చక్రం తిప్పిన బీజేపీ.. రెండో స్థానంలో నిలిచినా చండీగఢ్‌ మేయర్‌ పీఠం కైవసం | BJP Bags Chandigarh Mayor Seat Sarabjit Kaur Is New Mayor | Sakshi
Sakshi News home page

Chandigarh Mayor 2022: చక్రం తిప్పిన బీజేపీ.. రెండో స్థానంలో నిలిచినా చండీగఢ్‌ మేయర్‌ పీఠం కైవసం

Published Sun, Jan 9 2022 8:02 AM | Last Updated on Sun, Jan 9 2022 1:42 PM

BJP Bags Chandigarh Mayor Seat Sarabjit Kaur Is New Mayor - Sakshi

మహిళా కౌన్సిలర్‌ సరబ్‌జిత్‌ కౌర్‌ ధిల్లాన్‌ మేయర్‌గా గెలుపు

చండీగఢ్‌: చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సీటును అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. 35 వార్డులున్న చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దిగినా అత్యధికంగా 14 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 12 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, శిరోమణి అకాలీదళ్‌ కేవలం ఒకే ఒక్క చోట గెలిచిన విషయం తెల్సిందే.

చదవండి: సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు న్యాయమూర్తులకు పాజిటీవ్‌

కాగా, మేయర్‌ స్థానం కోసం శనివారం జరిగిన ఓటింగ్‌ రసవత్తరంగా సాగింది. ఓటింగ్‌ సమయంలో ఒక శిరోమణి అకాలీదళ్‌ కౌన్సిలర్, ఏడుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో 35 సీట్లున్న నగర కార్పొరేషన్‌లో మేయర్‌ స్థానానికి జరిగిన ఓటింగ్‌లో సాధారణ మెజారిటీ 14కు పడిపోయింది. చండీగఢ్‌ ఎంపీ.. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎక్స్‌–అఫీషియో సభ్యుడి హోదాలో ఓటింగ్‌లో పాల్గొని బీజేపీకి మద్దతిచ్చారు. ఫలితాలు రాగానే ఒక కాంగ్రెస్‌ సభ్యుడు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆప్, బీజేపీ చెరో 14 మంది సభ్యులతో సమంగా నిల్చాయి.

అయితే, శనివారం మేయర్‌ ఎన్నికలో ఒక ఆప్‌ సభ్యుని ఓటు చెల్లదని తేల్చడంతో మేయర్‌ పీఠం బీజేపీ వశమైంది. మహిళా కౌన్సిలర్‌ సరబ్‌జిత్‌ కౌర్‌ ధిల్లాన్‌ మేయర్‌గా గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని ఆప్‌ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌ కౌన్సిలర్లు కావాలనే గైర్హాజరై బీజేపీకి పరోక్ష మద్దతిచ్చారని ఆప్‌ ఆరోపించింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement