పోకిరీ కార్పొరేటర్
♦ విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్య ప్రవర్తన
♦ విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు నిర్వాకం
♦ కేసు నమోదు చేసిన ఆర్‌జీఐఏ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: విమానంలో మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ 25 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుపై శంషాబాద్ విమానాశ్రయంలోని ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సుధాకర్ కథనం ప్రకారం... హైదరాబాద్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ-544 విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరారు. హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఈ విమానంలోనే ఆమె పక్కసీట్లోనే కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు కూర్చున్నాడు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోపు మహిళా ప్రొఫెసర్‌ను తన కాలివేళ్లతో పదేపదే తాకడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. కార్పొరేటర్ ప్రవర్తనపై బాధితురాలు ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావుపై పోలీసులు 354 సెక్షన్(మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేశారు.
అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్‌ను పోలీసులకు అప్పగించాల్సిన ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో అతడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆర్‌జీఐఏ పోలీసులు వెంటనే కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు సమాచారం అందించగా, వెంకటేశ్వరరావు ఆలోపే అక్కడి నుంచి జారుకున్నట్లు సమాధానమిచ్చారు. అతడిని పట్టుకునేందుకు చట్టపరంగా ముందుకెళతామని సీఐ సుధాకర్ తెలిపారు. ఎయిర్ ఇండియా సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే నిందితుడు ఈపాటికి కటకటాల్లో ఉండేవాడని పోలీసులు అంటున్నారు.
కేంద్ర మంత్రి ఆరా : విమానంలో కార్పొరేటర్ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కేంద్రమంత్రి మేనకా గాంధీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మేనకా గాంధీ తెలంగాణ సీఎం కార్యాలయానికి ఫోన్ చేశారు. దీంతో అక్కడి అధికారులు పోలీసులను సంప్రదించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలను వారు మేనకకు వివరించినట్లు సమాచారం. బాధితురాలు రీతూవాసు కేంద్రమంత్రికి సన్నిహితురాలని తెలిసింది. కాగా, విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల టీడీపీ కార్పొరేటర్ అసభ్య ప్రవర్తనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడలో మేయర్ శ్రీధర్ వాహనాన్ని అడ్డుకున్నాయి.
పొంతన లేని వాదన : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉమ్మడి వెంకటేశ్వరరావును రక్షించుకొనేందుకు అధికార టీడీపీ కార్పొరేటర్లు పొంతనలేనివాదన వినిపించారు. విమానంలో ఆయన పక్కసీట్లో కూర్చున్న మహిళకు 60 ఏళ్లు ఉంటాయన్నారు. విమానం ఎక్కిన దగ్గర నుంచీ ఆమె అందరితో గొడవ పడిందన్నారు. అయితే వెంకటేశ్వరరావుపైనే ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలారు. ఇదిలా ఉండగా... శంషాబాద్ ఎయిర్ ఇండియా సెక్యూరిటీ అధికారుల ఆదేశాల మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. తాను ఏ తప్పూ చేయలేదని, నిద్రలో పొరపాటున తన కాలు మహిళకు తగిలిందని అతడు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.