వేడెక్కిన నగరపాలక సంస్థ టీడీపీ పాలి‘ట్రిక్స్’
మేయర్‌ను దింపేందుకు అసమ్మతి వర్గం యత్నాలు
తమకు మద్దతిచ్చి గద్దెనెక్కిస్తే నెలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రతిపాదన
సీఎం వద్ద పంచాయితీకి సిద్ధమైన మేయర్ గ్రూపు
ఎత్తుకు పై ఎత్తులతో నగరపాలక సంస్థ టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్‌ను గద్దె దింపేందుకు అసమ్మతి వర్గం రూ.లక్షల్లో ఎరవేసింది. నెలవారీ ఆదాయంగా రూ.2 లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రతిపాదనతో మెజారిటీ కార్పొరేటర్లు అసమ్మతి వర్గానికి చేరువయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.
విజయవాడ సెంట్రల్ : ఐదేళ్లపాటు నగర పాలన బాధ్యతలను అప్పగించిన ప్రజల తీర్పును టీడీపీ అపహాస్యం చేస్తోంది. పార్టీ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. అసమ్మతి వర్గం మేయర్ కుర్చీకోసం మామూళ్ల పర్వానికి తెరలేపగా.. మేయర్ వర్గం కుర్చీని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది.
మేయర్ చైర్‌ను దక్కించుకొనేందుకు అసమ్మతి వర్గం అధికారపార్టీ కార్పొరేటర్లకు మామూళ్ల ఎర వేసింది. తమ ప్యానల్ గద్దెనెక్కితే సహకరించిన కార్పొరేటర్లకు ఒక్కక్కరికి నెలకు రూ.2 లక్షల చొప్పున ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రతిపాదనతో మెజారిటీ (23మంది) కార్పొరేటర్ల మద్దతు కూడగట్టగలిగిందని సమాచారం. అసమ్మతి వర్గం కదలికలపై నిఘా పెట్టిన మేయర్ గ్రూపు ఈ విషయాన్ని పసిగట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైందని తెలిసింది.
కోల్డ్ వార్‌కు కారణాలెన్నో...
టీడీపీలో కొంతకాలంగా సాగుతున్న కోల్డ్‌వార్ బట్టబయలవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు చేసిన ప్రతిపాదనను మేయర్ తోసిపుచ్చడం వల్ల వారే అసమ్మతి వర్గం కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పాలక సంస్థ వాటర్‌ట్యాంకులపై ప్రైవేటు కంపెనీల సెల్‌టవర్లు ఏర్పాటు చేసుకొనే అవకాశం కల్పించమనివారు కోరగా మేయర్ నిరాకరించారు. గతనెలలో జరిగిన సమావేశంలో వాటర్ ట్యాంకులపై ప్రస్తుతం ఉన్న అన్ని సెల్‌టవర్లను తొలగించాల్సిందిగా కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. సెల్‌టవర్ కంపెనీలతో భారీ డీల్ కుదుర్చుకోగా మేయర్ గండికొట్టడంతో వారు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్‌లో ప్లాంట్‌ఫారాలపై వ్యాపారాలు చేసుకొనే వారి అద్దెలను పెంపుదల చేయాల్సిందిగా మేయర్ అధికారులను ఆదేశించారు. అద్దె పెంపుదల చేయొద్దన్న బుద్దా సూచనలను మేయర్ పట్టించుకోనట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ మనసులో పెట్టకొనే మేయర్ కుర్చీకి ఎసరు పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.
సీఎం అపాయింట్‌మెంట్ కోరిన మేయర్ వర్గం
అసమ్మతి గ్రూపు, వారికి సహకరిస్తున్న నాయకుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు మేయర్ వర్గం సిద్ధమైంది. ఈ మేరకు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కొందరు కుట్ర పన్నుతున్నారని ఆధారాలతో సహా సీఎంకు ఫిర్యాదు చేస్తారని సమాచారం. విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం మేయర్‌ను మార్చేద్దామని చండీఘర్‌లోనే వ్యూహరచన చేసిందని, ఇందులో భాగంగానే సంతకాల సేకరణ పేరుతో హంగామా చేస్తోందని మేయర్ వర్గం ఆరోపిస్తోంది. తలనొప్పిగా మారిన నగరపాలక సంస్థ టీడీపీ పాలి‘ట్రిక్స్’పై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందని తెలిసింది.