సాక్షి, నిజాంసాగర్: తరచూ కుటుంబ కలహాలు అవుతున్నాయన్న అనుమానంతో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేశారు. నిజాంసాగర్ మండలం సింగితం గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం జరిగిన హత్య ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం దక్కల్‌దాని తండాకు చెందిన బోడ అరుణ(35) అనే వివాహితతో, ముదెల్లికి చెందిన వట్నాల అంజయ్య చనువుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడంతో మరింత దగ్గరయ్యారు.
అప్పటి నుంచి అంజయ్య తన భార్య, పిల్లలతో తరచూ గొడవలు పడ్డాడు. అంజయ్య భార్య కాశవ్వకు, అరుణపై అనుమానం వచ్చింది. తన భర్తతో సంబంధం కారణంగానే గొడవలు జరుగుతున్నాయని కక్ష పెట్టుకున్న కాశవ్వ అరుణను అంతం చేసేందుకు పన్నాగం పన్నింది. ముదెల్లికి చెందిన సుతారి బాలయ్య సహాయం తీసుకుంది. ఎప్పటిలాగే అరుణతో కలిసి కాశవ్వ బాన్సవాడ పట్టణానికి వచ్చింది. తమ బంధువులు పండుగ చేస్తున్నారని, ఊరికి వెళ్దామని అరుణతో నమ్మబలికింది. అప్పటికే సుతారి బాలయ్య గాలీపూర్ గేటు వద్ద వీరి కోసం కాపు కాస్తున్నాడు. బాన్సువాడ నుంచి కాశవ్వ, అరుణ ఇద్దరు కలిసి ఆర్టీసీ బస్సులో వచ్చారు. గాలీపూర్ గేటు వద్ద బస్సు దిగి నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్టపై నుంచి కాలినడకన వచ్చారు.
అక్కడే ఉన్న బాలయ్య, కాశవ్వ, అరుణ కలిసి సింగితం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. తర్వాత బాలయ్య తన ధోతిని అరుణ గొంతు చుట్టూ చుట్టి నులిమాడు. ఊపిరాడకుండా కొట్టుకుంటున్న అరుణపై కాశవ్వ బండరాయితో మోదడటంతో అరుణ మృతి చెందింది. దాంతో బాలయ్య, కాశవ్వ తిరిగి బాన్సువాడకు వెళ్లి అక్కడి నుంచి ముదెళ్లికి వెళ్లారు. తండా నుంచి వెళ్లిన అరుణ రాత్రి వరకు ఇంటికి రాకపోవడం, ఆచూకీ లేక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ వెంట కాశవ్వ వెళ్లినట్లు తండావాసులు ఫిర్యాదులో పేర్కొనడంతో హత్య ఉందంతం వెలుగులోకి వచ్చింది. కాశవ్వను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అరుణను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దాంతో బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, పట్టణ సీఐ మహేశ్‌గౌడ్, స్థానిక ఎస్‌ఐ సాయన్న పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బోడ అరుణ మృతదేహం: మృతదేహాన్ని మోసుకు వస్తున్న సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment