నయీం బావను కాల్చేసిన ప్రాంతం పరిశీలన | police took accused where Nayeem's Brother In Law was brutally murdered | Sakshi
Sakshi News home page

నయీం బావను కాల్చేసిన ప్రాంతం పరిశీలన

Published Fri, Sep 30 2016 8:14 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

నయీం బావను కాల్చేసిన ప్రాంతం పరిశీలన - Sakshi

నయీం బావను కాల్చేసిన ప్రాంతం పరిశీలన

శంషాబాద్ రూరల్: ఎన్ కౌంటర్ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న గ్యాంగ్‌స్టర్ నయీం ఉదంతాల్లో అత్యంత పాశవికమైనదిగా భావిస్తోన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీం తన బావ(సోదరి భర్త)ను కిరాతకంగా చంపి, దహనం చేసిన కేసులో నయీంతోపాటు ఫర్హానా, సలీమాలు కూడా నిందితులు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న వీరిద్దరినీ శంషాబాద్ పోలీసులు శుక్రవారం హత్యజరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి పలు విధాలుగా ప్రశ్నించారు. శంషాబాద్ పోలీసుల కథనం ప్రకారం..

2013, ఫిబ్రవరి 2న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సాతంరాయి సమీపంలోగల పప్పు ఫాం హౌస్ లో నయీం.. తన సోదరి సలీమా భర్త, భువనగిరికి చెందిన విజయ్ కుమార్ అలియాస్ నదీమ్ ను దారుణంగా హతమార్చాడు. ఫాం హౌస్ లోని ఒక గదిలో నదీమ్ తలపై రాడ్డుతో మోది, ఫర్హానా సాయంతో నదీమ్ ను హాలులోకి తీసుకొచ్చి చున్నీని మెడకు బిగించి చంపారు. అనంతరం నదీమ్ మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించి పెద్దతూప్ర సమీపంలోని నిర్జన ప్రదేశంలో దహనం చేశారు.

నదీమ్ మృతదేహాన్ని తరలించిన వాహనంలో నయీంతో పాటు డ్రైవర్ ఫయీం, సమీప బంధువు ఫర్హానా, మరో మహిళ, ఇద్దరు బాలికలు ఉన్నారు. మహిళలు, బాలికలు వాహనంలోనే ఉండగా.. నయీం మృతదేహాన్ని కాల్చి వేశాడు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం ఈ హత్య వెలుగు చూడగా.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఫర్హానా, సలీమాను శంషాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం వీరిద్దరిని పెద్దతూప్ర వద్ద సంఘటనా స్థలానికి తీసుకెళ్లి పరిశీలించారు. సీఐ ఉమామహేశ్వర్‌రావు, ఎస్‌ఐ భాస్కర్ వారి నుంచి వాంగూల్మం నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement