చంటిగారూ.. స్టేషన్‌లో లొంగిపోండి!
విమానంలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియస్ చంటిబాబును పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని శంషాబాద్ పోలీసులు కోరారు. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని విజయవాడ 25వ వార్డు కార్పొరేటర్ అయిన ఉమ్మడి చంటి విజ్ఞప్తి చేయడంతో పోలీసులు సరేనన్నారు. తాను తన లాయర్ సహకారంతో వచ్చి లొంగిపోతానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు. రేపటిలోగా వచ్చి లొంగిపోని పక్షంలో మాత్రం తెలంగాణ నుంచి వచ్చే పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, బుధవారమే చంటిని అరెస్టు చేస్తారన్న సమాచారంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పలువురు టీడీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు.
వాస్తవానికి సంఘటన జరిగినప్పుడే చంటిపై కేసు నమోదు కావడంతో ఆయనను అదుపులోకి తీసుకోవాలని శంషాబాద్ పోలీసులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, స్థానిక ఎంపీతో ఫోన్ చేయించుకున్న చంటి.. తాత్కాలికంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఆయనపై కేసు నమోదైంది. దాంతో వెంటనే స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని పోలీసులు తెలిపారు.