Friendly policing
-
అసాంఘిక శక్తులను ఉపేక్షించొద్దు
సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మన విధానం. శాంతిభద్రతల పరిరక్షణే ఈ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించవద్దు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజా జీవితాన్ని తమ స్వార్థం కోసం దెబ్బతీసే శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే. ప్రభుత్వం, సమాజం మీద దాడిచేసి మనుగడ సాగించే శక్తులన్నీ అడవుల్లోనో అజ్ఞాతంలోనో కాకుండా ఇప్పుడు ప్రజా జీవితంలో ఉండటాన్ని మనం చూస్తున్నాం. ప్రజల మధ్యే ఉంటూ ప్రజల మీదే దాడిచేస్తున్నాయి. అటువంటి అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించవద్దు. అసాంఘిక శక్తులు అనే పదాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరం ఏర్పడింది’.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి పదాలకు అర్థం.. ఒక ముఠా, ఒక వర్గం పోలీసుల నుంచి, న్యాయస్థానాల నుంచి చట్టాన్ని లాక్కోవడం కాదని ఆయన తేల్చి చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 1959 అక్టోబరు 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆ రోజును అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా దేశం గత 64 ఏళ్లు గా జరుపుకుంటూ వారిని గుర్తు చేసుకుంటోంద న్నారు. రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు కుటుంబాలకు మనందరి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా, తోడుగా ఉంటుందని పునరుద్ఘాటిస్తూ గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా అమరులైన 188 పోలీసులకు శ్రద్ధాంజలి అర్పించారు. సీఎం ఏమన్నారంటే.. పోలీసు అమరవీరులకు నివాళిగా ప్రచురించిన ‘అమరులు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్ ఖాకీ డ్రెస్ అంటేనే త్యాగనిరతి.. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీసు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనిరతి. ఆ డ్రెస్ మీద కనిపించే మూడు సింహాలు మన దేశ సార్వ¿ౌమాధికారానికి చిహ్నం. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు.. అంతకుమించి. పోలీస్ అంటే ఒక బాధ్యత కూడా. ఈ ఉద్యోగం ఒక సవాల్. మరీ ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు విలువ ఉంటుంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.. కొత్త టెక్నాలజీవల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నేర పరిశోధనలో పోలీసులు అప్డేట్ కావాలి. సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా థెఫ్ట్ వరకు, డేటా థెఫ్ట్ నుంచి సైబర్ హెరాస్మెంట్ వరకు నేరాలను నిరోధించడానికి, వాటి మీద దర్యాప్తు చేసి దోషులను శిక్షించేందుకు పోలీసులు ఎంతగానో అప్డేట్ కావాల్సిన యుగంలో మనమంతా ఉన్నాం. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వాడకంవల్ల సైబర్ ప్రపంచంలో మరో చీకటి ప్రపంచం సృష్టించుకుని నేరాలు చేస్తున్న వాళ్లను ఎదుర్కొవాల్సిన బృహత్తర బాధ్యత పోలీసుల భుజస్కంధాల మీద ఉంది. కొత్త టెక్నాలజీని వాడుకుంటూ విజృంభించే అసాంఘిక శక్తుల సవాళ్లకు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మారుతున్న ఈ సమాజం విసురుతున్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ సిద్ధంకావాలి. నేర నిరోధం, నేర దర్యాప్తు ఈ రెండింటిలోనూ మన పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీ ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ డివిజన్లో 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణులు పనిచేస్తుండటం ప్రజలకు ఎంతో ధైర్యానిస్తోంది. అసాంఘిక శక్తులతో ప్రజాస్వామ్యానికి ముప్పు నిజానికి ఇప్పుడు అసాంఘిక శక్తుల పదాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరమేర్పడింది. నూజివీడులో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్‌ను చంపారు.. అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ వాళ్లను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించారు.. అలాగే, పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.. చివరకి ఒక పోలీసు సోదరుడి కన్ను పోయేలా శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. వారి అవినీతి, నేరాలు, వాటి ఆధారాలను బట్టి న్యాయస్థానాల్లో తీర్పులు వీరికి అనుకూలంగా రాకపోయేసరికి.. చివరకి ఆ న్యాయమూర్తుల మీద ట్రోలింగ్ చేస్తున్నారు. వారికి సంబంధించిన టీవీ ఛానెళ్లలో చర్చలు నిర్వహిస్తున్నారు. తమను ఎవరూ కూడా ఏం చేయలేరన్న అహంకారంతో ఇవన్నీ చేస్తుంటారు. ఇటువంటివన్నీ అసాంఘిక శక్తుల పనులే. ప్రజాస్వామ్యం, రూల్ ఆఫ్ లా మీద నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావివి. దుర్మార్గుల పని పట్టండి.. తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అలజడులు సృష్టించే ఇలాంటి దుర్మార్గులను ఉపేక్షించవద్దు. ఎలాంటి మొహమాటం లేకుండా చట్టానికి పనిపెట్టండి. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో అస్సలు రాజీపడొద్దు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలు, మరీ ముఖ్యంగా పిల్లలు, అణగారిన సామాజికవర్గాలకు భద్రత కల్పించే విషయంలో ఏమాత్రం రాజీపడొద్దు. పోలీసుల మీద దాడిచేసే దుష్టశక్తులకు గుణపాఠం నేర్పాలి. లేకపోతే సమాజంలో ఎవరికీ రక్షణ ఉండదు. దిశ యాప్‌తో అక్కచెల్లెమ్మలకు భద్రత రాష్ట్రంలో 16వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో నియమించాం. దేశంలో ఎక్కడాలేని విధంగా దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటుచేయడంతోపాటు ప్రతి జిల్లాలో దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. అక్కచెల్లెమ్మల భద్రత మీద ఇంతగా శ్రద్ధ పెట్టాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మన రాష్ట్రంలో పోలీసులు మహిళలకు భద్రత కల్పిస్తున్నారు. ఒక్క దిశ యాప్ రాష్ట్రంలో 1.25 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో రిజిస్టర్ అయింది. ఆపదలో ఉన్న దాదాపు 31,200 మంది అక్కచెల్లెమ్మలు ఈ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్ నొక్కడంవల్లో, ఫోన్ గట్టిగా షేక్ చేయడంవల్లో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రత కల్పించారు. ‘అమరులు’ పుస్తకావిష్కరణ ఇక పోలీసు అమరవీరులకు నివాళిగా ప్రచురించిన ‘అమరులు’ పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. గత ఏడాది కాలంలో దేశంలో అమరులైన 188 మంది పోలీసుల వివరాలతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అలాగే, ఇటీవల ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో గణేశ్ నిమజ్జనం రోజున అల్లరిమూకల దాడిలో గాయపడి మరణించిన కానిస్టేబుల్ జి. నరేందర్ భార్యకు సీఎం రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియాను అందించారు. రూ.30లక్షల నుంచి రూ.75లక్షలు బీమా రక్షణ.. గతంలో పోలీసులు ఎవరైనా చనిపోతే బీమా వచ్చేది కాదు. పోలీసులకు జీతాలిచ్చే కార్యక్రమం ఎస్బీఐ ద్వారా చేస్తున్నాం. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా యాజమాన్యాన్ని పిలిచి పోలీసుల బీమా సౌకర్యం గురించి చర్చించాం. ఆ చర్చలు పూర్తయ్యాయని చెప్పడానికి ఈ రోజు సంతోíÙస్తున్నాను. ప్రతి పోలీసు సోదరుడికి బీమా కింద రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలు బీమా కవరేజ్ ఇచ్చేందుకు ఎస్బీఐ ముందుకొచ్చింది. ఇవేకాక.. పోలీసులకు చేయగలిగిన ప్రతి మేలూ కచ్చితంగా చేస్తాం. పోలీసు సంక్షేమానికి పెద్దపీట.. మనందరి ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. పోలీసులకు ఇంకా మంచి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా వీక్లీఆఫ్ విధానాన్ని తీసుకొచ్చాం. పోలీసుల మీద ఒత్తిడి తగ్గించేందుకు అదనంగా పోలీసులను నియమించాల్సిన అవసరం ఉందని గుర్తించాం. గ్రామస్థాయిలో 16వేల మహిళా పోలీసులను నియమించాం. దాదాపు మరో 6,550 పోస్టులను భర్తీచేసేందుకు (6,100 కానిస్టేబుల్ పోస్టులు, 450 ఎస్సై పోస్టులు) వేగంగా చర్యలు చేపట్టాం. కొందరు కోర్టుల వరకు వెళ్లడంతో కాస్త జాప్యం జరుగుతోంది. కోర్టుల్లో త్వరగా ఒక పరిష్కారం వచ్చేలా చేసి పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా పూర్తిచేయాలని డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఐఆర్ బెటాలియన్లను తీసుకొచ్చాం. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన 201 మంది పోలీసుల కుటుంబాలను ఆదుకున్నాం. ఎస్ బీఐ వంటి సీఎస్ఆర్ ఫండ్స్ కూడా ఏకంచేసి ఒక్కో కుటుంబానికి రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించి తోడుగా నిలబడ్డాం. మనందరి ప్రభుత్వం రాకముందు వరకు హోంగార్డులకు నెలకు రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చేవారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి జీతం రూ.21,300కు పెంచాం. ప్రతి కానిస్టేబుల్, హోంగార్డుకు మంచి చేయా లన్న తపనతో అడుగులు వేస్తున్నాం. కానిస్టేబుళ్ల నియామకాలలో హోంగార్డులకు గతంలో ఉన్న రిజర్వేషన్లు 8 శాతం ఉంటే వాటిని 15 శాతానికి పెంచాం. ఏపీఎస్పీలో గతంలో 10శాతం రిజర్వేషన్లు ఉంటే.. మన ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను 25 శాతానికి పెంచింది. పోలీసుల త్యాగనిరతి నిరుపమానం: తానేటి వనిత సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవలు నిరుపమానమని హోంమంత్రి తానేటి వనిత కొనియాడారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పోలీసుల త్యాగనిరతి, ధైర్య సాహసాలు సమాజానికి సదా స్ఫూర్తిదాయకమన్నారు. పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేధింపులను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అందుకోసం 130 మందితో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటుచేసి మరో ఐదుగురితో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలించడంతోపాటు అక్రమ సారా తయారీకి అడ్డుకట్ట వేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్రెడ్డితోపాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
లేడీ సింగం: అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తా.. మహిళా రక్షణకు ప్రాధాన్యతనిస్తా.. కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చూస్తా.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతా.. ఇల్లీగల్ లిక్కర్..గుట్కా..గాంబ్లింగ్ తదితరాలపై ప్రత్యేక దృష్టిసారిస్తా.. ఇక డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదంటూ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాడే తన బాటను స్పష్టం చేశారు మలికా గర్గ్. తొమ్మిది నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆమె ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన ప్రారంభించారు. నిర్లక్ష్యం, అక్రమార్కులపై వేటు వేశారు. డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్ఐలు, పలువురు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని దూకుడు పెంచారు. తమ మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. కింది స్థాయి సిబ్బంది మొదలు డీఎస్పీ స్థాయి అధికారి వరకు ఎస్పీ దెబ్బకు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి కార్యకలాపాలను నిలిపివేయాల్సిన అనివార్య పరిస్థితులు పోలీస్ సిబ్బందికి, అధికారులకు ఏర్పడ్డాయి. జిల్లా సరిహద్దుల్లోనూ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు కొంతమేర తెరపడింది. కేసుల దర్యాప్తులో సైతం వేగం పెరిగింది. తప్పు చేస్తే వేటు తప్పదనే సంకేతాలు ఇస్తూనే సమర్ధవంతంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఎస్పీ మలికా గర్గ్. 2021 జూలై 15న ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. రెండు, మూడు నెలల పాటు జిల్లాపై అవగాహన పెంచుకున్నారు. హోంగార్డు మొదలుకొని డీఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారి వరకు విధుల్లో వారి పనితీరును పరిశీలించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టే వరకు జిల్లాలో పరిస్థితులు వేరేగా ఉండేవి. సలాములతో కాలం గడుపుతూ ఇష్టారీతిన విధులు నిర్వహిస్తూ వచ్చిన పోలీసు సిబ్బందికి, అధికారులకు తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇస్తూ వచ్చారు. దీంతో చాలా వరకు వారి పంథాను మార్చుకున్నారు. తమ వైఖరిలో మార్పురాని వారిపై ఆమె చర్యలకు ఉపక్రమించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తూనే, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. తప్పుచేస్తే అంతే.. విధుల్లో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ మలిక గర్గ్ కొన్ని సంఘటనల్లో నిరూపించారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కొన్ని సంఘటనల్లో కఠినమైన చర్యలు చేపట్టారు. ఇటీవల యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన రియల్టర్ హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేశారు. అదేవిధంగా యర్రగొండపాలెం సీఐని వీఆర్‌కు పిలిపించారు. మార్కాపురం డీఎస్పీకి చార్జ్ మెమో జారీ చేశారు. లింగసముద్రం ఎస్సై ఇసుక రవాణా విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో అతనిని సస్పెండ్ చేశారు. కొత్తపట్నం ఎస్సై విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేశారు. గ్రానైట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని బల్లికురవ ఏఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి హోంగార్డును విధుల నుంచి తప్పించారు. బేస్తవారిపేటలో ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు మద్యం తాగి న్యూసెన్స్ సృష్టించడంతో వారిరువురినీ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంపై వేటు విధుల్లో ఉంటూ ప్రజల పట్ల, ఫిర్యాదుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సహించేది లేదంటూ కొందరిపై చర్యలు చేపట్టారు. జరుగుమల్లి ఎస్సై ఇసుక అక్రమార్కుల విషయలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు రావటంతో ఆమెను వీఆర్‌కు పిలిపించారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరు పోలీస్ సిబ్బంది, అధికారులను కూడా దాదాపు 10 మందికి పైగా వీఆర్‌కు పిలిపించారు. జిల్లాలోని మారుమూల పోలీస్ స్టేషన్‌ను సైతం తనిఖీ చేసిన ఎస్పీ మలిక గర్గ్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, పోలీస్ అధికారులకు మెమోలు, చార్జ్ మెమోలు జారీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోయినా అలాంటి వారిపై చర్యలు తీసుకున్నారు. -
Telangana: కొంప ముంచుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్!
సాక్షి, సిటీబ్యూరో: ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం’ అనే సామెత పోలీసు విభాగానికి సరిగ్గా సరిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో అమలులో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నించి దెబ్బ తింటున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న పోలీసులపై దాడుల ఉదంతాలు దీన్ని వెక్కిరిస్తున్నాయి. బుధవారం సాక్షాత్తూ చిలకలగూడ ఠాణాలోనే ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడటం గమనార్హం.. బయటకు రానివి ఎన్నో.. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో కొన్ని అసాంఘిక శక్తులు, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులతో పాటు మరికొందరు రెచ్చిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఏకంగా యూనిఫాంలో ఉన్న వారిని దూషించడంతో పాటు వారి పైనే దాడులకు దిగుతున్నారు. గడిచిన పక్షం రోజుల్లో ఇలా.. రాజేంద్రనగర్ పరిధిలోని ఇమ్మద్‌నగర్ ప్రాంతంలో లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై స్థానికుడు సమీర్ సహా ముగ్గురు దాడికి యత్నించారు. యాకత్‌పురాకు చెందిన మహ్మద్ అనీస్ ఇక్బాల్ మొఘల్‌పురా ఇన్స్పెక్టర్ రవికుమార్‌కు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో బెదిరించాడు. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చిలకలగూడ: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న సమయంలో అదే నిందితుడు కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. గోపాలపురం ఏసీపీ, చిలకలగూడ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన మామిడి హరి కూరగాయల వ్యాపారి. ఇతనికి డేవిడ్‌తో పాటు మరో కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో హరి కుటుంబ సభ్యులను స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహించే శీతల శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ వారం రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మరోసారి వాగ్వాదం జరిగింది. క్షణికావేశానికి లోనైన హరి పెద్ద కుమారుడు డేవిడ్ తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో శ్రీకాంత్‌పై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం శ్రీకాంత్‌ను ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితులు హరితో పాటు ఆయన ఇద్దరు కుమారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ విచారణ చేస్తున్న సమయంలో డేవిడ్ తన వెంట ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కిరణ్‌కుమార్ మెడ, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన శ్రీకాంత్, కానిస్టేబుల్ కిరణ్ ఫిర్యాదు మేరకు మామిడి హరి, ఆయన ఇద్దరు కుమారులపై కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. చదవండి: Telangana: ఎంసెట్ వాయిదా! -
పోలీస్‌శాఖలో వినూత్న కార్యక్రమానికి డీజీపీ శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ సేఫ్టీ వింగ్, పెట్రో కార్స్, బ్లూకోల్ట్స్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ వంటి అనేక వైవిధ్య కార్యక్రమాలను అమలు చేస్తోన్న డీజీపీ మహేందర్‌రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పనితీరు మదింపును మొదలుపెట్టారు. ఏ రోజు ఎవరు ఏం పనిచేశారు? దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేశారు? అందుకోసం ఎలాంటి పద్ధతులు అవలంబించారు? తదితర విషయాలన్నీ ఇకపై డీజీపీ కార్యాలయంలో నమోదవుతాయి. ఆ వివరాలన్నీ పరిశీలించి ప్రతి ఒక్కరికీ పాయింట్లు ఇస్తారు. అంటే పోలీసు ఉద్యోగి పనితీరుకు ఈ పాయింట్లే ప్రామాణికంగా నిలుస్తాయన్నమాట. పదోన్నతులు, పురస్కారాలు, అలాగే బదిలీలు, పనిష్మెంట్లకు ఈ పాయింట్లే ఆధారం కానున్నాయి. సిబ్బందిలో జవాబుదారీతనాన్ని, పోటీ తత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా, పదోన్నతులు, బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించే దిశగా డీజీపీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్సేఫ్టీ వింగ్, వర్టికల్స్ (నిర్దిష్టంగా పని విభజన)ను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్న సమయంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. వర్టికల్స్‌లో గణాంకాలు గతంలో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో నేరం జరిగితే దాని దర్యాప్తు నుంచి శిక్ష పడేంత వరకూ అన్నిటికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లే (ఎస్హెచ్ఓ) బాధ్యత వహించాల్సి వచ్చేది. కిందిస్థాయి సిబ్బంది సరైన సహకారం అందించకున్నా.. దాని ఫలితాలు, పర్యవసానాలు ఎస్హెచ్ఓనే అనుభవించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల కిందట వర్టికల్స్ అమల్లోకి తెచ్చారు. అంటే రిసెప్షన్ మొదలుకుని వారెంట్లు, సమన్లు, దర్యాప్తు, ఎస్హెచ్ఓ, కమ్యూనిటీ పోలీసింగ్, డయల్ 100, ట్రాఫిక్.. ఇలా ప్రతి ఒక్కరికి, ప్రతి విభాగానికి నిర్దిష్ట బాధ్యతలు (పని), నిర్దిష్ట సిబ్బందిని కేటాయించారు. అంటే ఎవరి పనికి, ఎవరి విభాగానికి వారే బాధ్యులన్నమాట. ఈ విధంగా ఎస్హెచ్ఓలకు ఊరట లభించింది. ప్రస్తుతం ఆయా వర్టికల్స్లోనే సిబ్బంది రోజువారీ పనికి సంబంధించిన గణాంకాలు నమోదవుతుంటాయి. ఈ గణాంకాలను డీజీపీ కార్యాలయం నిరంతరం సమీక్షిస్తూ ఉంటుంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు వచ్చిన ఫిర్యాదులు, చేసిన పని, దాని పరిష్కారం, ఎంత సమయంలో పూర్తి చేశారు.. తదితర విషయాలపై నిరంతర సమీక్ష ఉంటుంది. ప్రతి పని నమోదవుతుంది. దాని ఆధారంగా పాయింట్లు నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించారు. ప్రతిరోజూ సిబ్బంది వీటిని ఠాణాలో తనిఖీ చేసుకోవచ్చు. మిగతా ఠాణాల్లోని సిబ్బంది సాధించిన పాయింట్లు, తమ పాయింట్లు చూసుకుని తాము ఏ స్థానంలో ఉన్నామో తెలుసుకోవచ్చు. ఇందులో చివరి స్థానమైన రెడ్‌జోన్‌లో ఉన్న వారిని అప్రమత్తం చేయడం, వారందరినీ ఆరెంజ్ జోన్‌కు తీసుకురావడం, ఆరెంజ్‌లో ఉన్న వారిని గ్రీన్ జోన్‌కు వచ్చేలా చేసేందుకు ఎస్హెచ్ఓ, జిల్లా అధికారులు కృషి చేస్తారు. హెచ్ఆర్ఎంఎస్తో అనుసంధానం ఈ వివరాలను త్వరలో పోలీసు విభాగంలో ప్రారంభించనున్న హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్)కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ప్రతి సిబ్బంది తన పనిని మదింపు చేసుకుని, తప్పులు సరిదిద్దుకుని ముందుకుసాగే అవకాశం కలుగుతుంది. -
‘శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు’
