డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : డిచ్‌పల్లి మండల కేం ద్రానికి చెందిన సుహాన్ అనే నాలుగేళ్ల బాలుడు థైరోసినేమియా అనే కాలేయ సంబంధిత వ్యాధి తో మృతిచెందాడు. ఆదివారం బాలుడి తల్లి సమీరా, మేనమామ సల్మాన్ డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. వారు చెప్పిన ప్రకారం.. సుహాన్ గత ఆగస్టులో ఆనారోగ్యానికి గురికాగా తల్లి సమీరా జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూయించింది. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు జరిపించింది.
బాలుడికి థైరోసినేమియా వ్యాధి సోకినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి చికిత్స కోసం సుమారు రూ 19 లక్షలు ఖర్చవుతుందని, లక్షల్లో ఒకరికి ఇలాంటి వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపా రు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సతో వ్యాధిని నయం చేయవచ్చని వైద్యులు సూచించారు. పేద కుటుంబం కావడంతో అంత డబ్బులు తేవాలో తెలియక బాలుడి కుటుంబం తల్లడిల్లింది. బాలుడి తండ్రి షబ్బీర్ కుటుంబపోషణ నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. దీంతో తల్లి సరీనా, మేనమామ సల్మాన్‌లు సుహాన్‌ను పట్టుకుని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయాలని వైద్యుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. గత రచ్చబండలో తమకు ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌కార్డు కూపన్ పనిచేయదని చెప్పారు. ఇటీవల డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి మండల కేంద్రాల్లో జరిగిన ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరాలకు వెళ్లి వైద్యులను సంప్రదించినా ఎవరూ సరైన విధంగా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి ప్రాణాలు రక్షించుకునేందుకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదన్నారు. తమ కుమారుడికి జరిగిన అన్యాయం మరొక చిన్నారికి జరగ కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లి సమీరా విలేకరుల ఎదుట బోరున విలపించింది.బాధిత కుటుంబం స్వగ్రామం నందిపేట్ మండలం కౌల్‌పూర్ కాగా, కొద్ది నెలలుగా డిచ్‌పల్లి మండల కేంద్రంలో నివసిస్తున్నారు.