రాజమహేంద్రవరం సిటీ: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం వేదికగా నగర టీడీపీలో గ్రూపు విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏకంగా వేదికపై నుంచే మేయర్ పంతం రజనీశేషసాయి ‘నేను పార్టీలోనే ఉన్నానా? లేదా? అర్థం కావడం లేదు’ అని అనడం సంచలనం రేపింది. స్థానిక 42వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వేదికపైన, చుట్టుపక్కల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేదికపై ఉన్న ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టకపోవడంపై మేయర్ పైవిధంగా స్పందించారు. అనంతరం గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ మైకు అందుకొని ‘గౌరవం ఆపాదించుకుంటే రాదు. తమ పనుల ద్వారా సంపాదించుకోవాలి’ అని మేయర్‌నుద్దేశించి అన్నారు.
తరువాత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ‘పొరపాటు వల్ల ఫొటో వేయకపోవచ్చు. పెద్దగా పట్టించుకోకూడదు. మేయర్ తెలియనివారు ఉండరు’ అని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, 30 ఏళ్లుగా పార్టీలో తన పేరు, ఫొటో గురించి పట్టించుకోలేదని, పదవులతో పార్టీకి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. ఇటీవల గణేష్‌చౌక్ సమీపంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాకుండానే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ ఇంటింటికీ టీడీపీ ప్రారంభించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనతో నగర టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, గన్ని కృష్ణ, పంతం రజనీ శేషసాయి వర్గాలుగా విడిపోయినట్టుగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment