విజయవాడ కార్పోరేషన్ మేయర్ కోనేరు శ్రీధర్(ఫైల్ ఫొటో)
విజయవాడ సెంట్రల్ : ‘బ్రదరూ.. మేయర్ వల్ల మనకేం ఉపయోగం లేదు. నన్ను సపోర్టు చేయండి. మీ మంచి చెడ్డా నేను చూసుకుంటా. ఇదే మంచి చాన్స్. మీ నియోజకవర్గంలో కార్పొరేటర్ల మద్దతు కూడగట్టు. పార్టీ హైకమాండ్‌తో మాట్లాడేద్దాం..’ - విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ స్కెచ్ ఇది. ‘మేయర్ మీతో ఎలా ఉంటారు.. నగరాభివృద్ధిపై చర్చిస్తారా? అందరినీ కలుపుకుపోయే ధోరణి ఉందా?’ - టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పలువురు కార్పొరేటర్లతో అధిష్టానం తరఫున ఫోన్ సంభాషణ ఇది.
కార్పొరేటర్ల విజ్ఞానయాత్ర రచ్చ కొత్త మలుపు తిరుగుతోంది. విజయవాడ మేయర్ చైర్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. అసమ్మతి వర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇంతటి రాద్ధాంతానికి మేయర్ వైఖరే కారణమంటూ పలువురు కార్పొరేటర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లకు ఫోన్లు వచ్చాయి. మేయర్ మీతో ఎలా ఉంటారన్న ప్రశ్నకు.. ‘అబ్బే.. అసలేం బాగోరు.. అంతా ఏకపక్షమే..’ అంటూ పలువురు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పూణే ఘటనపై పత్రికల్లో వచ్చినప్పుడే మేయర్ నోరువిప్పి ఉంటే పార్టీ ఇంతగా డ్యామేజ్ అయ్యేది కాదని ఓ కార్పొరేటర్ అధిష్టానం వద్ద కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. విమానంలో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన ఘటనలో అడ్డంగా బుక్కైన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి వ్యవహారాన్ని ఆసరాగా తీసుకొని మేయర్ చైర్‌కు ఎసరు పెట్టాలన్నది అసమ్మతి వర్గం వ్యూహంగా తెలుస్తోంది. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని మేయర్ అసమ్మతి వర్గంతో రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
ఎమ్మెల్యేల ఆశీస్సులతో!
తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలతో మేయర్ కోనేరు శ్రీధర్‌కు మొదటి నుంచి పొసగడం లేదనే వాదనలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఆశీస్సులతోనే ఆయన మేయర్ చైర్ దక్కించుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆశావహ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల ఆశీస్సులతో మేయర్ చైర్‌ను దక్కించుకోవాలనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పదవుల్ని మార్చాలనే ప్రతిపాదన గత మూడు నెలలుగా నడుస్తోంది. ఈ పదవుల పంపిణీకి సంబంధించి ఎమ్మెల్యేలు తమ శిష్యగణానికి హామీలు ఇచ్చారు. మేయర్ మార్పుపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిది కావడంతో ఇప్పటివరకు దానిపై ఎవరూ నోరు మెదపలేదు. విజ్ఞానయాత్ర ఘటనతో పార్టీకి నష్టం జరిగింది కాబట్టి డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లతో పాటు మేయర్‌ను మార్చాలనే వాదనను ప్రత్యర్థి వర్గం తెరపైకి తెచ్చింది.
ఇంటెలిజెన్స్ ఆరా : విమానంలో ఘటన నేపథ్యంలో విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. నగరపాలక సంస్థలోని సెక్రటరీ సెల్, పీఆర్వో విభాగాల నుంచి కార్పొరేటర్ల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకెళ్లారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు మరికొందరు కార్పొరేటర్ల ప్రవర్తనపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. విజ్ఞానయాత్రలో ఎలాంటి తప్పూ జరగలేదని, ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తామంటూ ప్రకటించిన నాయకుల్ని తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి.