తెలుగు తమ్ముళ్లకు ప్రేమతో.. | Upset value 'tender' | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్లకు ప్రేమతో..

Published Wed, Jan 20 2016 1:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

తెలుగు తమ్ముళ్లకు ప్రేమతో.. - Sakshi

తెలుగు తమ్ముళ్లకు ప్రేమతో..

అప్‌సెట్ వాల్యూకు ‘టెండర్’
స్పందన లేదన్న సాకుతో పదిశాతం తగ్గింపునకు ప్రతిపాదన
స్టాండింగ్ కమిటీదే తుది నిర్ణయం

 
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆధీనంలోని పార్కింగ్ ప్రాంతాలకు నిర్ణయించిన అప్‌సెట్ వాల్యూకు ‘టెండర్’ పెట్టేందుకు రంగం సిద్ధంమైంది. గతంలో నిర్ణయించిన ధరలో పదిశాతం తగ్గించాలంటూ ఎస్టేట్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బుధవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే ఈరకమైన వ్యూహాన్ని రూపొందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆశీస్సులతో గతంలో ఎన్టీఆర్ పార్కింగ్ స్థలాన్ని దక్కించుకొని లీజు సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టిన తెలుగుతమ్ముళ్లే దీనికి స్క్రీన్‌ప్లే రూపొందించారని సమాచారం.
 
విచిత్రం
ఎన్టీఆర్, కేబీఎన్ పార్కింగ్ సెల్లారు, గోవిందరాజులు, బీవీఆర్ కాంప్లెక్స్,బ్రహ్మానందరెడ్డి సెల్లార్ పార్కింగ్‌లకు సంబంధించి ఏడాదికి రూ.66,10,161  అప్‌సెట్ వ్యాల్యూగా నిర్ణయించారు. గతంలో లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్లు డబ్బు సక్రమంగా చెల్లించని కారణంగా ఈ పార్కింగ్ ప్రాంతాలను ప్రస్తుతం కార్పొరేషనే నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఏడాదికి రూ.38,30,400 ఆదాయం వస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోజువారీ పార్కింగ్ ఫీజులను సిబ్బంది నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్‌సెట్ వాల్యూకు వసూలు అవుతున్న మొత్తానికి రూ.27,79,761 వ్యత్సాసం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈ కారణంగా పదిశాతం అప్‌సెట్‌వాల్యూ తగ్గించాలనే ప్రతిపాదన తెచ్చారు. అప్‌సెట్ వాల్యూలో ఏటా పెరుగుదలే కానీ తగ్గుదల ఉండదు. ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం విడ్డూరం.  
 
అంతా అప్‌సెట్
 ఏలూరు రోడ్డులోని హోటల్ రాజ్‌టవర్స్ ముందుభాగం, హోటల్ రాజ్‌టవర్స్ తూర్పువైపు పెట్రోల్       బంకుకు ఎడమ, కుడి మార్జిన్, ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం వద్ద, లిబర్టీ హెయిర్‌స్టైల్ వద్ద, స్వగృహ ఫుడ్స్, శ్రీరామ చిట్‌ఫండ్స్, ఎస్‌బీఐ ఏటీఎం వద్ద, ఏవీ ఆప్టికల్స్, పాజిటివ్ హోమియోపతి హాస్పటల్ వద్ద, రవిమెడికల్స్ వద్ద పార్కింగ్ ప్రాంతాలకు సంబంధించి అప్‌సెట్ వాల్యూను రూ.11,49,506గా నిర్ణయిం చారు. దీన్ని పదిశాతం మేర తగ్గించాలని ప్రతిపాదన చేశారు. బ్రహ్మానందరెడ్డి పార్కింగ్ సెల్లార్‌కు సంబంధించి అప్‌సెట్ వాల్యూ రూ.2,43,000 నిర్ణయించి గతేడాది సెప్టెంబర్ 11న టెండర్ పిలిచారు. రూ.2,49,999కి ఎం.నరేంద్ర టెండర్ దాఖలు చేశారు. అంటే అప్‌సెట్ వ్యాల్యూకంటే ఎక్కువే. సింగిల్ టెండర్ కావడంతో దీన్ని ఆమోదించలేదు. దీన్నిబట్టి చూస్తే అప్‌సెట్ వాల్యూ కంటే అధికంగా టెండర్లు దాఖలు అవుతున్నాయన్న విషయం అర్థమవుతోంది.
 
అప్‌సెట్ వ్యాల్యూకు టెండర్
ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతానికి సంబంధించి రూ.45,67,731 అప్‌సెట్ వాల్యూ కాగా ఏదాడికి రూ.25,56,000 వసూలవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది మినహా మిగిలిన పార్కింగ్ ప్రాంతాల అప్‌సెట్ వ్యాల్యూలో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. అయినప్పటికీ అన్నింటికీ పదిశాతం మినహా యింపు ఇవ్వాలనడం అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లు రింగ్ అవ్వడం, ఎస్టేట్ అధికారులు చేతి వాటాన్ని ప్రదర్శించడం వల్లే ఆశించిన స్థాయిలో పార్కింగ్ ప్రాంతాల నుంచి ఆదాయం రావడం లేదన్నది బహిరంగ రహస్యం. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా అప్‌సెట్ వాల్యూకు టెండర్ పెట్టాలనుకోవడం వివాదాస్పదమైంది. స్టాండింగ్ కమిటీ సభ్యులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement