government lands
-
ప్రభుత్వ గయాళు భూమిపై టీడీపీ రాజకీయం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ లక్షలాది మంది గళమెత్తినప్పుడు కానీ.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలని వర్గాలకు అతీతంగా వేలాది మంది రోడెక్కినపుడు కానీ.. విశాఖలో కనిపించని చంద్రబాబు.. ఇప్పుడు పెందుర్తి మండలం పినగాడి గ్రామానికి వెళ్లడానికి విమానంలో వచ్చారంటే! అదేదో అంతకన్నా పెద్ద సమస్య అనుకుంటే పొరపాటే! కేవలం 9 ఎకరాల ప్రభుత్వ గయాళు భూమి సమస్య! దాన్ని ఆక్రమించుకున్న 12 మందికీ దాదాపు రూ.16.20 కోట్ల విలువైన ఆస్తిని సమకూర్చి.. ఆ 9 ఎకరాల్లో 432 మంది నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పంపై నిరసన తెలపడానికి వచ్చారని తెలిసి విశాఖ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు! విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని ప్రకటించినా హర్షించక.. వర్గ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబును ప్రజలు విశాఖ విమానాశ్రయం నుంచే వెనక్కు పంపేయడంతో ఆ పరామర్శ తంతు టెంట్‌తో సమాప్తమైంది. సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ గయాళు భూమి.. అంటే పూర్తిగా ప్రభుత్వ భూమి. పెందుర్తి మండలం పినగాడి గ్రామ రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నంబరు 141/1లో మొత్తం 32.88 ఎకరాలూ గయాలు భూమే. అందులో 9 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవాలనేది జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఉద్దేశం. టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు అక్కడ చెరువు గర్భం అనేదీ లేదని రెవెన్యూ అధికారులు విస్పష్టంగా చెబుతున్నారు. తామెక్కడా చెరువులను భూసమీకరణకు తీసుకోలేదని ఇటీవల కలెక్టరు వి.వినయ్‌చంద్ మీడియా సమావేశంలో విస్పష్టంగా చెప్పారు. కానీ ల్యాండ్ పూలింగ్ వల్ల ఆ గయాళు భూమిని ఆక్రమించుకొని ఇన్నాళ్లూ అనుభవంలో ఉంచుకున్న 12 మంది రైతులకూ దీని వల్లే మేలు జరగనుంది. ఎకరానికి 900 చదరపు గజాల చొప్పున లేఅవుట్లో స్థలం పరిహారంగా దక్కుతుంది. పరిసరాల్లో ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం చదరపు గజం రూ.20వేల చొప్పున లెక్క చూసినా దాని విలువ సుమారుగా రూ.1.80 కోట్లు ఉంటుంది. ఈ ప్రకారం 9 ఎకరాలకు 12 మంది రైతులకు రూ.16.20 కోట్లు విలువైన ఆస్తి ప్రతిఫలంగా దక్కనుంది. అంతేకాదు మరోవైపు 432 మంది పేదలకు సెంటు చొప్పున ఇంటి స్థలం సమకూర్చడానికి పరోక్షంగా సహాయం చేసినవారూ అవుతారు. ఇదే విషయాన్ని రైతులకు నచ్చజెప్పారు. కానీ టీడీపీ నాయకులు భూసమీకరణను రణరంగం చేయడానికి కుతంత్రాలు చేశారు. ఆకస్మికంగా చంద్రబాబు పర్యటన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పినగాడి సర్వే నంబరు 141/1లోని గయాలు భూమినే గృహనిర్మాణ పథకం కోసం తీసుకోవాలని బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పుడు రైతులకు ఎలాంటి పరిహారం ఇస్తామని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎకరానికి 900 చదరపు గజాల చొప్పున లేఅవుట్లో ఇంటి స్థలం ఇచ్చిమరీ తీసుకుంటుంటే అభ్యంతరం చెబుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఏకంగా చంద్రబాబును పినగాడి తీసుకొచ్చి రాజకీయంగా రచ్చ చేయాలని చూడటం గమనార్హం. విజయనగరంలో పర్యటనకు, జిల్లాలో రెండు వివాహ కార్యక్రమాల కోసం వస్తున్న చంద్రబాబు షెడ్యూల్‌ను ఒక్కసారిగా మార్చేశారు. తీరా కార్యనిర్వాహక రాజధాని సెగ తగలడంతో చంద్రబాబు పినగాడికి రాకుండానే వెనుదిరిగారు. తొమ్మిది మంది రైతుల పరామర్శ పేరుతో రాంపురం వద్ద లక్షల రూపాయల ఖర్చుతో చేసిన వేదిక, ఇతరత్రా ఏర్పాట్లు వృథాగానే మిగిలాయి. -
డిచ్‌పల్లిలో ప్రభుత్వ స్థలం కబ్జా
డిచ్పల్లి, న్యూస్‌లైన్: ఒకప్పుడు బతుకుదెరువు పేరు చెప్పి ప్రభుత్వ స్థలాల్లో చిన్నచిన్న కోకాలు, రేకుల షెడ్లు వేసుకున్న వారే ఇప్పుడు ఆ స్థలాలను కబ్జా చేస్తున్నారు.ఏళ్ల నుంచి ఇక్కడ మేమే ఉంటున్నాం, కాబట్టి ఈ స్థలం మాదే అంటూ దబాయిస్తున్నారు. స్థానిక అధికారులను ప్రలోభపెట్టి ఇంటి నెంబరు పొందడంతో పాటు ఆ స్థలాలను తమ పేరిట మార్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా వాటిలో పక్కా నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఇత రులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు, స్థానిక సిబ్బంది ఇదంతా తమకేమి పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. తమకెందుకులే అనుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఏ మారుమూల ప్రాంతంలోనో జరగడం లేదు. సాక్షాత్తు జిల్లా కేంద్రానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోని డిచ్పల్లి మం డలకేంద్రంలో ఈ కబ్జా పర్వం కొనసాగుతోంది. ఇదీ సంగతి.... పీడబ్ల్యూడీకి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుట అర ఎకరం స్థలం ఉండేది. అనంతరం ఆ స్థలం ఆర్‌అండ్‌బీకి మారింది. ఈ స్థలంలో ఒక బస్ షెల్టర్, నాలా, దర్గాతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ భవనం ఉండేది. బతుకు దెరువు పేరిట కొందరు ఈ స్థలం లో చిన్నచిన్న కోకాలు, హోటళ్లు ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం తర్వాత తమ కోకాలు, హోటళ్లకు ఇంటి నెంబర్లు పొందారు. అప్పుడు భూముల విలువ చాలా తక్కువ ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం రైల్వేస్టేషన్ ఎదుట గజం ధర రూ.25,000 నుంచి రూ.30,000 వేలు పలుకుతోంది. దీంతో ఆర్ఐ క్వార్టర్ స్థలంలో ఉన్న కోకా లు, హోటళ్లు నడుపుకుంటున్న వారిలో ఒకరు ఆ స్థలం తమదేనంటూ పక్కా ఇంటి నిర్మాణాలు చేపట్టారు. మరొకరు రూ.26 లక్షలకు స్థలాన్ని ఇతరులకు అమ్మివేసినట్లు తెలిసింది. ప్రభుత్వ స్థలంలో ఇలా కబ్జాలు చేస్తూ పక్కా నిర్మాణాలు చేపట్టినా, ఇతరులకు అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ అధికారులకు నడిపల్లి గ్రామపెద్దలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కొందరు వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.