పోకిరి కార్పొరేటర్ చుట్టూబిగుస్తున్న ఉచ్చు
రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు
విచారణకు సహకరిస్తానన్న చంటి
తలపట్టుకున్న టీడీపీ అధిష్టానం
విజయవాడ : పోకిరి కార్పొరేటర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానంలో మహిళా ప్రొఫెసర్‌తో అసభ్యంగా ప్రవర్తిం చిన కేసులో విజయవాడ 25వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటే శ్వరరావు (చంటి)కు నాలుగు రోజుల క్రితమే తెలంగాణ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆయన బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అనారోగ్య కారణాల దృష్ట్యా తాను విచారణకు వెళ్లలేకపోయానని, త్వరలోనే లాయర్‌ను వెంటపెట్టుకొని వెళ్తానని వెంకటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు.
తెలంగాణ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. కార్పొరేటర్ వ్యవహారంతో పార్టీ అల్లరైపోవడంతో అధిష్టానం తలపట్టుకుంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఆ పార్టీ మహిళా కార్పొరేటర్లు రెండు రోజుల క్రితం కేశినేని భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మహిళా ప్రొఫెసర్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. విమానంలో అసలు ఏమీ జరగలేదని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ పోలీసుల నుంచి విచారణకు హాజరుకావాల్సిందిగా కార్పొరేటర్‌కు ఆదేశాలు అందడంతో సీన్‌మారింది. విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎలా బయటపడదాం..!
విజ్ఞానయాత్ర తదనంతర పరిణామాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్ పలువురు కార్పొరేటర్ల నుంచి వివరాలు సేకరించారు. ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు. టూర్‌కు సంబంధించి భిన్న అభిప్రాయాలు, వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ చంటి అరెస్టయితే పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమా దం ఉందనే ఆందోళనలు పార్టీ నేతల్లో నెలకొన్నాయి. ఏమి చేసైనా ఈ కేసు నుంచి బయటపడితేనే పరువు దక్కుతుందనే అభిప్రాయానికి వచ్చిన పార్టీ నేతలు ఆ దిశగా మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలి సింది. టూర్‌లో కొందరు కార్పొరేటర్ల ఓవర్‌యాక్షన్‌కు సంబంధించి పార్టీ అధిష్టానం చీవాట్లు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.