మేయర్‌గా శ్రీధరే కొనసాగుతారు
స్పష్టంచేసిన టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు
కలకలం రేపిన ‘సాక్షి’ కథనం
విజయవాడ సెంట్రల్ : టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు స్వరం మార్చారు. ‘మేయర్‌గా కోనేరు శ్రీధరే కొనసాగుతారు. మా మద్దతు ఆయనకే. కావాలంటే రాసిస్తాం..’ అని స్పష్టంచేశారు. ‘టీడీపీలో చైర్‌వార్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆ పార్టీలో తీవ్ర కలకలమే రేపింది. పార్టీ పరువు బజారున పడటంతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు అధ్యక్షతన సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ భూముల లేఅవుట్ రిలీజ్‌పై అవగాహన లేకపోవడం వల్ల మేయర్‌ను ప్రశ్నించామన్నారు. మేయర్‌ను తాము వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేసుకోలేదు. గుట్టుచప్పుడు కాకుండా చేసేద్దామనుకున్న తీర్మానం బెడిసికొట్టింది. దీంతో తీర్మానాన్ని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
డీవియేషన్స్ లేవు
లేఅవుట్ వ్యవహారంపై కమిషనర్ జి.వీరపాండియన్ నోరు విప్పారు. శనివారం తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొసైటీ భూములకు సంబంధించి ఎలాంటి డీవియేషన్స్ లేవన్నారు. అందువల్లే తాను కౌన్సిల్‌కు ప్రతిపాదన పెట్టానని చెప్పారు. పదిశాతం కంటే స్థలం తగ్గినవారు భవిష్యత్‌లో ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరితే ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ముందే ఊహించలేం కదా అని బదులిచ్చారు. కౌన్సిల్ అత్యవసర సమావేశంలో తీర్మానాన్ని రద్దు చేస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ‘చూద్దాం..’ అన్నారు.
చర్యలు తీసుకోండి
లేఅవుట్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు కోరారు. శనివారం కమిషనర్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
సొసైటీ పాలకవర్గం ప్రదక్షిణలు
రాజకీయ పార్టీలు, అధికారుల చుట్టూ సొసైటీ పాలకవర్గం ప్రదక్షిణలు చేస్తోంది. లేఅవుట్‌లో ఎలాంటి అవకతవకలు లేవని తీర్మానాన్ని యథాతథంగా ఆమోదించాల్సిందిగా అధికార, ప్రతిపక్ష సభ్యులను వారు వేర్వేరుగా కలిసి కోరారు. ‘అల్లరి అయిపోయింది కాబట్టి తామేమీ చేయలేం..’ అని పాలకపక్షం సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది. పదిశాతంపైనే పట్టుబట్టాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు భావిస్తున్నారు. కౌన్సిల్‌కు ప్రతిపాదన పెట్టడంతోనే తన పనైపోయిందని, తుది నిర్ణయం కౌన్సిల్‌దేనని కమిషనర్ స్పష్టం చేశారని తెలుస్తోంది. ఎవరికివారు చేతులెత్తేయడంతో సొసైటీ పాలకవర్గం అంతర్మథనంలో పడింది.
మెట్టు దిగారు
Published Sun, May 17 2015 2:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement