కా నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఇత రులకు అమ్ముకుంటున్నారు.

ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు, స్థానిక సిబ్బంది ఇదంతా తమకేమి పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. తమకెందుకులే అనుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.  ఇదంతా ఏ మారుమూల ప్రాంతంలోనో జరగడం లేదు. సాక్షాత్తు జిల్లా కేంద్రానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోని డిచ్‌పల్లి మం డలకేంద్రంలో ఈ కబ్జా పర్వం కొనసాగుతోంది.

 ఇదీ సంగతి....
 పీడబ్ల్యూడీకి డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ ఎదుట అర ఎకరం స్థలం ఉండేది. అనంతరం ఆ స్థలం ఆర్‌అండ్‌బీకి మారింది. ఈ స్థలంలో ఒక బస్ షెల్టర్, నాలా, దర్గాతో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భవనం ఉండేది. బతుకు దెరువు పేరిట కొందరు ఈ స్థలం లో చిన్నచిన్న కోకాలు, హోటళ్లు ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం తర్వాత తమ కోకాలు, హోటళ్లకు ఇంటి నెంబర్లు పొందారు. అప్పుడు భూముల విలువ చాలా తక్కువ ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం రైల్వేస్టేషన్ ఎదుట గజం ధర రూ.25,000 నుంచి రూ.30,000 వేలు పలుకుతోంది.

 దీంతో ఆర్‌ఐ క్వార్టర్ స్థలంలో ఉన్న కోకా లు, హోటళ్లు నడుపుకుంటున్న వారిలో ఒకరు ఆ స్థలం తమదేనంటూ పక్కా ఇంటి నిర్మాణాలు చేపట్టారు. మరొకరు రూ.26 లక్షలకు స్థలాన్ని ఇతరులకు అమ్మివేసినట్లు తెలిసింది. ప్రభుత్వ స్థలంలో ఇలా కబ్జాలు చేస్తూ పక్కా నిర్మాణాలు చేపట్టినా, ఇతరులకు అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ అధికారులకు నడిపల్లి గ్రామపెద్దలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కొందరు వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement