మాయలోడు..
- ఈ నెల 5న ఔటర్‌పై ప్రమాదంలో మృతి చెందిన వెంకటరావు
- పలు జిల్లాల్లో చీటింగ్ కేసులు
- మృతుడు ప్రకాశం జిల్లా వాసి
శంషాబాద్ రూరల్: జల్సాలకు అలవాటు పడి భార్యా, పిల్లలను వదిలేశాడు.. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడం.. కొన్ని నెలలు వారితో సంసారం చేసి వదిలేయడం.. అంతేకాదు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకుని వారిని మోసం చేయడం అతని ప్రవృత్తి.. షిరిడీలో దైవ దర్శనం చేసుకుని వస్తూ మండల పరిధిలో ఔటర్ రింగు రోడ్డుపై ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని పూర్తి వివరాలను శంషాబాద్ పోలీసులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సీఐ ఉమామహేశ్వర్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసరిపాలెంకు చెందిన గుడిపాటి వెంకటరావు(36) అలియాస్ చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందుకు 18 ఏళ్ల కిందట తన అక్క రమణమ్మ కూతురు మంగమ్మతో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు. జులాయిగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో 11 ఏళ్ల కిందట భార్యా,పిల్లలను వదిలేసి వచ్చాడు.
జల్సాలకు అలవాటు పడిన వెంకట్‌రావు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారి నుంచి డబ్బులు కాజేయడం హాబీగా పెట్టుకున్నాడు. అవసరమైతే బెదిరింపులకు పాల్పడేవాడు. అంతేకాదు పేదింటి యువతులను మాయ మాటలతో తన వలలో వేసుకునేవాడు. యువతుల కుటుంబాలను తీర్థ యాత్రలకు తీసుకువెళ్లి మంచి అభిప్రాయం కలిగేలా ప్రవర్తించేవాడు.
ఒకరి తర్వాత మరొకరిని వివాహం చేసుకుని, కొన్నాళ్లు సంసారం చేసేవాడు. ఇలా యువతులను వంచించడం, డబ్బుల కోసం మోసం చేయడం, వంటి 10 కేసుల్లో వెంకట్‌రావు నిందితుడు. కడప జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకున్న ఘనుడు. ఈ ఘటనలో నలుగురు ఆర్ముడు రిజర్వు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు కూడా. ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి.
2005లో ఒంగోలులో మొదటి సారి ఇతనిపై చీటింగ్ కేసు నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంజీవ రావు, తులసి దంపతులతో పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరు 18న వారిని బెదిరించి బంగారు నగలు,స్విఫ్ట్ కారు ఏపీ 04- ఏఆర్ 9015( ఔటర్‌పై ప్రమాదానికి గురైన కారు)ను లాక్కున్నాడు. దీనిపై రాజమండ్రిలో కేసునమోదైంది. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి మల్కాజిగిరిలోని హోమ్‌కేర్‌లో పనిచేస్తోంది.
ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. తిరుపతమ్మ ఆలయం సమీపంలోని ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు చెందిన గదిని అద్దెకు తీసుకున్నాడు. నాగేశ్వరరావుతో పరిచయం పెంచుకున్నాడు. సంజీవరావు నుంచి లాక్కున్న కారు నంబరును ఏపీ 20-ఏఆర్ 5959గా మార్చాడు. నాగేశ్వర్‌రావు కుటుంబ సభ్యులతోపాటు, తనతో ఉండే యువతిని తీసుకుని 2న షిరిడీకి వెళ్లాడు.
తిరిగి వస్తూ ఈ నెల 5వ తేదీ పెద్ద గోల్కొండ వద్ద జరిగిన ప్రమాదంలో వెంకటరావు మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన శంషాబాద్‌పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మృతుడికి సంబంధించి పలు ఆసక్తి కరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన ఎస్‌ఐ శివకుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు.