Shamshabad police
-
యువతి నుదిట సింధూరం.. యువకుడి పాలిట మరణ శాసనం
సాక్షి, క్రైమ్: షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. బలవంతంగా యువతి నుదట దిద్దిన సింధూరం!.. ఓ యువకుడిపాలిట మరణ శాసనమైంది. ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని హతమార్చాడు ఓ తండ్రి. సినీ ఫక్కీలో పక్కా మర్డర్‌కు ప్లాన్ వేసి మరీ కిరాతకంగా ప్రాణం తీశాడు. బీహార్‌కు చెందిన కరుణాకర్ కుటుంబం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆగష్టు 29వ తేదీ నుంచి కరుణాకర్ కనిపించకుండా పోయాడు. దీంతో.. అతని సోదరుడు దీపక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారమే కరుణాకర్‌ను హత్య చేశారని పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. రంజిత్ కుమార్ కూతురిపై కరుణాకర్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె నుదుటిపై సింధూరం కూడా దిద్ది ఆమెను ఇబ్బందికి గురి చేశాడు. ఈ విషయం బయటకు పొక్కితే తన పరువు పోతుందని రంజిత్ రగిలిపోయాడు. కరుణాకర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగష్టు 15వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరికి పిలిపించుకున్నాడు. విచక్షణా రహితంగా కరుణాకర్‌పై దాడికి దిగాడు. కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురద లో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు. దర్యాప్తు ద్వారా ఈ కేసును చేధించామని, ప్రధాన నిందితుడు రంజిత్‌తో పాటు అతనికి సహకరించిన వాళ్లనూ అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితులపై 302, 201 ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా.. వాళ్లను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. -
అప్సర హత్యకు 15 రోజుల ముందే గొయ్యి తవ్వి..
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకట సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న శంషాబాద్ పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఆమె హత్యకంటే 15 రోజుల ముందే సాయి ఎలాంటి స్కెచ్ వేశాడనే విషయం తెలిసి పోలీసులు సైతం కంగుతిన్నారు. అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రారంభించారు. జూన్ 3వ తేదీన హత్య జరిగిన ఘటనాస్థలి నర్కూడ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ ఘటన హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆమెను హత్య చేసేందుకు ముందుగా సాయి వేసుకున్న ప్లాన్ సైతం తెలిసింది. ఇదీ చదవండి: అప్సర చేసింది కరెక్ట్ కాదు-సాయి భార్య అప్సర వేధింపులను సాయి తట్టుకోలేకపోయాడు. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్ వేసుకున్నాడు. సరూర్ నగర్లో తాను పూజారిగా పని చేసే గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు. ఇదిలా ఉంటే.. నర్కూడలో క్రిమినల్ సీన్ రీకన్స్ట్రక్షన్ ముగిశాక.. సరూర్ నగర్లో అప్సర మృతదేహాన్ని పూడ్చేసిన మ్యాన్ హోల్ దగ్గరికి తీసుకెళ్లారు. రంగారెడ్డి కోర్టు రెండురోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో.. ఇవాళ, రేపు అప్సర కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అప్సర కేసు.. అప్సర మాజీ భర్త తల్లి సంచలన ఆరోపణలు -
అప్సర కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అప్సర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలానంతరం కేసులో ప్రధాన నిందితుడైన సాయికృష్ణను శుక్రవారం రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు శంషాబాద్ పోలీసులు. అప్సర హత్య చేయాల్సిన పరిణామాలపై విచారించడంతో పాటు హత్యా ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సాయిని కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో శంషాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఇవాళ రెండు రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ, రేపు అప్సర హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది. సరూర్ నగర్ నుంచి బయల్దేరిన దగ్గరి నుంచి తిరిగి.. శవాన్ని పూడ్చిపెట్టిన క్రమం మొత్తం ఎలా జరిగిందనేది పోలీసులు సాయి ద్వారా తేల్చనున్నారు. కేసు పూర్వాపరం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి సరూర్ నగర్లో స్థిరపడింది అప్సర కుటుంబం. తండ్రి కాశీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లితో పాటు ఉంటూ అప్సర సినిమా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఆలయంలో పూజారిగా పని చేసే సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ ఆమెకు దగ్గరయ్యాడు సాయికృష్ణ. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి తిరగడం, ఆ చనువు కాస్త వివాహితుడైన సాయితో శారీరక సంబంధానికి దారి తీసింది. జూన్ 3వ తేదీన తాను కొయంబత్తూరు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన అప్సర.. జాడ లేకుండా పోయింది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆమెను శంషాబాద్ సమీపంలో చంపి.. సరూర్‌నగర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో పూడ్చిపెట్టినట్లు సాయి అంగీకరించాడు. అయితే అప్సర తనను బ్లాక్మెయిల్ చేయడంతో భరించలేకే తాను ఆమెను హత్య చేసినట్లు సాయి చెబుతున్నాడు. అరెస్ట్.. ఆపై జ్యూడీషియల్ రిమాండ్ అనంతరం సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: అప్సర హత్యకు ముందు సాయికృష్ణ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి! -
ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
సాక్షి, శంషాబాద్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్ రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని నలుగురు సభ్యుల్లో సర్వేష్ సాహు, అబ్ధుల్ మాజిద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు మిశ్రా, దినేష్‌లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఆరు లక్షల నగదు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్, ఐడి కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే వారిని నమ్మొద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కాగా, నిందితులు కేంద్ర రైల్వే సర్వీసెస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుండి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితులకు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నమ్మించిన నిందితులు.. ఫేక్ మెడికల్ టెస్ట్ సైతం నిర్వహించారు. రైల్వే డిపార్ట్మెంట్ నుండి మెయిల్ వచ్చినట్లు ఫేక్ ఐడితో మెయిల్స్ పంపి, ఢిల్లీ, బెంగాల్‌లలో ట్రైనింగ్ క్లాసులంటూ నమ్మించారు. నార్త్ సెంట్రల్ రైల్వే పేరుతో బాధితుల పేరిట ఫేక్ ఐడి కార్డులను సృష్టించారు. ఉద్యోగం కోసం బాధితులు రైల్వే కార్యాలయాన్ని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
వివాహేతర సంబంధానికి అడ్డువస్తాడని..
సాక్షి, రంగారెడ్డి : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో శివరాంపల్లికి చెందిన ఆనంద్‌ను భార్య మహేశ్వరి ఆమె ప్రియుడు సంజయ్ హత్య చేశారని శంషాబాద్ డీసీపీ తెలిపారు. బుధవారం రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డీసీపీ మాట్లాడుతూ.. మే7వ తేదీన ఆనంద్‌ను హత్యచేసిన తర్వాత అతని శవాన్ని అర్థరాత్రి గంధంగూడ మూసీ సమీపంలో పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. అ తర్వాత అస్తికలను మూసీలో కలిపిన నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా భర్త కనిపించటం లేదని స్టేషన్లో ఫిర్యాదు చేశారని అన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య కేసును చేధించి మహేశ్వరి, ఆమె ప్రియుడు సంజయ్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అసలేం జరిగింది... వికారాబాద్ జిల్లాకు చెందిన ఆనంద్ 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. 2010లో పురానాపూల్‌కు చెందిన మహేశ్వరిని ప్రేమంచి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ముకేష్ (7) , భాను (5) ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత మద్యానికి బానిసైన ఆనంద్ భార్యను పట్టించుకోవటం మానేశాడు. ఆనంద్ స్నేహితుడు సంజయ్ అతన్ని కలవటానికి తరుచుగా ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో మహేశ్వరి సంజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి భర్త ఆనంద్ అడ్డువస్తున్నాడనే కారణంతో అతన్ని చంపాలని పథకం రచించారు. మే నెల 7వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆనంద్‌ను సంజయ్, మహేశ్వరి ఇద్దరు కలిసి హత్య చేశారు. తర్వాత అతని శవాన్ని అర్థరాత్రి గంధంగూడ మూసీ సమీపంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. రెండు రోజుల తర్వాత భర్త కనిపించడంలేదంటూ మహేశ్వరి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆనంద్ భార్యపై అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. -
నయీం బావను కాల్చేసిన ప్రాంతం పరిశీలన
శంషాబాద్ రూరల్: ఎన్ కౌంటర్ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న గ్యాంగ్‌స్టర్ నయీం ఉదంతాల్లో అత్యంత పాశవికమైనదిగా భావిస్తోన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీం తన బావ(సోదరి భర్త)ను కిరాతకంగా చంపి, దహనం చేసిన కేసులో నయీంతోపాటు ఫర్హానా, సలీమాలు కూడా నిందితులు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న వీరిద్దరినీ శంషాబాద్ పోలీసులు శుక్రవారం హత్యజరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి పలు విధాలుగా ప్రశ్నించారు. శంషాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. 2013, ఫిబ్రవరి 2న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సాతంరాయి సమీపంలోగల పప్పు ఫాం హౌస్ లో నయీం.. తన సోదరి సలీమా భర్త, భువనగిరికి చెందిన విజయ్ కుమార్ అలియాస్ నదీమ్ ను దారుణంగా హతమార్చాడు. ఫాం హౌస్ లోని ఒక గదిలో నదీమ్ తలపై రాడ్డుతో మోది, ఫర్హానా సాయంతో నదీమ్ ను హాలులోకి తీసుకొచ్చి చున్నీని మెడకు బిగించి చంపారు. అనంతరం నదీమ్ మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించి పెద్దతూప్ర సమీపంలోని నిర్జన ప్రదేశంలో దహనం చేశారు. నదీమ్ మృతదేహాన్ని తరలించిన వాహనంలో నయీంతో పాటు డ్రైవర్ ఫయీం, సమీప బంధువు ఫర్హానా, మరో మహిళ, ఇద్దరు బాలికలు ఉన్నారు. మహిళలు, బాలికలు వాహనంలోనే ఉండగా.. నయీం మృతదేహాన్ని కాల్చి వేశాడు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం ఈ హత్య వెలుగు చూడగా.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఫర్హానా, సలీమాను శంషాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం వీరిద్దరిని పెద్దతూప్ర వద్ద సంఘటనా స్థలానికి తీసుకెళ్లి పరిశీలించారు. సీఐ ఉమామహేశ్వర్రావు, ఎస్ఐ భాస్కర్ వారి నుంచి వాంగూల్మం నమోదు చేసుకున్నారు. -
ఎయిర్‌పోర్టు రోడ్డుపై మహిళ మృతదేహం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాతంరాయి వద్ద రహదారిపై ఓ మహిళ మృతదేహం శనివారం స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని...మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదంలో సదరు మహిళ మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం: తండ్రికొడుకులు మృతి
⇒ అంత్యక్రియలకు వెళ్లి వస్తూ.. ⇒ బైక్‌ను ఢీకొన్ని గుర్తు తెలియని వాహనం.. ⇒ పాల్మాకుల వద్ద ఘటన.. శంషాబాద్ రూరల్: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ తండ్రీకొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు ఈ విషాదకర సంఘటన మండల పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం తొండపల్లి గ్రామానికి చెందిన గుర్రంపల్లి జంగయ్య(58) స్థానికంగా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జంగయ్య రెండో కొడుకు రమేష్ డ్రైవర్‌గా పని చేస్తూ రాజేంద్రనగర్ సర్కిల్లోని జల్పల్లి ప్రాంతం శ్రీరానగర్ కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తొండపల్లిలో వీరి దగ్గరి బందువు మృతి చెందగా.. అతని అంత్యక్రియల కోసం రమేష్ స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి జంగయ్యకు అనారోగ్యంగా ఉండడంతో నగరం తీసుకెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని.. సాయంత్రం జంగయ్యను తీసుకుని రమేష్ బైక్‌పై జల్పల్లి వస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో శంషాబాద్ మండలంలోని పాల్మాకుల శివారులోకి రాగానే బెంగళూరు జాతీయ రహదారిపై వెనక నుంచి గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి ఎగిరిపడిన ఇద్దరికి తీవ్రగాయాలై సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా వారి ఆచూకి గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను స్థానిక క్లష్టర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శనివారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి,కొడుకు మృతితో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జంగయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు, రమేష్‌కు భార్య, పాప ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నలుగురిపై అట్రాసిటి కేసు
శంషాబాద్ రూరల్: కులం పేరుతో దూషించిన నలుగురు వ్యక్తులపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎస్ఐ అహ్మద్‌పాషా కథనం ప్రకారం.. నగరానికి చెందిన రాందాస్‌కు మండలంలోని పెద్దతూప్రలో వ్యవసాయం పొలం ఉంది. గ్రామానికి చెందిన ఎం.నర్సింహా కొంత కాలం పాటు ఆయన పొలంలో పనిచేశాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో రాందాస్ పనిలోనుంచి తొలగించాడు. దీంతో గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి, అంజయ్య, కుమార్, సాయిలు, మరికొందరు వచ్చి రాందాస్‌ను కులంపేరుతో దూషించడమే కాకుండా బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం నలుగురిపై అట్రాసిటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
గ్యాంగ్‌రేప్: నిందితులు అరెస్ట్
-మరో ఇద్దరు పరారీలో.. శంషాబాద్ : యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను శంషాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మండలంలోని ముచ్చింతల్ గ్రామానికి చెందిన పాండు, పద్మమ్మ కుమార్తె (23) ను అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఈ నెల 15న ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఇంటి సమీపంలో ఉండే వీఆర్ఓ చంద్రమోహన్ తనను గత మార్చి 5న ఇంటికి పిలిచి మరో ముగ్గురుతో కలిసి సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులు చంద్రమోహన్, మహేందర్ అలియాస్ మహేష్, అల్లం శేఖర్, జిత్తు అలియాస్ జితేందర్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. శనివారం నిందితులు అల్లం శేఖర్, జిత్తును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మరో ఇద్దరు నిందితులు చంద్రమోహన్, మహేందర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ భాస్కర్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
నిద్రమత్తులో కాలు తగిలి ఉండొచ్చు: పోకిరీ కార్పొరేటర్
హైదరాబాద్ : మహిళా ప్రొఫెసర్‌ను తాను ఉద్దేశ పూర్వకంగా తాక లేదని, నిద్రమత్తులోనే కాలు తగిలి ఉండొచ్చని విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్రావు( చంటిబాబు) వివరణ ఇచ్చినట్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(ఆర్జీఐఏ) సీఐ సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తన పట్ల వెంకటేశ్వరరావు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఢిల్లీకి చెందిన మహిళా ప్రొఫెసర్ రీతు వాసు ప్రిమలానీ ఈనెల 13 వ తేదీన ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు రావాలంటూ నోటీసులు పంపగా... ఆయన గురువారం రాత్రి ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరణ ఇచ్చినట్టు సీఐ తెలిపారు. దర్యాప్తు అనంతరం వెంకటేశ్వరావుపై చార్జీషీట్ నమోదు చేస్తామన్నారు. -
పీఎస్‌లో లొంగిపోయిన పోకిరీ కార్పొరేటర్
హైదరాబాద్: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు శుక్రవారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని శంషాబాద్ పోలీసులు చంటిబాబును ఇదివరకే కోరిన విషయం తెలిసిందే. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని చంటిబాబు విజ్ఞప్తి చేశాడు. ఇక అరెస్టు తప్పదని భావించిన ఈ పోకిరీ కార్పోరేటర్ చివరికి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఎయిరిండియా విమానంలో ప్రయానిస్తున్న సమయంలో ఆమె పక్క సీట్లో కూర్చున్న ఉమ్మడి వెంకటేశ్వరరావు కాలితో పదేపదే తాకి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కేసు నమోదైన విషయం తెలిసిందే. -
చంటిగారూ.. స్టేషన్లో లొంగిపోండి!
విమానంలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియస్ చంటిబాబును పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని శంషాబాద్ పోలీసులు కోరారు. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని విజయవాడ 25వ వార్డు కార్పొరేటర్ అయిన ఉమ్మడి చంటి విజ్ఞప్తి చేయడంతో పోలీసులు సరేనన్నారు. తాను తన లాయర్ సహకారంతో వచ్చి లొంగిపోతానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు. రేపటిలోగా వచ్చి లొంగిపోని పక్షంలో మాత్రం తెలంగాణ నుంచి వచ్చే పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, బుధవారమే చంటిని అరెస్టు చేస్తారన్న సమాచారంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పలువురు టీడీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. వాస్తవానికి సంఘటన జరిగినప్పుడే చంటిపై కేసు నమోదు కావడంతో ఆయనను అదుపులోకి తీసుకోవాలని శంషాబాద్ పోలీసులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, స్థానిక ఎంపీతో ఫోన్ చేయించుకున్న చంటి.. తాత్కాలికంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఆయనపై కేసు నమోదైంది. దాంతో వెంటనే స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని పోలీసులు తెలిపారు. -
జల్సాల కోసం చోరీలు
నిందితుడిని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు శంషాబాద్: జల్సాల కోసం ఓ ఎలక్ట్రీషియన్ చోరీల బాటపట్టాడు. గతంలో జైలుకెళ్లొచ్చినా అతడి బుద్ధి మారలేదు. శుక్రవారం శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన షేక్ సమీర్ హుస్సేన్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ జాగీర్‌లో తన సోదరుడితో కలసి ఉంటున్నాడు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేయడంలో సమీర్ సిద్ధహస్తుడు. రెండుమూడు నెలలుగా రాజేంద్రనగర్, నార్సింగి ఠాణాల పరిధిలో పదిచోట్ల ఇళ్ల తాళాలు విరగొట్టి బంగారు ఆభరణాలు, వెండి, ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ టీవీలు చోరీ చేశాడు, చోరీ సొత్తును బోధన్ పట్టణంతోపాటు ముంబైలో విక్రయించి జల్సాలు చేసేవాడు. ఇటీవల సమీర్ 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ టీవీ, రెండు డిజిటల్ కెమెరాలు చోరీ చేశాడు. 35 తులాల బంగారంతోపాటు మిగతా వస్తువులన్నింటిని పోలీసులు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. బోధన్‌లో గతంలో యాభై తులాల మేరకు బంగారం చోరీ కేసులో సమీర్ జైలుకు వె ళ్లి వచ్చాడు. రెండురోజుల క్రితం వాహనాల తనిఖీల్లో సమీర్ తీరును అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండుకు తరలించారు. -
మాయలోడు..
- ఈ నెల 5న ఔటర్‌పై ప్రమాదంలో మృతి చెందిన వెంకటరావు - పలు జిల్లాల్లో చీటింగ్ కేసులు - మృతుడు ప్రకాశం జిల్లా వాసి శంషాబాద్ రూరల్: జల్సాలకు అలవాటు పడి భార్యా, పిల్లలను వదిలేశాడు.. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడం.. కొన్ని నెలలు వారితో సంసారం చేసి వదిలేయడం.. అంతేకాదు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకుని వారిని మోసం చేయడం అతని ప్రవృత్తి.. షిరిడీలో దైవ దర్శనం చేసుకుని వస్తూ మండల పరిధిలో ఔటర్ రింగు రోడ్డుపై ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని పూర్తి వివరాలను శంషాబాద్ పోలీసులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీఐ ఉమామహేశ్వర్రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసరిపాలెంకు చెందిన గుడిపాటి వెంకటరావు(36) అలియాస్ చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందుకు 18 ఏళ్ల కిందట తన అక్క రమణమ్మ కూతురు మంగమ్మతో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు. జులాయిగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో 11 ఏళ్ల కిందట భార్యా,పిల్లలను వదిలేసి వచ్చాడు. జల్సాలకు అలవాటు పడిన వెంకట్రావు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారి నుంచి డబ్బులు కాజేయడం హాబీగా పెట్టుకున్నాడు. అవసరమైతే బెదిరింపులకు పాల్పడేవాడు. అంతేకాదు పేదింటి యువతులను మాయ మాటలతో తన వలలో వేసుకునేవాడు. యువతుల కుటుంబాలను తీర్థ యాత్రలకు తీసుకువెళ్లి మంచి అభిప్రాయం కలిగేలా ప్రవర్తించేవాడు. ఒకరి తర్వాత మరొకరిని వివాహం చేసుకుని, కొన్నాళ్లు సంసారం చేసేవాడు. ఇలా యువతులను వంచించడం, డబ్బుల కోసం మోసం చేయడం, వంటి 10 కేసుల్లో వెంకట్రావు నిందితుడు. కడప జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకున్న ఘనుడు. ఈ ఘటనలో నలుగురు ఆర్ముడు రిజర్వు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు కూడా. ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. 2005లో ఒంగోలులో మొదటి సారి ఇతనిపై చీటింగ్ కేసు నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంజీవ రావు, తులసి దంపతులతో పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరు 18న వారిని బెదిరించి బంగారు నగలు,స్విఫ్ట్ కారు ఏపీ 04- ఏఆర్ 9015( ఔటర్‌పై ప్రమాదానికి గురైన కారు)ను లాక్కున్నాడు. దీనిపై రాజమండ్రిలో కేసునమోదైంది. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి మల్కాజిగిరిలోని హోమ్‌కేర్‌లో పనిచేస్తోంది. ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. తిరుపతమ్మ ఆలయం సమీపంలోని ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు చెందిన గదిని అద్దెకు తీసుకున్నాడు. నాగేశ్వరరావుతో పరిచయం పెంచుకున్నాడు. సంజీవరావు నుంచి లాక్కున్న కారు నంబరును ఏపీ 20-ఏఆర్ 5959గా మార్చాడు. నాగేశ్వర్రావు కుటుంబ సభ్యులతోపాటు, తనతో ఉండే యువతిని తీసుకుని 2న షిరిడీకి వెళ్లాడు. తిరిగి వస్తూ ఈ నెల 5వ తేదీ పెద్ద గోల్కొండ వద్ద జరిగిన ప్రమాదంలో వెంకటరావు మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన శంషాబాద్పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మృతుడికి సంబంధించి పలు ఆసక్తి కరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన ఎస్ఐ శివకుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు.