rangareddy court
-
కోర్టులో జానీ మాస్టర్‌కు చుక్కెదురు
లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కొద్దిరోజుల క్రితం జానీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ క్రమంలో బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో జానీ ఒక పిటీషన్ పెట్టుకున్నారు. తాజాగా న్యాయస్థానంలో తన బెయిల్‌పై విచారణ పూర్తి అయింది.ఇప్పటికే పలుమార్లు జానీ బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. కానీ, నేడు (అక్టోబర్ 14) జానీ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి పోక్సో ప్రత్యేక కోర్టు వాదనలు విన్నది. కేసు విచారణ పూర్తి అయిన అనంతరం రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న జానీకి కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఆయన ఉన్నారు.జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని జానీ భయపెట్టాడంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్ఐఆర్లో పోక్సో కేసుగా నమోదు చేశారు. -
అప్సర కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అప్సర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలానంతరం కేసులో ప్రధాన నిందితుడైన సాయికృష్ణను శుక్రవారం రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు శంషాబాద్ పోలీసులు. అప్సర హత్య చేయాల్సిన పరిణామాలపై విచారించడంతో పాటు హత్యా ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సాయిని కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో శంషాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఇవాళ రెండు రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ, రేపు అప్సర హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది. సరూర్ నగర్ నుంచి బయల్దేరిన దగ్గరి నుంచి తిరిగి.. శవాన్ని పూడ్చిపెట్టిన క్రమం మొత్తం ఎలా జరిగిందనేది పోలీసులు సాయి ద్వారా తేల్చనున్నారు. కేసు పూర్వాపరం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి సరూర్ నగర్లో స్థిరపడింది అప్సర కుటుంబం. తండ్రి కాశీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లితో పాటు ఉంటూ అప్సర సినిమా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఆలయంలో పూజారిగా పని చేసే సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ ఆమెకు దగ్గరయ్యాడు సాయికృష్ణ. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి తిరగడం, ఆ చనువు కాస్త వివాహితుడైన సాయితో శారీరక సంబంధానికి దారి తీసింది. జూన్ 3వ తేదీన తాను కొయంబత్తూరు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన అప్సర.. జాడ లేకుండా పోయింది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆమెను శంషాబాద్ సమీపంలో చంపి.. సరూర్‌నగర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో పూడ్చిపెట్టినట్లు సాయి అంగీకరించాడు. అయితే అప్సర తనను బ్లాక్మెయిల్ చేయడంతో భరించలేకే తాను ఆమెను హత్య చేసినట్లు సాయి చెబుతున్నాడు. అరెస్ట్.. ఆపై జ్యూడీషియల్ రిమాండ్ అనంతరం సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: అప్సర హత్యకు ముందు సాయికృష్ణ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి! -
అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడిన మృగాడికి ఉరిశిక్ష విధించింది. వివరాలు.. దినేశ్ కుమార్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం నార్సింగి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక హత్య చేశాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి కోర్టు మంగళవారం నిందితుడు దినేశ్ కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. 2017లో చోటు చేసుకున్న ఈ దారుణంలో నిందితుడు దినేశ్ కుమార్ ఆరేళ్ల చిన్నారిని లేబర్ క్యాంప్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ పాపను హత్య చేశాడు. సంచలన సృష్టించిన ఈ కేసును సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడికి ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపించే సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు సమర్పించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దినేశ్ కుమార్‌ను దోషిగా తేల్చి.. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. చదవండి: 8 ఏళ్ల చిన్నారి గొంతు కోసి.. పళ్లు రాలగొట్టి.. -
బిగ్‌బి ‘జుండ్’ విడుదల ఆపాలంటూ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జుండ్’ చిత్ర విడుదలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటీటీ, థియేటర్లలో ఈ సినిమా విడుదల నిలిపివేయాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్నికుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జుండ్ రచయిత, దర్శకనిర్మాతలు, అమితాబ్ బచ్చన్, టీసిరీస్, తాండవ్ ఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన ప్రతివాదులు కౌంటర్ రిప్లైని దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 28కి వాయిదా వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే? స్లమ్ సాకర్ చాంపియన్ అఖిలేష్ పాల్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు కాపీ హక్కులను