సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అప్సర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలానంతరం కేసులో ప్రధాన నిందితుడైన సాయికృష్ణను శుక్రవారం రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు శంషాబాద్ పోలీసులు.
అప్సర హత్య చేయాల్సిన పరిణామాలపై విచారించడంతో పాటు హత్యా ప్రదేశంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం సాయిని కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో శంషాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఇవాళ రెండు రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ, రేపు అప్సర హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది. సరూర్ నగర్ నుంచి బయల్దేరిన దగ్గరి నుంచి తిరిగి.. శవాన్ని పూడ్చిపెట్టిన క్రమం మొత్తం ఎలా జరిగిందనేది పోలీసులు సాయి ద్వారా తేల్చనున్నారు.
కేసు పూర్వాపరం
చెన్నై నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి సరూర్ నగర్‌లో స్థిరపడింది అప్సర కుటుంబం. తండ్రి కాశీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లితో పాటు ఉంటూ అప్సర సినిమా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఆలయంలో పూజారిగా పని చేసే సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ ఆమెకు దగ్గరయ్యాడు సాయికృష్ణ. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి తిరగడం, ఆ చనువు కాస్త వివాహితుడైన సాయితో శారీరక సంబంధానికి దారి తీసింది. జూన్ 3వ తేదీన తాను కొయంబత్తూరు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన అప్సర.. జాడ లేకుండా పోయింది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆమెను శంషాబాద్ సమీపంలో చంపి.. సరూర్‌నగర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో పూడ్చిపెట్టినట్లు సాయి అంగీకరించాడు.
అయితే అప్సర తనను బ్లాక్‌మెయిల్ చేయడంతో భరించలేకే తాను ఆమెను హత్య చేసినట్లు సాయి చెబుతున్నాడు. అరెస్ట్.. ఆపై జ్యూడీషియల్ రిమాండ్ అనంతరం సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.
ఇదీ చదవండి: అప్సర హత్యకు ముందు సాయికృష్ణ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!
Comments
Please login to add a commentAdd a comment