సాక్షి, అమరావతి : పోలీస్‌శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకెళ్తున్నామని, పోలీస్‌శాఖలో తొలిసారిగా వీక్లీఆఫ్ కల్పించామని తెలిపారు. స్పందన కార్యక్రమంలో వినతులను గడువులోగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. 95శాతం సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించామన్నారు.(రాష్ట్రమంతా భూముల రీసర్వే) స్పందన పోర్టల్ ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గిందని, 4లక్షల మంది దిశ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారని సవాంగ్ అన్నారు. కరోనా సమయంలో డయల్ 100, 112 ఎంతో ఉపయోగపడ్డాయని, టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నామన్నారు. విజయవాడ పటమట గ్యాంగ్ వార్ ఘటన దురదృష్టకరమని, వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.(కరోనా టెస్టుల్లో మరో రికార్డు సాధించిన ఏపీ) -
ప్రజలకు చేరువగా పోలీస్ ఠాణాలు
సాక్షి, నిజామాబాద్: ఒకప్పుడు పోలీస్ స్టేషన్లు అంటే అల్లంత దూరం ఉండేవారు జనాలు. అయితే ఇప్పుడు తీరు మారింది. పోలీసులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్, 5ఎస్ విధానం అందులో భాగమే. ప్రధానంగా 5ఎస్ విధానం ద్వారా పోలీస్ స్టేషన్లను ఆదర్శంగా మారుస్తున్నారు. స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు పోలీసులు యాక్షన్ మార్చారు. ప్రజలతో పోలీసులు మర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదుదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వారికి కేసుల పూర్వాపరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. రిసెప్షన్ సెంటర్, రికార్డు రూం, కేసుల ఆన్లైన్, ఫిర్యాదుదారులకు సమాచారం, విచారణ గది, సిటిజన్ చార్ట్.. ఇలా ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నారు! వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. పోలీసుస్టేషన్లను ఆధునీకంగా తీర్చిదిద్దాలని, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మెరుగైన సేవలు అందించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే పోలీస్స్టేషన్లలో 5ఎస్ విధానంతో పాటు మరికొన్ని కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కాలంలో ఈ పద్ధతులు ఆయా పోలీస్స్టేషన్లలో అమలు చేసేందుకు సీపీ కార్తికేయ అధికారులకు సూచించారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. స్టేషన్‌కు నూతన హంగులు.. జిల్లా కేంద్రంలోని 4వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్నతాధికారులు ఆదేశాలు పక్కా అమలవుతున్నాయి. సిటిజన్ ఫ్రెండ్లీ టాస్క్‌గా సీపీ కార్తికేయ వివరించారు. ఈ పోలీసు స్టేషన్లో ప్రత్యేకంగా ఫిర్యాదులు తీసుకునేందుకు రిసిప్షన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఓ మహిళా కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారు. ఫిర్యాదుల సేకరణ త్వరగా తీసుకోవడం, బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ సిటిజన్ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసిన వారి కేసు వివరాలు, కేసు పురోగతి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. పోలీసుస్టేషన్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దారు. ఫిర్యాదుదారుడికి సౌకర్యం... ప్రత్యేక ఆన్లైన్ కేంద్రం, స్టేషన్‌కు వచ్చేవారికి సౌకర్యాలు, విచారణ గది, రిసెప్షన్ కౌంటర్, సిటిజన్ చార్ట్‌ను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా చెట్ల పెంపకం, పార్కింగ్ స్థలంతో పాటు చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రతి ఫిర్యాదుదారుడికి సౌకర్యాలు కల్పించారు. మంచినీటి సదుపాయంతోపాటు బాధలను సమస్యలను చెప్పుకునేవారికి ప్రత్యేక రిసెప్షన్ అందుబాటులో ఉంది. 5ఎస్ విధానంలో ఉండే అంశాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. డయల్ 100 కాల్స్ వస్తే 5 నిమిషాల్లో స్పందించి వారికి ఫీడ్ బ్యాక్‌ను అందించే సదుపాయం ఉంది. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయడం, ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు అందించనున్నారు. ప్రతి శనివారం కోర్టు డ్యూటీ ఆఫీసర్ ద్వారా మీటింగ్ పెట్టించి మిగితా సిబ్బంది వర్టికల్ విధానం ద్వారా పకడ్బందీగా అమలయ్యేలా చేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఎవరి పని వారికి విభజించారు. పోలీసుస్టేషన్లో జోన్లను విభజించి నోడల్ ఆఫీసర్, డివిజన్ అసిస్టెంట్ ప్రతి జోన్‌కు సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రతి నెల 5ఎస్ విధానంపై సమీక్ష నిర్వహించి జిల్లాలోనే 4వ టౌన్ మిగితా పోలీసుస్టేషన్‌కు ఆదర్శంగా నిలుస్తుందని సీపీ ప్రశంసిస్తున్నారు. మిగితా స్టేషన్ల సిబ్బందికి ఆదేశిస్తున్నారు. మెరుగైన సేవలు అందిస్తాం.. స్టేషన్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఆధునీకరించి 5ఎస్ విధానం అమలు చేస్తున్నాం. ప్రతి ఫిర్యాదుదారుడికి తక్షణమే న్యాయం చేకూర్చడం, ఫిర్యాదు తీసుకోవడంలో స్పందన, ప్రత్యేక రిసిప్షన్, సౌకర్యాలు ఏర్పటు చేశాం. మరింత మెరుగైన సేవలు తీసుకువస్తాం. ప్రజలకు సేవలు కొనసాగిస్తాం. –లక్ష్మయ్య, 4వ టౌన్ ఎస్ఐ -
లా అండ్ లాలన
పోలీసు శాఖ అంటేనే మానవత్వం లేని శాఖగా అభివర్ణిస్తారు చాలా మంది. కానీ ఖాకీ డ్రెస్ వెనుక కాఠిన్యమే కాదు.. మానవత్వం, ప్రేమ కూడా ఉంటాయని నిరూపించారు సీఐ మాధవి.అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సీఐగా విధులు నిర్వహిస్తున్న వి. మాధవి మూడేళ్లక్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ సీఐగా çపని చేసేవారు. ఆ సమయంలో కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన భార్యాభర్తలు అనారోగ్యంతో మరణించగా వారి పిల్లలు అనాథలయ్యారని పత్రికల్లో చదివి అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్యతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఆ చిన్నారులను చూసి చలించిపోయిన మాధవి వారికి దాతల సాయంతో ఆర్థికంగా ఆసరా ఇప్పించారు. అంతేకాదు, పిల్లల్లో ఒకరైన భవానిని దత్తత తీసుకుని చదివించారు. భవాని టెన్త్‌లో 9.7 గ్రేడ్‌ను సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ, కలెక్టర్ల ప్రశంసలు అందుకుంది. భవానికి చదువుపై ఉన్న శ్రద్ధను గమనించిన మాధవి ఆమెను తన పిల్లలు చదివే కాలేజీలోనే చేర్పించి, ఆలనాపాలనా చూడడమే కాకుండా ఒక తల్లిగా మంచిచెడులు చెప్తూ ఇంటర్లో మంచి మార్కులు సాధించాలని ఆ దత్త పుత్రికకు స్ఫూర్తిని ఇచ్చారు. భవాని కష్టపడి చదివి ఇంటర్లో 969 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. తన ‘పోలీస్ అమ్మ’ కోరిక మేరకు సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని చెప్తోంది భవాని. మాటే మంత్రం స్టేషన్‌కి వచ్చే బాధితులతో ఒక పోలీస్‌గా కాకుండా ఒక ఆత్మీయురాలిగా మాట్లాడతారు మాధవి. కుటుంబ కలహాలతో తన దగ్గరకి వచ్చినవారికి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి ఉపద్రవానికి దారి తీస్తాయో చెబుతూ చక్కటి కౌన్సెలింగ్ ఇస్తారు. ఆమె మాట మంత్రంగా పని చేసి ఆ జంట కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి ప్రేమికురాలు ఆమె ఏ స్టేషన్లో విధులు నిర్వహించినా అక్కడ పచ్చదనం కనిపించేలా చూస్తుంది. మానకొండూర్ పీఎస్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పోలీస్‌స్టేష¯Œ పరిసరాలు ఉద్యానవనాన్ని తలపించేలా గార్డెనింగ్ చేయించింది. అందుకే జిల్లాలోనే అంతటి పచ్చదనం ఉన్న పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంత మంచి మనసున్న పోలీస్ మాధవమ్మ జీవితం కూడా పచ్చగా ఉండాలని కోరుకుందాం.– స్వర్ణ మొలుగూరి, సాక్షి, హైదరాబాద్ -
ఫ్రెండ్లీ పోలీస్..ఫ్రెండ్లీ ప్రభుత్వం
-
పోలీస్ నంబర్1
ఇలాంటివి ఇక చాలు విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ మహిళల్ని వేధించింది. అప్పుడు ఏం జరిగింది? ఎన్ని కేసులు పెట్టారు? ఎందరు అరెస్టు అయ్యారు? బిగ్ జీరో. అప్పటి సీఎం ఇంటి పక్కనుంచే ఇసుక దోపిడీ సాగింది. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఓ మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుత్తు పట్టుకుని ఈడ్చేశారు. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేశారు. ఎమ్మెల్యేలే క్లబ్బులు నడిపారు. జూదం నిర్వహించారు. రాజధానిలో భూమి ఇవ్వని వారిని వేధించారు. మనం ఏం చేయగలిగాం? స్మైల్ ప్లీజ్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదుదారులు వచ్చారంటే వారెంతో బాధతో వచ్చారని గుర్తించాలి. రిసెప్షన్ ఏర్పాటు చేయండి. వారిని కూర్చోనివ్వండి. ఓ పోలీసు వారితో నవ్వుతూ మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకుని కేసు ఫైల్ చేయాలి. అప్పుడే సకాలంలో పారదర్శక సేవలు అందించడం సాధ్యం. మీ పని మీరు చేయండి అవినీతి, అక్రమాలు, దోపిడీలను అరికట్టడానికి కఠినంగా ఉండండి. ఎవరు వద్దని చెప్పినా పట్టించుకోవద్దు. నేను మీకు అడ్డురాను. మిగిలిన అంశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను విశ్వాసంలోకి తీసుకోండి. మనం సత్వరం, సమర్థంగా మంచి పాలన అందించాలి. మీపై నాకు నమ్మకం ఉంది. నేను గర్వపడేలా బాగా పని చేయండి. ఎదిగే కొద్దీ ఒదగాలి నాతో సహా మనమంతా ప్రజా సేవకులం. మానవత్వం, సద్గుణమన్నది మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎదిగే కొద్దీ ఒదగాలి. అణగారిన వర్గాల పట్ల ఆదరణతో ఉండండి. సాక్షి, అమరావతి: ‘ఫ్రెండ్లీ పోలీసింగ్, పారదర్శకతతో మంచి పరిపాలన అందించాలి. ప్రజల భద్రత మన బాధ్యత. అవినీతి, అక్రమాలు, దోపిడీని అరికట్టాలి. అందుకోసం వ్యవస్థను మారుద్దాం. ఈ విషయంలో నేను మీకు పూర్తి అండగా ఉంటాను’అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు, రెవిన్యూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసులు వివక్షతో వ్యవహరిస్తారని అణగారిన వర్గాల్లో ఉన్న అభిప్రాయాన్ని తొలగించాలన్నారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి విస్పష్టంగా వివరించారు. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించి ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అక్రమాలు యథేచ్ఛగా సాగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితిని సమూలంగా మార్చివేసి ప్రజలకు పూర్తి భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలను అడ్డుకోవాలని, మహిళలకు భద్రత కల్పించాలని, బెల్ట్ దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గత ఐదేళ్లు యథేచ్ఛగా వేధింపులు గత ఐదేళ్లలో మన కళ్ల ముందే యథేచ్ఛగా అవినీతి, అక్రమాలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నివాసం ఇక్కడ మన పక్కనే ఉంది. మనం కూర్చున్న ఈ భవనం అక్రమ నిర్మాణం. అన్ని చట్టాలను ఉల్లంఘించి మరీ నిర్మించారు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ నీటిపారుదల శాఖ లేఖ రాసింది కూడా. నదీ పరిరక్షణ చట్టం, లోకాయుక్త తీర్పు, గ్రీన్ ట్రిబ్యునల్, మాస్టర్ ప్లాన్, భవన నిర్మాణ నిబంధనలు.. అలా అన్నింటినీ ఉల్లంఘించారు. ఇక్కడే మన కళ్ల ఎదుటనే మాజీ సీఎంగారే అక్రమ భవనంలో ఉన్నారు. అది సమర్థనీయమా? అప్పటి సీఎం అక్రమ నిర్మాణంలో ఉన్నారు. ఆ పక్కనే ప్రభుత్వం మరో అక్రమ భవనాన్ని నిర్మించింది. దాంతో ఏం జరిగింది? ఈ కరకట్ట రోడ్డు అంతటా అక్రమ భవనాలు నిర్మించారు. ఎవరూ ఆపలేదు. ఇది మంచి పరిపాలనా? మీరే ఆలోచించండి. ఆ పక్కనే ఇసుక దోపిడీ సాగింది. అది అక్రమం అని అందరికీ తెలుసు. కానీ సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఓ మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుత్తు పట్టుకుని ఈడ్చేశారు. మనం ఏమీ చేయలేకపోయాం. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేశారు. న్యాయస్థానం వరకు వెళ్లింది. మనం ఏం చేశాం? ఎమ్మెల్యేలు థియేటర్, కంపెనీల యజమానుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలే క్లబ్బులు నడిపారు. జూదం నిర్వహించారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూమి ఇవ్వని వారిని వేధించారు. అక్రమ కేసులు పెట్టారు. దాంతో 11మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఆరుగురు దళితులే. ఏం చేయగలిగాం? ఉండవల్లిలో ప్రజావేదికలో పోలీస్ శాఖ ఉన్నత అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. కార్యక్రమంలో మంత్రులు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు నవ్వుతూ మాట్లాడండి.. దేశంలో మనమే తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చాం. గతంలో బీహార్‌లో ప్రయత్నించారు కానీ కుదరలేదు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు కచ్చితంగా అమలయ్యేలా చూడండి. అందుకోసం మరో 25 శాతం సిబ్బంది అవసరమైతే నియమిస్తాం. వీక్లీ ఆఫ్ తీసుకుని వారానికి ఒక రోజు కుటుంబంతో గడిపితే వారు మిగిలిన ఆరు రోజులు మరింత ఉత్సాహంగా పని చేస్తారు. ప్రజలకు మేలు చేయాలంటే ఫ్రెండ్లీ పోలీసింగ్, పారదర్శక పాలన అందించాలి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా నవ్వుతూ పలకరించండి. ఇక్కడకు ఎందుకు వచ్చామా అని అవతలి వాళ్లు అనుకోకూడదు. వారి స్నేహితులుగా ఉన్న మనం పారదర్శకంగా ఉండాలి. ప్రజల సంతృప్తే కొలబద్ద పోలీసు సేవల పట్ల ప్రజల సంతృప్త స్థాయి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు ఎలా పని చేస్తున్నారో థర్డ్ పార్టీ ద్వారా విచారించి తెలుసుకోండి. ఉన్నత స్థాయిలో మనం అవినీతికి దూరంగా ఉండాలి. దాంతో 50 శాతం అవినీతి తగ్గిపోతుంది. మిగిలిన 50 శాతం అవినీతిని ఎలా తగ్గించాలన్నది మనం నిర్ణయించాలి. ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి. అధికారుల నిబద్ధత, వ్యవహార శైలి, పని తీరు గురించి విచారించండి. తదనుగుణంగా శాస్త్రీయంగా తగిన చర్యలు తీసుకోండి. సైబర్ నేరాలను నిరోధించాల్సిందే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరాలను తగిన రీతిలో విచారించి పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి మన పోలీసు వ్యవస్థకు తగిన మౌలిక వసతులు లేవు. దీనిపై మనం దృష్టి సారించాలి. మన పోలీసులకు తగిన శిక్షణ లేదు. కింది స్థాయి అధికారులు, సిబ్బందికి కూడా తగిన శిక్షణ ఇవ్వాలి. సైబర్ నేరాలు, మహిళల వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో అయినా కట్టడి చేయాల్సిందే. మహిళలకు రక్షణ కల్పించలేకపోతే అది మన వైఫల్యమే. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఎలా చేస్తున్నాయో చూడండి. సైబర్ నేరాలు, మహిళల వేధింపులు, ఈవ్ టీజింగ్‌లను పూర్తిగా నిరోధించాల్సిందే. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం.ఆ వ్యవస్థను గౌరవించాలి. అమెరికాలో పోలీసు ఉన్నతాధికారులను కూడా ప్రజలు ఎన్నుకుంటారు. ఎందుకో తెలుసా? ప్రజల పట్ల మానవీయ కోణం, బాధితుల పట్ల సానుభూతితో ఉండాలని. మన వద్ద కూడా పోలీసు అధికారులు అదే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలి. చాలాసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎందుకు పట్టించుకోవాలి అనే ఘర్షణ వైఖరి తలెత్తుతుండటం మనం చూస్తునే ఉన్నాం. ప్రత్యేకించి పోలీసు శాఖలో. మనం గౌరవించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతుంది. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేను ఎన్నుకుంటారు. వారిని మనం గౌరవించకపోతే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. మనం కలసి మెలసి ప్రభుత్వాన్ని నడపాలి. అలా అని అవినీతి, అక్రమాలు, దోపిడీలను సమర్థించమని నేను చెప్పడం లేదు. ఎవరు చెప్పినా సరే అవినీతి, అక్రమం, దోపిడీలకు నో చెప్పండి. మిగిలిన అన్ని విషయాల్లో మనం కలసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలను విశ్వాసంలోకి తీసుకోండి. ఏ ఎమ్మెల్యే కూడా తనకు చెడ్డపేరు రావాలని కోరుకోరు. మీరు చేయాల్సిందల్లా వారిని చిరునవ్వుతో పలకరించి విషయం చెప్పి ఒప్పించండి. ఇది చేస్తే చెడ్డపేరు వస్తుంది.. ఇది చేస్తే మంచిపేరు వస్తుందని వివరించండి. చెడ్డపేరు వస్తుందంటే ఎందుకు చేయమంటారు? కానీ వారి ఫోన్లు రిసీవ్ చేసుకోకపోతే సమస్య వస్తుంది. ఇగో పక్కన పెట్టండి. ఇది అందరికీ వర్తిస్తుంది. అధికారులు, రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. సమావేశానికి హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు జిల్లాల్లో ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలి. గ్రామాల్లో రాత్రి బస చేయాలి. అదీ అణగారిన వర్గాలు ఉన్న కాలనీల్లో బస చేయండి. పోలీసుల పనితీరు గురించి వాకబు చేయండి. దాంతో వ్యవస్థలో మార్పు వస్తుంది. విశ్వసనీయత, పారదర్శకత, సత్వరం ప్రజల సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ భవనం నుంచే మొదలు పెడతాం. ఇక్కడ మనం మొదలు పెట్టి ఈ రోడ్డంతా ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగిద్దాం. జిల్లాల్లో కూడా ఇదే విధానాన్ని పాటించాలి. అప్పుడే మనం మంచి పరిపాలన అందించగలం. నంబర్ వన్ పోలీసింగ్ గురించి మాట్లాడగలం. ఇక్కడ నుంచే వ్యవస్థను మారుద్దాం మనం అధికారంలో ఉన్నామంటే మనకు బాధ్యతలు ఉన్నాయని అర్థం. మనం ప్రమాణాలను పాటించి అందరికీ ఆదర్శంగా నిలవాలి. అందుకే మీకు చెబుతున్నా.. అవినీతికి, దోపిడీకీ, అక్రమాలకు నో చెప్పండి. వ్యవస్థను ప్రక్షాళన చేయండి. మంచి ప్రమాణాలు నెలకొల్పండి. మీకు ఇది చూపించడానికే ఇక్కడ సమావేశం పెట్టాను. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇక్కడి నుంచే మొదలు పెడదాం. వ్యవస్థను మారుద్దాం. గ్రామాల్లో మద్యం బెల్ట్ దుకాణాలు ఉండటానికి వీల్లేదు. అసలు బెల్ట్ దుకాణం అనే పదమే అక్రమం. పాదయాత్రలో ఎన్నో గ్రామాల్లో ఎన్నో బెల్ట్ దుకాణాలు, క్లబ్బులు, జూదంతో ప్రజలు పడుతున్న బాధలు చూశాను. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటన్నింటినీ తొలగించాల్సిందే. 3 అంశాల ప్రాతిపదికగా అధికారుల ఎంపిక నా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే నేను కలెక్టర్లు, ఎస్పీల నియామకాలు పూర్తి చేశాను. నిజాయతీ, సమర్థత, టీడీపీకి అనుకూలంగా లేకపోవడం అనే మూడు ప్రమాణాల ప్రాతిపదికన మిమ్మల్ని ఎంపిక చేశాను. లేకపోతే వ్యవస్థ మరింతగా దిగజారుతుంది. అధికారులు తటస్థంగా ఉండాలన్నదే నా విధానం. మీపై పూర్తి గౌరవంతో అడుగుతున్నాను. మంచి పాలన అందించండి. నేను జోక్యం చేసుకోను. కాల్‌మనీలో ఎవరినీ వదలొద్దు విజయవాడలో టీడీపీ హయాంలో వెలుగు చూసిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై గట్టి చర్యలు తీసుకోకపోవడం గురించి సీఎం పోలీసు అధికారుల సదస్సులో ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం అప్పు తీసుకున్న వారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ విషయంలో పోలీసులు సీరియస్‌గానే ఉండాలని ఆదేశించారు. ఈ ఘటనలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మందిని అరెస్ట్ చేశారు? అంటూ ఆరా తీశారు. ‘కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఏ పార్టీవారున్నా విడిచి పెట్టొద్దు. ఈ రాకెట్లో వైఎస్సార్సీపీ వాళ్లు ఉన్నా సరే ఉపేక్షించొద్దు. ఈ సెక్స్ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించండి’ అంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక ఘటనలను ప్రస్తావించారు. ఇలాగైతే మీరు నంబర్ వన్ పోలీస్ ఎలా అవుతారని ప్రశ్నించారు. గత సీఎం చంద్రబాబు నివాసానికి పక్కనే అక్రమంగా ఇసుక మాఫియా సాగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై ఓ ప్రజాప్రతినిధి జుట్టు పట్టుకుని దాడి చేసి కొట్టినా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మన కళ్ల ఎదుటే జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరైన విధానమేనా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, భూ సమీకరణకు పొలాలు ఇవ్వని రైతులపై అక్రమ కేసులు పెట్టారని సీఎం గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగా దందాలకు పాల్పడ్డారని, గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్బులకు ఎమ్మెల్యేలు సహకరించారన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకుంటే నంబర్‌వన్ పోలీస్ కాలేరన్నారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్
బంజారాహిల్స్: సమయం ఆదివారం మధ్యాహ్నం. మండుటెండ. ఖైరతాబాద్ చౌరస్తాలో ఓ ఆటో ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై ఆగిపోయిన ఆటోను పక్కకు తొలగించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. ఆటో డ్రైవర్ ముందు టైరును పైకి ఎత్తి పట్టుకోగా ట్రాఫిక్ పోలీసులు ఆటోను ముందుకు నెట్టారు. కష్టపడి రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. -
సెలవు కోసం సలాం చెయ్యక్కర్లే!
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదం తో పోలీసు సిబ్బంది పనితీరులో నిత్యం పార దర్శకతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం వారికి ఉన్న ‘హక్కుల్ని’ వినియోగించుకోవడంలోనూ ఇదే విధానం అవలంబించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సర్వీస్ రికార్డుల్ని ఆన్లైన్ చేస్తోంది. దీంతోపాటు ‘ఈ–లీవ్’ విధానాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం సిబ్బంది సెలవు కోసం ‘టీఎస్ కాప్’యాప్ ద్వారానే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. అధికారులు సైతం ఆన్లైన్లోనే మంజూరు, తిరస్కరణ చేయాల్సి ఉంటుంది. సెలవు ఇవ్వని పక్షంలో అందుకు కారణాన్నీ స్పష్టం చేయాలి. పోలీసు విభాగంలో కింది స్థాయి సిబ్బందికి పైకి కనిపించని ఇబ్బందులు ఉంటున్నాయి. వీటిలో సెలవు పొందడం కూడా ఒకటి. ఎంతటి అత్యవసరమైనా ఉన్నతాధికారి దయతలిస్తేనే సెలవు లభించే పరిస్థితులున్నాయి. సెలవు మంజూరీలో కొందరు అధికారులు సిబ్బందిని వేధిస్తు న్నారనే ఆరోపణలున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ‘ఈ–లీవ్’ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పోలీసులకూ సాధారణ సెలవుల నుంచి ఆర్జిత సెలవుల వరకు అన్ని ఉంటాయి. అయితే అత్యవసర సేవలు అందించే విభాగం కావడంతో ఎప్పుడంటే అప్పుడు సెలవు దొరకదు. రాష్ట్రంలోని పరిస్థితులు, బందోబస్తు నిర్వహించాల్సిన సందర్భాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని సెలవు పొందాల్సి ఉంటుంది. సవాలక్ష అనుమతులు తప్పనిసరి... ప్రస్తుత నిబంధనల ప్రకారం పోలీసు విభాగంలో కిందిస్థాయి సిబ్బంది సెలవు పొందా లంటే సవాలక్ష అనుమతులు ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి సెలవు కావాల్సి వస్తే... ఆయన లిఖితపూర్వకంగా సంబంధిత జోనల్ డీసీపీకి దరఖాస్తు చేసుకోవాలి. సదరు డీసీపీ... ఆ ఇన్స్పెక్టర్ పని చేసే ఠాణా ఏ డివిజన్లోకొస్తే ఆ ఏసీపీ అభిప్రాయం తీసుకుంటారు. అలాగే.. కానిస్టేబుల్‌కు సెలవు కావాలంటే ఇన్స్పెక్టర్కు, ఎస్సైకి సెలవు కావాలంటే ఏసీపీకి దరఖాస్తు చేసుకుంటారు. అక్కడా తతంగం పూర్తయిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రజాప్యం జరిగి సెలవు మంజూరైనా ప్రయోజనం ఉండదు. దీంతో అత్యవసరమైతే అనుమతి లభించ కుండానే సెలవుపై వెళ్లిన వారు శాఖాపరమైన చర్యలకు గురికావడం జరుగుతోంది. దీని ఆసరాగా కొందరు అధికారులు సిబ్బందిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి అంశాలకు ఆస్కారం లేకుండా చేయడానికే రాష్ట్ర పోలీసు విభాగం ‘ఈ–లీవ్’పేరుతో ప్రత్యేక విధానం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. నిర్ణీత కాలంలో నిర్ణయం... సిబ్బంది సెలవు కోరుతూ దరఖాస్తు కోసం అధికారిక, అంతర్గతమైన ‘టీఎస్ కాప్’యాప్‌లోని ‘పోలీస్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టం’లో దరఖాస్తు చేసుకుంటారు. దీనిద్వారా సెలవు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ సమాచారం తక్షణం సంక్షిప్త సందేశం రూపంలో దాన్ని మంజూరు చేయాల్సిన, పర్యవేక్షించాల్సిన అధికారులకు చేరుతుంది. ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికీ కాలపరిమితి విధించారు. ప్రస్తుతానికి గరిష్టంగా 72 గంటల్లో నిర్ణయం తీసుకునేలా టార్గెట్ పెట్టాలని యోచిస్తున్నారు. ఈలోపు సెలవు విషయం తేల్చడంతో పాటు తిరస్కరిస్తే అందుకు గల కారణాన్నీ ఉన్నతాధికారులు, అధికారులు ఆన్లైన్లోనే వివరించాల్సి ఉంటుంది. ఓ దరఖాస్తుపై సంబంధిత అధికారి నిర్ణయం తీసుకునే వరకు సంక్షిప్త సందేశాల (ఎస్సెమ్మెస్) రూపంలో ఆయనకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సెలవు మంజూరైతే తక్షణం ఆ విషయం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికి సంక్షిప్త సందేశం రూపంలో తెలుస్తుంది. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ఉన్నతాధికారులు ప్రవేశపెట్టనున్న ‘ఈ–లీవ్’ విధానం త్వరలో రాష్ట్ర స్థాయిలో అమలులోకి రానుంది. -
హలో.. పోలీస్ సేవలెలా ఉన్నాయి..?
సాక్షి, రాయికల్(జగిత్యాల): ‘హలో.. మేం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు ఇచ్చారు కదా.. పోలీసులు వెంటనే స్పందించారా. ఒకసారి వెళ్లగానే ఎస్సై, ఎస్‌హెచ్‌వో(స్టేషన్ హౌస్ ఆఫీసర్) కలిశారా. రెండు, మూడు పర్యాయాలు వెళ్లారా. మీతో పోలీస్ అధికారి బాగా మాట్లాడారా. అక్కడ పోలీసులు, ఇతర సిబ్బంది ఇవ్వమని అడిగారా. పోలీస్‌స్టేషన్‌లో మరోసారి పని పడితే ఒక్కరే వెళ్లే ధైర్యం వచ్చిందా’ అంటూ పోలీస్ ఉన్నతాధికారులు బాధితులకు ఫోన్ కాల్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జగిత్యాల జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో బాధితులకు ఫోస్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్ వెళ్లినప్పటి నుంచి కేసు నమోదు ప్రక్రియ ముగిసి కేసుకు సంబంధించిన పత్రం ఇచ్చేవరకు జరిగే వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలను ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు. పోలీసుల పనితీరుపై పోలీస్ ఉన్నతాధికారులు నేరుగా ఫోన్ కాల్ చేసి ఆరా తీడయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా.. పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గతంలో పోలీస్ అధికారులు, సిబ్బందిపై ఉన్న మచ్చలను తొలగించాలనే ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారులు నేరుగా ప్రజలతో మాట్లాడుతున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. ఒకప్పుడు పోలీస్‌స్టేషన్ మెట్లక్కాలంటే భయపడే విధానానికి స్వస్తి పలకాలనే సంకల్పంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసే సమయంలో బాధితుల చరవాణి నంబర్‌ను అంతర్జాలంలో నమోదు చేసేస్తున్నారు. ఆ నంబరుకు కాల్ చేసి సేవల తీరును తెలుసుకుంటున్నారు. పోలీసులు సైతం ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. నిందితులు, వారి కుటుంబసభ్యులతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. రిమాండ్, స్టేషన్ బెయిల్ ఇతర విషయాల్లో నగదు తీసుకుంటున్నారా.. పారదర్శకంగా పని చేస్తున్నారా.. అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ విధానాలతో గతంతో పోలిస్తే జిల్లాలో కిందిస్థాయిలో అవినీతి చాలావరకు తగ్గిందని ఉన్నాతాధికారులు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పోలీసులు వ్యవహరించే విధానంలో మార్పులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ తీరు ఫలించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అధికారులు తమ విధులను పారదర్శకంగా నిర్వర్తిస్తున్నారు. ఒక్కరే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమాలతో పోలీస్స్టేషన్లకు సమస్యల పరిష్కారానికి వెళ్లే ప్రజల్లో మనోధైర్యం పెరుగుతోంది. -
అమ్మో.. పోలీస్!