కొనుగోలు చేశానని నంది చిన్ని కుమార్ పేర్కొంటున్నారు. అయితే అఖిలేష్ కోచ్ విజయ్ బర్సె నుంచి అఖిలేష్ జీవిత కథకు సంబంధించి హక్కులను జుండ్ చిత్ర బృందం అక్రమంగా కొనుగోలు చేసిందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై అఖిలేష్‌ను ప్రశ్నించగా ఆయన తన కోచ్‌కు, జుండ్ చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపారు. అంతేకాకుండా తన పాత్రకు సంబంధించి ఎలాంటి పోలికలు ఉండకూడదని చిత్రబృందానికి అఖిలేష్ హెచ్చరించారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తాను కూడా చిత్ర బృందానికి ఓ లీగల్ నోటీసు పంపినా ఎలాంటి సమాధానం రాలేదని చిన్ని కుమార్ వివరించారు. అయితే కొన్ని రోజుల తర్వాత రచయిత నాగరాజ్ మంజులేకు తన జీవిత కథకు సంబంధించి హక్కులను అమ్మినట్లు లీగల్ నోటీసును తనకు పంపించారని తెలిపారు. అయితే అఖిలేష్ నుంచి ఎలాంటి హక్కులను కొనుగోలు చేయలేదని జుండ్ నిర్మాతలు కొట్టిపడేస్తున్నారన్నారు. ఈ విషయంలో నాకు న్యాయం కల్పించాలిన కోర్టుకు ఆశ్రయించినట్లు చిన్ని కుమార్ తెలిపారు. అంతేకాకుండా అఖిలేష్, దర్శకనిర్మాతలతో తాను మాట్లాడిన ఆడియో టేపులు నా దగ్గర ఉన్నాయని చిన్ని కుమార్ తెలిపారు. ఇక గతంలో కూడా ‘బిగిల్’(తెలుగులో విజిల్) ప్రధాన పాత్రధారి కాపీరైట్ ఉల్లఘించినట్టు పేర్కొంటూ, బిగిల్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాకుండా చిన్ని కుమార్ అడ్డుకున్న విషయం తెలిసిందే. చదవండి: కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు తాతా–మనవడు -
రంగారెడ్డి కోర్టులో న్యాయవాదుల నిరసన
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం న్యాయవాదులు ఆందోళనకు దిగారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమండ్ చేస్తున్న అడ్వకేట్ అమెన్మెంట్ యాక్ట్ 2017 ను పార్లమెంట్ లో ఆమోదం పొందకుండా చూడలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి తమ నిరసన తెలిపారు. -
రంగారెడ్డి కోర్టు ఆవరణలో ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్లు బుధవారం ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ఆందోళనకు దిగారు. న్యాయమూర్తులకు తెలంగాణ ఆప్షన్ ఇవ్వద్దంటూ లాయర్లు రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ల నినాదాలతో కోర్టు సముదాయం దద్దరిల్లింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి.... ఆందోళన చేస్తున్న లాయర్లను అడ్డుకున్నారు. కొందరు లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని... వాహనాల్లో ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
రంగారెడ్డిజిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద బుధవారం మధ్యాహ్నం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్నేక్ గ్యాంగ్ సభ్యులకు శిక్షలు ఖరారు చేస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం గ్యాంగ్ కుటుంబసభ్యులు హల్చల్ చేశారు. కోర్టు హాలు బయటకు వచ్చిన సీపీ ఆనంద్‌ను గ్యాంగ్ కుటుంబసభ్యులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. 8 మంది నిందితుల్లో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఏ8 నిందితుడు అలీకి 20 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
రంగారెడ్డి : తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో న్యాయమూర్తుల విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు విధులకు హాజరు కాలేదు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో పనులు స్తంభించిపోయాయి. కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులను నియమించడం వల్ల తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులు అవకాశాలు కోల్పోతున్నారని మరోసారి ఉద్యమం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. -
చెల్లని చెక్కు... తెచ్చింది చిక్కు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితుడికి నాలుగు నెలల జైలుశిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... ఎల్బీనర్లో నివాసం ఉండే రాజశేఖర్‌రెడ్డి అదే ప్రాంతంలో నివాసం ఉండే రాజన్ నాయర్ పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2012 సంవత్సరంలో రాజన్నాయర్ రూ.4 లక్షలను అప్పుగా రాజశేఖర్‌రెడ్డి నుంచి తీసుకొని 6 నెలల్లోగా తిరిగి చెల్లిస్తానంటూ హామీ ఇచ్చాడు. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించాలని రాజన్నాయర్ను కోరగా కెనరాబ్యాంక్ దిల్సుఖ్నగర్ బ్యాంక్‌కు చెందిన రూ. 4 లక్షల చెక్కును రాజశేఖర్‌రెడ్డి పేరిట జారీ చేశాడు. సదరు చెక్‌ను బ్యాంకు ఆఫ్ ఇండియా ఎల్బీనగర్ బ్యాంచ్‌లో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో అది చెల్లలేదు. నోటీసు పంపినా రాజన్నాయర్ డబ్బులు చెల్లించకపోవడంతో రాజశేఖర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ సత్యనారాయణరావు పై విధంగా తీర్పు చెప్పారు. -
డ్రంకన్ డ్రైవ్‌లో తొమ్మిది కేసులు నమోదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెట్టేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో తొమ్మిది కేసులను నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ యూసుఫ్ డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించారు.