టీడీపీలో ముసలం | Mayor to collect signatures to change | Sakshi
Sakshi News home page

టీడీపీలో ముసలం

Published Tue, May 24 2016 9:55 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Mayor to collect signatures to change

మేయర్‌ను మార్చేందుకు సంతకాల సేకరణ
అసమ్మతి వర్గానికి ఎమ్మెల్యేల అండ
అంతర్మథనంలో మేయర్ వర్గం

విజయవాడ: నగరపాలక సంస్థ టీడీపీలో ముసలం పుట్టింది. మేయర్ చైర్‌ను కదిలించేందుకు ఆ పార్టీ కార్పొరేటర్లే పన్నాగం పన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం ఇందులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పనిలో పనిగా డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్ పదవుల్ని మార్చేయాలంటూ  సోమవారం రాత్రి నుంచి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి మరీ తమకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. మేయర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 12 మంది సభ్యుల నుంచి సంతకాలు సేకరించినట్లు భోగట్టా. తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం భేటీ అయింది. ఏం చేసైనా అసమ్మతి వర్గం ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ప్రతివ్యూహం రూపొందిస్తోంది. మెజార్టీ సంతకాలు పూర్తిచేసి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ మంత్రి పి.నారాయణను కలవాలన్నది అసమ్మతి వర్గం నేతల ఆలోచనగా తెలుస్తోంది.


అసంతృప్తే కారణం...
మేయర్ కోనేరు శ్రీధర్ వైఖరిపై ఆ పార్టీలో మెజార్టీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది వారి వాదన. తమను డమ్మీలను చేసి ఆడిస్తున్నారని, కౌన్సిల్‌లో విలువ లేకుండా చేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు సైతం మేయర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో నగరంలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు సైతం మేయర్‌కు ఆహ్వానం పంపడం లేదనే వాదనలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు వద్ద మేయర్‌కు మంచి మార్కులే ఉండటంతో ఇప్పటివరకు సమయం కోసం అసమ్మతి వర్గం ఎదురు చూసింది. కార్పొరేటర్ల విజ్ఞానయాత్ర నేపథ్యంలో పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంది. టూర్‌కు మొత్తం 33 మంది కార్పొరేటర్లు వెళ్లగా, ఇందులో 23 మంది టీడీపీ సభ్యులే. అసమ్మతి వర్గం వీరితో టూర్‌లోనే రాయబేరాలు సాగించిందని భోగట్టా. మేయర్‌ను మార్చేయాలన్న ప్రతిపాదనకు ఈ నెల 16న బీజం పడింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపారు. సంతకాల సేకరణలోనూ ఆయనే కీలకభూమిక పోషిస్తున్నారని సమాచారం.

 

అంతర్మథనంలో మేయర్ వర్గం
తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం అంతర్మథనంలో పడింది. మేయర్ తనను సపోర్టు చేసే కార్పొరేటర్ల కోసం వెతుకులాట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు, కో ఆప్షన్ సభ్యుడు సిద్ధెం నాగేంద్రరెడ్డిలతో సోమవారం రాత్రి తన చాంబర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో ఆయనతో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. అత్యధిక శాతం మంది కార్పొరేటర్లు అసమ్మతి వర్గంతో జట్టు కడితే పరిస్థితి ఏమిటి, వాళ్లను తమవైపు ఎలా తిప్పుకోవాలనే చర్చల్లో మేయర్ వర్గం మునిగింది. అసమ్మతి వర్గం కంటే ముందే తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లే యోచనలో మేయర్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement