కోలుకుంటున్న పాడేరు బస్సు ప్రమాద బాధితులు
సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్ లోయలో ఆర్టీసీ బస్సు దూసుకుపోయిన ఘటనలో గాయపడిన ప్రయాణికులు కోలుకుంటున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో 21 మందికి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన సేవలందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్లు.. కలెక్టర్, ఇతర వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్‌పర్సన్ గదల బంగారమ్మ, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కణితి వెంకటరావులు ఆస్పత్రికి వెళ్లి బాధిత ప్రయాణికులను పరామర్శించారు. తీవ్ర గాయాలపాలైన బోడిరాజు, చిన్నమ్మలకు విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పిందని పాడేరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు చెప్పారు.
మెడికవర్ ఆస్పత్రిలో బాధితులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ శంకరరావు సోమవారం పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, ఇతర సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి కలెక్టర్ సుమిత్‌కుమార్, ఇతర అధికారులు నివేదికలు పంపుతున్నారు. ప్రయాణికులు కొండన్న, నారాయణమ్మల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment