ప్రజలకు చేరువగా పోలీస్‌ ఠాణాలు | Nizamabad Police Stations Become Citizen Friendly | Sakshi
Sakshi News home page

ప్రజలకు చేరువగా పోలీస్‌ ఠాణాలు

Published Wed, Sep 11 2019 12:08 PM | Last Updated on Wed, Sep 11 2019 12:08 PM

Nizamabad Police Stations Become Citizen Friendly - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఒకప్పుడు పోలీస్‌ స్టేషన్లు అంటే అల్లంత దూరం ఉండేవారు జనాలు. అయితే ఇప్పుడు తీరు మారింది. పోలీసులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్, 5ఎస్‌ విధానం అందులో భాగమే. ప్రధానంగా 5ఎస్‌ విధానం ద్వారా పోలీస్‌ స్టేషన్లను ఆదర్శంగా మారుస్తున్నారు. స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు పోలీసులు యాక్షన్‌ మార్చారు. ప్రజలతో పోలీసులు మర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదుదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారి ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వారికి కేసుల పూర్వాపరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. రిసెప్షన్‌ సెంటర్, రికార్డు రూం, కేసుల ఆన్‌లైన్, ఫిర్యాదుదారులకు సమాచారం, విచారణ గది, సిటిజన్‌ చార్ట్‌.. ఇలా ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నారు! వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

పోలీసుస్టేషన్‌లను ఆధునీకంగా తీర్చిదిద్దాలని, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మెరుగైన సేవలు అందించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే పోలీస్‌స్టేషన్లలో 5ఎస్‌ విధానంతో పాటు మరికొన్ని కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కాలంలో ఈ పద్ధతులు ఆయా పోలీస్‌స్టేషన్లలో అమలు చేసేందుకు సీపీ కార్తికేయ అధికారులకు సూచించారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 

స్టేషన్‌కు నూతన హంగులు.. 
జిల్లా కేంద్రంలోని 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్నతాధికారులు ఆదేశాలు పక్కా అమలవుతున్నాయి. సిటిజన్‌ ఫ్రెండ్లీ టాస్క్‌గా సీపీ కార్తికేయ వివరించారు. ఈ పోలీసు స్టేషన్‌లో ప్రత్యేకంగా ఫిర్యాదులు తీసుకునేందుకు రిసిప్షన్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఓ మహిళా కానిస్టేబుల్‌ అందుబాటులో ఉంటారు. ఫిర్యాదుల సేకరణ త్వరగా తీసుకోవడం, బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ సిటిజన్‌ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదుదారుడికి ఫోన్‌ చేసిన వారి కేసు వివరాలు, కేసు పురోగతి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. పోలీసుస్టేషన్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దారు.  

ఫిర్యాదుదారుడికి సౌకర్యం... 
ప్రత్యేక ఆన్‌లైన్‌ కేంద్రం, స్టేషన్‌కు వచ్చేవారికి సౌకర్యాలు, విచారణ గది, రిసెప్షన్‌ కౌంటర్, సిటిజన్‌ చార్ట్‌ను ఏర్పాటు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ప్రత్యేకంగా చెట్ల పెంపకం, పార్కింగ్‌ స్థలంతో పాటు చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రతి ఫిర్యాదుదారుడికి సౌకర్యాలు కల్పించారు. మంచినీటి సదుపాయంతోపాటు బాధలను సమస్యలను చెప్పుకునేవారికి ప్రత్యేక రిసెప్షన్‌ అందుబాటులో ఉంది. 5ఎస్‌ విధానంలో ఉండే అంశాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. డయల్‌ 100 కాల్స్‌ వస్తే 5 నిమిషాల్లో స్పందించి వారికి ఫీడ్‌ బ్యాక్‌ను అందించే సదుపాయం ఉంది. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు అందించనున్నారు. ప్రతి శనివారం కోర్టు డ్యూటీ ఆఫీసర్‌ ద్వారా మీటింగ్‌ పెట్టించి మిగితా సిబ్బంది వర్టికల్‌ విధానం ద్వారా పకడ్బందీగా అమలయ్యేలా చేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఎవరి పని వారికి విభజించారు. పోలీసుస్టేషన్‌లో జోన్‌లను విభజించి నోడల్‌ ఆఫీసర్, డివిజన్‌ అసిస్టెంట్‌ ప్రతి జోన్‌కు సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రతి నెల 5ఎస్‌ విధానంపై సమీక్ష నిర్వహించి జిల్లాలోనే 4వ టౌన్‌ మిగితా పోలీసుస్టేషన్‌కు ఆదర్శంగా నిలుస్తుందని సీపీ ప్రశంసిస్తున్నారు. మిగితా స్టేషన్ల సిబ్బందికి ఆదేశిస్తున్నారు.

మెరుగైన సేవలు అందిస్తాం.. 
స్టేషన్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఆధునీకరించి 5ఎస్‌ విధానం అమలు చేస్తున్నాం. ప్రతి ఫిర్యాదుదారుడికి తక్షణమే న్యాయం చేకూర్చడం, ఫిర్యాదు తీసుకోవడంలో స్పందన, ప్రత్యేక రిసిప్షన్, సౌకర్యాలు ఏర్పటు చేశాం. మరింత మెరుగైన సేవలు తీసుకువస్తాం. ప్రజలకు సేవలు కొనసాగిస్తాం.
 –లక్ష్మయ్య, 4వ టౌన్‌ ఎస్‌ఐ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement