Sridhar Koneru
-
మేయర్‌ను మార్చేద్దాం!
విజయవాడ సెంట్రల్ : ‘బ్రదరూ.. మేయర్ వల్ల మనకేం ఉపయోగం లేదు. నన్ను సపోర్టు చేయండి. మీ మంచి చెడ్డా నేను చూసుకుంటా. ఇదే మంచి చాన్స్. మీ నియోజకవర్గంలో కార్పొరేటర్ల మద్దతు కూడగట్టు. పార్టీ హైకమాండ్‌తో మాట్లాడేద్దాం..’ - విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ స్కెచ్ ఇది. ‘మేయర్ మీతో ఎలా ఉంటారు.. నగరాభివృద్ధిపై చర్చిస్తారా? అందరినీ కలుపుకుపోయే ధోరణి ఉందా?’ - టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పలువురు కార్పొరేటర్లతో అధిష్టానం తరఫున ఫోన్ సంభాషణ ఇది. కార్పొరేటర్ల విజ్ఞానయాత్ర రచ్చ కొత్త మలుపు తిరుగుతోంది. విజయవాడ మేయర్ చైర్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. అసమ్మతి వర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇంతటి రాద్ధాంతానికి మేయర్ వైఖరే కారణమంటూ పలువురు కార్పొరేటర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లకు ఫోన్లు వచ్చాయి. మేయర్ మీతో ఎలా ఉంటారన్న ప్రశ్నకు.. ‘అబ్బే.. అసలేం బాగోరు.. అంతా ఏకపక్షమే..’ అంటూ పలువురు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పూణే ఘటనపై పత్రికల్లో వచ్చినప్పుడే మేయర్ నోరువిప్పి ఉంటే పార్టీ ఇంతగా డ్యామేజ్ అయ్యేది కాదని ఓ కార్పొరేటర్ అధిష్టానం వద్ద కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. విమానంలో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన ఘటనలో అడ్డంగా బుక్కైన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి వ్యవహారాన్ని ఆసరాగా తీసుకొని మేయర్ చైర్‌కు ఎసరు పెట్టాలన్నది అసమ్మతి వర్గం వ్యూహంగా తెలుస్తోంది. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని మేయర్ అసమ్మతి వర్గంతో రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేల ఆశీస్సులతో! తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలతో మేయర్ కోనేరు శ్రీధర్‌కు మొదటి నుంచి పొసగడం లేదనే వాదనలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఆశీస్సులతోనే ఆయన మేయర్ చైర్ దక్కించుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆశావహ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల ఆశీస్సులతో మేయర్ చైర్‌ను దక్కించుకోవాలనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పదవుల్ని మార్చాలనే ప్రతిపాదన గత మూడు నెలలుగా నడుస్తోంది. ఈ పదవుల పంపిణీకి సంబంధించి ఎమ్మెల్యేలు తమ శిష్యగణానికి హామీలు ఇచ్చారు. మేయర్ మార్పుపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిది కావడంతో ఇప్పటివరకు దానిపై ఎవరూ నోరు మెదపలేదు. విజ్ఞానయాత్ర ఘటనతో పార్టీకి నష్టం జరిగింది కాబట్టి డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లతో పాటు మేయర్‌ను మార్చాలనే వాదనను ప్రత్యర్థి వర్గం తెరపైకి తెచ్చింది. ఇంటెలిజెన్స్ ఆరా : విమానంలో ఘటన నేపథ్యంలో విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. నగరపాలక సంస్థలోని సెక్రటరీ సెల్, పీఆర్వో విభాగాల నుంచి కార్పొరేటర్ల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకెళ్లారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు మరికొందరు కార్పొరేటర్ల ప్రవర్తనపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. విజ్ఞానయాత్రలో ఎలాంటి తప్పూ జరగలేదని, ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తామంటూ ప్రకటించిన నాయకుల్ని తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. -
మెట్టు దిగారు
మేయర్‌గా శ్రీధరే కొనసాగుతారు స్పష్టంచేసిన టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు కలకలం రేపిన ‘సాక్షి’ కథనం విజయవాడ సెంట్రల్ : టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు స్వరం మార్చారు. ‘మేయర్‌గా కోనేరు శ్రీధరే కొనసాగుతారు. మా మద్దతు ఆయనకే. కావాలంటే రాసిస్తాం..’ అని స్పష్టంచేశారు. ‘టీడీపీలో చైర్వార్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆ పార్టీలో తీవ్ర కలకలమే రేపింది. పార్టీ పరువు బజారున పడటంతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు అధ్యక్షతన సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ భూముల లేఅవుట్ రిలీజ్‌పై అవగాహన లేకపోవడం వల్ల మేయర్‌ను ప్రశ్నించామన్నారు. మేయర్‌ను తాము వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేసుకోలేదు. గుట్టుచప్పుడు కాకుండా చేసేద్దామనుకున్న తీర్మానం బెడిసికొట్టింది. దీంతో తీర్మానాన్ని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. డీవియేషన్స్ లేవు లేఅవుట్ వ్యవహారంపై కమిషనర్ జి.వీరపాండియన్ నోరు విప్పారు. శనివారం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొసైటీ భూములకు సంబంధించి ఎలాంటి డీవియేషన్స్ లేవన్నారు. అందువల్లే తాను కౌన్సిల్‌కు ప్రతిపాదన పెట్టానని చెప్పారు. పదిశాతం కంటే స్థలం తగ్గినవారు భవిష్యత్‌లో ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరితే ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ముందే ఊహించలేం కదా అని బదులిచ్చారు. కౌన్సిల్ అత్యవసర సమావేశంలో తీర్మానాన్ని రద్దు చేస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ‘చూద్దాం..’ అన్నారు. చర్యలు తీసుకోండి లేఅవుట్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు కోరారు. శనివారం కమిషనర్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సొసైటీ పాలకవర్గం ప్రదక్షిణలు రాజకీయ పార్టీలు, అధికారుల చుట్టూ సొసైటీ పాలకవర్గం ప్రదక్షిణలు చేస్తోంది. లేఅవుట్లో ఎలాంటి అవకతవకలు లేవని తీర్మానాన్ని యథాతథంగా ఆమోదించాల్సిందిగా అధికార, ప్రతిపక్ష సభ్యులను వారు వేర్వేరుగా కలిసి కోరారు. ‘అల్లరి అయిపోయింది కాబట్టి తామేమీ చేయలేం..’ అని పాలకపక్షం సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది. పదిశాతంపైనే పట్టుబట్టాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు భావిస్తున్నారు. కౌన్సిల్‌కు ప్రతిపాదన పెట్టడంతోనే తన పనైపోయిందని, తుది నిర్ణయం కౌన్సిల్‌దేనని కమిషనర్ స్పష్టం చేశారని తెలుస్తోంది. ఎవరికివారు చేతులెత్తేయడంతో సొసైటీ పాలకవర్గం అంతర్మథనంలో పడింది. -
పార్టీకి చేటు తేవద్దు
నగరపాలక సంస్థలో కలహాలపై అసహనం సీఎం అసహనం మేయర్‌కు క్లాస్! విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రాజకీయాలపై సీఎం చంద్రబాబు మేయర్ కోనేరు శ్రీధర్‌కు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అంతర్గత కల హాలతో పార్టీకి చేటు తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. రెండు రోజులపాటు నగరంలో బస చేసిన సీఎం కార్పొరేషన్ కలహాలపై పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్పొరేటర్లలో ఒక వర్గం, మేయర్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుసుకున్న ఆయన పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఐదు నెలల్లోనే వివాదాస్పదంగా మారడం మంచిది కాదని మేయర్‌కు చురకలు అంటించినట్లు తెలిసింది. అందరూ కలిసి ఉంటేనే పార్టీ బలంగా ఉంటుదని, తీరుమార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం.