విఠల్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని గుండెనెమ్లి గ్రామంలో శుక్రవారం రైతు గైని విఠల్(40) బోరు మరమ్మతులు చేస్తుండగా పైపులు హైటెన్షన్ వైర్లకు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురికి గాయాలయ్యాయి. బోరు మోటారు కాలిపోవడంతో మరమ్మతుల కోసం రైతు విఠల్, మెకానిక్ హన్మండ్లు, ముగ్గురు కూలీలు అంజయ్య, బాలబోయి, గంగబోయి కలిసి సబ్ మర్సిబుల్ మోటారు పైపులు చైన్ బ్లాక్ సహాయంతో పైకి లేపుతుండగా పైన ఉన్న 11 కేవీ హైటెన్షన్ కరెంట్ వైర్లకు పైపులు తగలడంతో కరెంటు ప్రవేశించి రైతు విఠల్ అక్కడిక్కడే మృతి చెందాడు.
గంగబోయి పరిస్ధితి విషమంగా ఉంది. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. కరెంటు షాక్‌తో మృతి చెందడంపై భార్య, కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కలచి వేసింది. ఘటన స్థలానికి ఎస్‌ఐ నరేందర్ చేరుకొని ఘటన వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన భూమిలో...
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చిన లబ్ధిదారుల్లో గైని విఠల్ ఒకరు. మూడెకరాల్లో భార్య, భర్త ఇద్దరు కష్టపడి పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నాడు. కొడుకు, కూతురు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం భూమిని విఠల్‌కు పంపిణీ చేసింది. ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జాకోరా శివారులో మరో రైతు..
వర్ని(బాన్సువాడ): మండలంలోని జాకోరా శివారులో పంట పొలం వద్ద నాయిని వెంకట్(45) అనే రైతు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకట్ సోదరుని ఇంట్లో శుభకార్యం ఉండడంతో మధ్యాహ్నం వేళ పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వెంకట్ సాయంత్రం వరకు రాలేదు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయనందున కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. బోరు సమీపంలో పడిపోయి మృతి చెంది ఉన్నాడు. దీంతో గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారమందించారు. బోరు మోటారు స్టాట్ కానందున, వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment