అక్రమ నిర్మాణాన్ని పడగొడుతున్న సిబ్బంది
నగరపాలక సంస్థ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. ఎన్నడూ లేని విధంగా దాడులు చేస్తూ, నోరు పారేసుకుంటున్నారు. ఇలాగైతే తాము ఇక్కడ పని చేయలేమంటూ అధికారులు, సిబ్బంది చర్చించుకోవడం దుమారం రేపుతోంది.
అనంతపురం న్యూసిటీ: రాంనగర్‌లోని వెంకటేశ్వర దేవాలయం సమీపంలో టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోకుండా ఓ యజమాని నిర్మాణాలు చేపట్టాడు. టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ (టీపీఎస్) వినయ్‌కుమార్ చాలాసార్లు బిల్డర్ (యజమాని)కి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ నెల 29న నిర్మాణ పనులు మరింత వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం టీపీఎస్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో వెళ్లి అనధికార నిర్మాణం చేపడుతున్న గోడను తొలగించారు. స్థల యజమాని కుమారుడు, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కుమారుడు మిత్రులు. విషయం ఎమ్మెల్యే వర్గీయుల దృష్టికి వెళ్లింది.
ఫోన్‌లో నటేష్‌చౌదరి వార్నింగ్
చివరకు కార్పొరేటర్ నటేష్‌చౌదరి రంగంలోకి దిగి టీపీఎస్‌ను ఫోన్‌లో దుర్భాషలాడాడు. తనకు తెలియకుండా, తన అనుమతిలేకుండా తన డివిజన్‌లోకి అడుగుపెట్టి నిర్మాణాన్ని తొలగిస్తావా అంటూ ఆగ్రహించాడు. తనపై ఇదివరకే మర్డర్ కేసు ఉందని, కేసులు కొత్తేమీ కాదని.. నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగక ఎక్కడున్నావంటూ గద్దించడంతో ఆఫీసులో ఉన్నానని టీపీఎస్ తెలిపాడు. కార్పొరేటర్ మందీమార్బలంతో వస్తున్నాడని పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని భావించిన అధికారులు టీపీఎస్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అనుకున్నట్టుగానే నటేష్‌చౌదరి కార్యాలయానికి చేరుకుని టీపీఎస్ ఎక్కడున్నాడంటూ వీరంగం వేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
టార్గెట్ టీపీఎస్
ఎమ్మెల్యే వర్గీయులు టీపీఎస్ వినయ్‌కుమార్‌ను తరచూ టార్గెట్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఆరో రోడ్డులో తెలుగుదేశంపార్టీ ఫ్లెక్సీ తొలగించినప్పుడు కార్పొరేటర్లు సద్దల హేమలత, విజయశ్రీ, నాయకులు సద్దలశేఖర్, సరిపూటి శ్రీకాంత్ తదితరులు నగరపాలక సంస్థలో హంగామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment