ummadi Venkateswara Rao
-
నిద్రమత్తులో కాలు తగిలి ఉండొచ్చు: పోకిరీ కార్పొరేటర్
హైదరాబాద్ : మహిళా ప్రొఫెసర్‌ను తాను ఉద్దేశ పూర్వకంగా తాక లేదని, నిద్రమత్తులోనే కాలు తగిలి ఉండొచ్చని విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్రావు( చంటిబాబు) వివరణ ఇచ్చినట్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(ఆర్జీఐఏ) సీఐ సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తన పట్ల వెంకటేశ్వరరావు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఢిల్లీకి చెందిన మహిళా ప్రొఫెసర్ రీతు వాసు ప్రిమలానీ ఈనెల 13 వ తేదీన ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు రావాలంటూ నోటీసులు పంపగా... ఆయన గురువారం రాత్రి ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరణ ఇచ్చినట్టు సీఐ తెలిపారు. దర్యాప్తు అనంతరం వెంకటేశ్వరావుపై చార్జీషీట్ నమోదు చేస్తామన్నారు. -
పీఎస్‌లో లొంగిపోయిన పోకిరీ కార్పొరేటర్
హైదరాబాద్: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు శుక్రవారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని శంషాబాద్ పోలీసులు చంటిబాబును ఇదివరకే కోరిన విషయం తెలిసిందే. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని చంటిబాబు విజ్ఞప్తి చేశాడు. ఇక అరెస్టు తప్పదని భావించిన ఈ పోకిరీ కార్పోరేటర్ చివరికి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఎయిరిండియా విమానంలో ప్రయానిస్తున్న సమయంలో ఆమె పక్క సీట్లో కూర్చున్న ఉమ్మడి వెంకటేశ్వరరావు కాలితో పదేపదే తాకి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కేసు నమోదైన విషయం తెలిసిందే. -
పోకిరి కార్పొరేటర్ చుట్టూబిగుస్తున్న ఉచ్చు
రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు విచారణకు సహకరిస్తానన్న చంటి తలపట్టుకున్న టీడీపీ అధిష్టానం విజయవాడ : పోకిరి కార్పొరేటర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానంలో మహిళా ప్రొఫెసర్‌తో అసభ్యంగా ప్రవర్తిం చిన కేసులో విజయవాడ 25వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటే శ్వరరావు (చంటి)కు నాలుగు రోజుల క్రితమే తెలంగాణ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆయన బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అనారోగ్య కారణాల దృష్ట్యా తాను విచారణకు వెళ్లలేకపోయానని, త్వరలోనే లాయర్‌ను వెంటపెట్టుకొని వెళ్తానని వెంకటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. తెలంగాణ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. కార్పొరేటర్ వ్యవహారంతో పార్టీ అల్లరైపోవడంతో అధిష్టానం తలపట్టుకుంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఆ పార్టీ మహిళా కార్పొరేటర్లు రెండు రోజుల క్రితం కేశినేని భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మహిళా ప్రొఫెసర్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. విమానంలో అసలు ఏమీ జరగలేదని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ పోలీసుల నుంచి విచారణకు హాజరుకావాల్సిందిగా కార్పొరేటర్‌కు ఆదేశాలు అందడంతో సీన్‌మారింది. విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా బయటపడదాం..! విజ్ఞానయాత్ర తదనంతర పరిణామాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్ పలువురు కార్పొరేటర్ల నుంచి వివరాలు సేకరించారు. ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు. టూర్‌కు సంబంధించి భిన్న అభిప్రాయాలు, వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ చంటి అరెస్టయితే పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమా దం ఉందనే ఆందోళనలు పార్టీ నేతల్లో నెలకొన్నాయి. ఏమి చేసైనా ఈ కేసు నుంచి బయటపడితేనే పరువు దక్కుతుందనే అభిప్రాయానికి వచ్చిన పార్టీ నేతలు ఆ దిశగా మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలి సింది. టూర్లో కొందరు కార్పొరేటర్ల ఓవర్‌యాక్షన్‌కు సంబంధించి పార్టీ అధిష్టానం చీవాట్లు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
చంటిగారూ.. స్టేషన్లో లొంగిపోండి!
విమానంలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియస్ చంటిబాబును పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని శంషాబాద్ పోలీసులు కోరారు. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని విజయవాడ 25వ వార్డు కార్పొరేటర్ అయిన ఉమ్మడి చంటి విజ్ఞప్తి చేయడంతో పోలీసులు సరేనన్నారు. తాను తన లాయర్ సహకారంతో వచ్చి లొంగిపోతానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు. రేపటిలోగా వచ్చి లొంగిపోని పక్షంలో మాత్రం తెలంగాణ నుంచి వచ్చే పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, బుధవారమే చంటిని అరెస్టు చేస్తారన్న సమాచారంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పలువురు టీడీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. వాస్తవానికి సంఘటన జరిగినప్పుడే చంటిపై కేసు నమోదు కావడంతో ఆయనను అదుపులోకి తీసుకోవాలని శంషాబాద్ పోలీసులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, స్థానిక ఎంపీతో ఫోన్ చేయించుకున్న చంటి.. తాత్కాలికంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఆయనపై కేసు నమోదైంది. దాంతో వెంటనే స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని పోలీసులు తెలిపారు. -
కార్పొరేటర్ చంటిబాబుకు నోటీసులు
హైదరాబాద్: విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు. ఈ కేసుపై ఆయన వివరణ కోరుతున్నట్లు డీసీపీ చెప్పారు. ఎయిరిండియా విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చంటిబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. -
పోకిరీ కార్పొరేటర్
♦ విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్య ప్రవర్తన ♦ విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు నిర్వాకం ♦ కేసు నమోదు చేసిన ఆర్జీఐఏ పోలీసులు సాక్షి, హైదరాబాద్: విమానంలో మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ 25 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుపై శంషాబాద్ విమానాశ్రయంలోని ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సుధాకర్ కథనం ప్రకారం... హైదరాబాద్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ-544 విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరారు. హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఈ విమానంలోనే ఆమె పక్కసీట్లోనే కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు కూర్చున్నాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోపు మహిళా ప్రొఫెసర్‌ను తన కాలివేళ్లతో పదేపదే తాకడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. కార్పొరేటర్ ప్రవర్తనపై బాధితురాలు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావుపై పోలీసులు 354 సెక్షన్(మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్‌ను పోలీసులకు అప్పగించాల్సిన ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో అతడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆర్జీఐఏ పోలీసులు వెంటనే కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు సమాచారం అందించగా, వెంకటేశ్వరరావు ఆలోపే అక్కడి నుంచి జారుకున్నట్లు సమాధానమిచ్చారు. అతడిని పట్టుకునేందుకు చట్టపరంగా ముందుకెళతామని సీఐ సుధాకర్ తెలిపారు. ఎయిర్ ఇండియా సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే నిందితుడు ఈపాటికి కటకటాల్లో ఉండేవాడని పోలీసులు అంటున్నారు. కేంద్ర మంత్రి ఆరా : విమానంలో కార్పొరేటర్ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కేంద్రమంత్రి మేనకా గాంధీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మేనకా గాంధీ తెలంగాణ సీఎం కార్యాలయానికి ఫోన్ చేశారు. దీంతో అక్కడి అధికారులు పోలీసులను సంప్రదించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలను వారు మేనకకు వివరించినట్లు సమాచారం. బాధితురాలు రీతూవాసు కేంద్రమంత్రికి సన్నిహితురాలని తెలిసింది. కాగా, విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల టీడీపీ కార్పొరేటర్ అసభ్య ప్రవర్తనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడలో మేయర్ శ్రీధర్ వాహనాన్ని అడ్డుకున్నాయి. పొంతన లేని వాదన : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉమ్మడి వెంకటేశ్వరరావును రక్షించుకొనేందుకు అధికార టీడీపీ కార్పొరేటర్లు పొంతనలేనివాదన వినిపించారు. విమానంలో ఆయన పక్కసీట్లో కూర్చున్న మహిళకు 60 ఏళ్లు ఉంటాయన్నారు. విమానం ఎక్కిన దగ్గర నుంచీ ఆమె అందరితో గొడవ పడిందన్నారు. అయితే వెంకటేశ్వరరావుపైనే ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలారు. ఇదిలా ఉండగా... శంషాబాద్ ఎయిర్ ఇండియా సెక్యూరిటీ అధికారుల ఆదేశాల మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. తాను ఏ తప్పూ చేయలేదని, నిద్రలో పొరపాటున తన కాలు మహిళకు తగిలిందని అతడు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.