ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం
అంబరాన్ని తాకింది. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవం ఈ ఏడాది కూడా కనులపండువగా
సాగింది. మంగళవారం మధ్యాహ్నం 3.26 గంటలకు ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి చదురుగుడి నుంచి కోట వరకు మూడుసార్లు సాగిన తిరువీధి ఉత్సవం సాయంత్రం 5.21 గంటలకు ముగిసింది.
నెలరోజులపాటు నిర్వహించే వేడుకల్లో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో బారులుతీరి అమ్మను దర్శించుకున్నారు. జిల్లాతోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన భక్తులు తరలివచ్చారు. వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగాయి. పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కోట బురుజుపై నుంచి తిరువీధి ఉత్సవాన్ని తిలకించారు. డీసీసీబీ కార్యాలయం నుంచి శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వీక్షించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఉండి ఎమ్మెల్యే ఆర్.రఘురామకృష్ణరాజు తదితరులు సిరిమానోత్సవాన్ని తిలకించారు.
– సాక్షి ప్రతినిధి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment