సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం, ఆపై గొడవల నేపథ్యంలో అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో ఇంకా శవ పరీక్ష(అటాప్సీ) పూర్తి కాలేదు. ఆ ఆలస్యానికి గల కారణాలను అధికారులు ప్రకటించాల్సి ఉంది.
చాలాకాలం కిందట చెన్నై నుంచి హైదారాబాద్‌కు వలస వచ్చింది అప్సర కుటుంబం. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్‌నగర్‌లో అద్దె ఇంట్లోంది అప్సర. ఈ క్రమంలో స్థానికంగా ఓ ఆలయంలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో గుడిలో అప్సరకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పూజారి.
ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు సాయికృష్ణ. అప్సర తల్లిని అక్కా అని పిలుస్తూ.. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్‌గా భావించి.. అప్సరను హత్య చేశానని నిందితుడు సాయికృష్ణ అంగీకరించాడు.
సాయికృష్ణ అమాయకుడు!
ఇక ఈ కేసులో తన కొడుకు సాయికృష్ణ అమాయకుడని అంటున్నాడు అతని తండ్రి. అప్సరతో సంబంధం ఉన్నట్లు తమకు, అంతెందుకు సాయికృష్ణ భార్యకు సైతం తెలియదని అంటున్నాడు. కేవలం డబ్బు కోసమే తన కొడుకును అప్సర కుటుంబం ట్రాప్ చేసి ఉంటుందని ఆయన అరోపిస్తున్నాడు. కూతురిని కంట్రోల్‌లో పెట్టుకోవాల్సింది తల్లే కదా అంటున్నాడాయన. ఓసారి అప్సర బ్యాంక్ అకౌంట్లను పరిశీలించండి.. ఆమె కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది? అంటూ నిలదీస్తున్నాడాయన.
మరోవైపు సాయికృష్ణ భార్య సైతం తన భర్తను వెనకేసుకొస్తోంది. ‘‘నా భర్తకు అప్సరతో సంబంధం లేదు. అప్సర చేసింది కరెక్ట్ కాదు. ఆమెకు ఎవరివల్ల గర్భం వచ్చిందో?. బహుశా నా భర్తను అప్సర నిజంగానే టార్చర్ చేసి ఉండొచ్చ’’ని అంటోందామె.
Comments
Please login to add a commentAdd a comment