జల్సాల కోసం చోరీలు
నిందితుడిని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు
శంషాబాద్: జల్సాల కోసం ఓ ఎలక్ట్రీషియన్ చోరీల బాటపట్టాడు. గతంలో జైలుకెళ్లొచ్చినా అతడి బుద్ధి మారలేదు. శుక్రవారం శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన షేక్ సమీర్ హుస్సేన్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ జాగీర్‌లో తన సోదరుడితో కలసి ఉంటున్నాడు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేయడంలో సమీర్ సిద్ధహస్తుడు.
రెండుమూడు నెలలుగా రాజేంద్రనగర్, నార్సింగి ఠాణాల పరిధిలో పదిచోట్ల ఇళ్ల తాళాలు విరగొట్టి బంగారు ఆభరణాలు, వెండి, ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీలు చోరీ చేశాడు, చోరీ సొత్తును బోధన్ పట్టణంతోపాటు ముంబైలో విక్రయించి జల్సాలు చేసేవాడు. ఇటీవల సమీర్ 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీ, రెండు డిజిటల్ కెమెరాలు చోరీ చేశాడు. 35 తులాల బంగారంతోపాటు మిగతా వస్తువులన్నింటిని పోలీసులు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
సొత్తు విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. బోధన్‌లో గతంలో యాభై తులాల మేరకు బంగారం చోరీ కేసులో సమీర్ జైలుకు వె ళ్లి వచ్చాడు. రెండురోజుల క్రితం వాహనాల తనిఖీల్లో సమీర్ తీరును అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండుకు తరలించారు.