పోలీస్ అంటే ఒక ధైర్యం.. ఒక భరోసా.. అండగా ఉంటారు.. ఆపదలో కాపాడతారనేది అందరి నమ్మకం. అయితే కొందరి చర్యల వల్ల ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. చిన్నపాటి ఘటనల్లో పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు సామాన్యులు వణికి పోతున్నారు. ఎక్కడైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు పోలీస్ కనిపిస్తే వేధిస్తారేమోననే భయంతో తప్పుకుని వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాక్షి, అమరావతి :ఫ్రెండ్లీ పోలీసింగ్, హైటెక్ పోలీసింగ్.. ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నోట తరచూ విన్పించే మాటలు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనేందుకు లాకప్ మరణాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చిన్నపాటి తప్పులకే పోలీసు విచారణలో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇలా ఒకటి, రెండు కాదు. గడిచిన ఏడాదిలో ఏకంగా తొమ్మిది మంది పోలీసుల దెబ్బకు విగతజీవులుగా మారిపోయారు. ‘లాకప్ డెత్’లను నివారించడంలో రాష్ట్ర సర్కారు ఘోర వైఫల్యాన్ని ఇటీవల మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖ బట్టబయలు చేసింది. విచారణకు తీసుకొచ్చి రోజుల తరబడి పోలీస్ ఠాణాలో పెట్టి నేరం అంగీకరించేలా చేస్తున్న పోలీస్ మార్క్ థర్డ్ డిగ్రీ ప్రయోగం నిందితుల ప్రాణాల మీదకు వస్తోంది. చిన్నపాటి నేరాలు చేసిన వారిపై సైతం పోలీసు ప్రతాపం చూపించడంతో ప్రాణాలు కోల్పోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇలా రాష్ట్రంలో గతేడాది తొమ్మిది మంది దుర్మరణం చెందారు. వారిలో ఐదుగురు పోలీస్ స్టేషన్లలోనే ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు బయటకు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు. మరొకరు గుండె ఆగి మృతి చెందారు. ఇంకా అనేక మంది పోలీసుల వేధింపుల బారిన పడి ఎవరికీ చెప్పుకోలేక బాధ పడుతున్నారు. పోలీసు ఠాణాల్లో మరణ మృదంగం రాష్ట్రంలోని పోలీస్ ఠాణాల్లో మరణ మృదంగం మోగుతోందంటూ మానవ హక్కుల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది జరిగిన లాకప్ డెత్‌ల తీరును గమనిస్తే ప్రభుత్వ వైఫల్యం తేట తెల్లమవుతోంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే మాట నీటి మూట అని చెప్పక తçప్పదు. ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీసుల దెబ్బలకు తాళలేక బాబర్ బాషా(28) అక్టోబర్ 9న మృతి చెందాడు. ఇన్నోవా దొంగతనం కేసులో అతన్ని మూడు రోజులపాటు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టడంతో చనిపోయినట్టు బంధువులు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జాషువా నాగదాసు(19) అక్టోబర్ 6న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమై పోలీసులు తనను తీసుకెళ్లి కొట్టారని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ తన తండ్రికి రాసిన 12 పేజీల సూసైడ్ నోట్(లేఖ)లో మృతుడు పేర్కొనడం గమనార్హం. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం చీమలాపురం గ్రామానికి చెందిన పారిపల్లి రామునాయుడు ఏప్రిల్ 24న పోలీసులకు లొంగిపోయాడు. ఆ మరునాడే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సయ్యద్ షబ్బీర్(25)ను దొంగతనం కేసులో కర్నూలు త్రీటౌన్ పోలీసులు ఆగస్టు 21న అదుపులోకి తీసుకున్నారు. ఆ మర్నాడే కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శవమై కన్పించాడు. విశాఖపట్నం సీసీఎస్ పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీతో విజయనగరానికి చెందిన గొర్లె పైడిరాజు(26) సెప్టెంబర్ 10న దుర్మరణం పాలయ్యాడు. కర్నూలు జిల్లా డోన్ పోలీసుల వేధింపులతో తోపుడు బండి వ్యాపారి వరదరాజులు గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య అప్పట్లో ఆరోపించింది. గుంటూరు జిల్లా మంగళగిరి శివారు రత్నాలచెరువు ప్రాంతానికి చెందిన బూసిరాజు గోపిరాజు(22) అక్టోబర్ 30న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక దొంగతనం కేసులో పోలీసులు చిత్రహింసలు పెట్టారని, అందుకే చనిపోతున్నానంటూ తన ఆత్మహత్యను సెల్ఫీ వీడియో తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వరరావును సెల్‌ఫోన్ చోరీ కేసులో నవంబర్ 15న రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను 16న సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శవమై కన్పించడంతో పోలీసుల తీరుపై అనుమానాలు రేగాయి. లాకప్ డెత్‌లను నివారించాలి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం లాకప్ డెత్‌ల నిరోధానికి చర్యలు తీసుకున్నప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ఆర్బాటపు ప్రకటనలకు అర్థం ఉంటుంది. నిందితులను విచారించే పద్దతుల్లో పోలీసుల్లో మార్పు రావాలి. లాకప్ మరణాలను సీరియస్‌గా తీసుకుని వాటికి కారణమైన పోలీసులపై శాఖాపరమైన దర్యాప్తులతో సరిపెట్టకుండా సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టి శిక్ష పడేలా చేయాలి. ఎవరినైనా అదుపులోకి తీసుకున్నప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి సుప్రీం కోర్టు (1997) మార్గదర్శకాలను పాటించాలి. – యూజీ శ్రీనివాసులు, మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు -
‘పోలీస్ స్టేషన్‌కో టీ స్టాల్ ఏర్పాటు చేయండి’
న్యూఢిల్లీ : తమ సమస్యలు చెప్పుకోడానికి పోలీస్ స్టేషన్‌కి వచ్చే జనాలతో కాస్తా మర్యాదగా మాట్లాడుతూ వారికి ధైర్యం కలిగించలేరా అంటూ కేంద్ర హోం మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. దివాళి సందర్భంగా రాజధానిలో పెట్రోలింగ్ విధుల నిర్వహించే పోలీస్ అధికారులకు మోటర్ సైకిల్లను అందించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరారు. ‘ఎవరో ఒక బాధితుడు లేది బాధితురాలు తమ సమస్య గురించి చెప్పడానికి పోలీస్ స్టేషన్‌కి వస్తారు. అలాంటి వారితో కాస్తా మంచిగా, మర్యాదగా మాట్లాడలేమా..? వారికి కొన్ని మంచి నీళ్లు ఇవ్వలేమా అంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసులు ప్రజలతో స్నేహంగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలకాల్సిందిగా కోరారు. అంతేకాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక టీ కొట్టును ఏర్పాటు చేయాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. అందుకు కావాల్సిన నిధులను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని తెలిపారు. పోలీస్‌లు ప్రజలకు రోల్ మోడల్‌గా ఎందుకు ఉండకూడదంటూ ఆయన ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చే సాధరణ ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని కోరారు. ఇకమీదట ప్రతి పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వివరాలను తెప్పించుకుంటాను.. ఏవైనా మార్పులు వచ్చాయా లేదా అనేది పరిశీలిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. -
దుర్గ గుడి చైర్మన్‌కు అవమానం
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పోలీసులు.. ఆచరణలో మాత్రం ఆ రీతిగా వ్యవహరించడం లేదు. ప్రతిష్టాత్మకమైన దసరా శరన్నవరాత్రుల సమయంలో వారి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పరిసరాల్లో ఎక్కడిక్కడ గేట్లకు తాళాలు వేసి భక్తులను, ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా అంతరాలయంలో భక్తుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇదే రీతిన ఆదివారం గుడి చైర్మన్ గౌరంగబాబును దర్శనానికి అనుమతించకుండా అవమానించారు. దీంతో నగర సీపీ వచ్చి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరు మార్చుకుని మిగిలిన రోజులైనా ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక భావన దెబ్బతినకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అత్యుత్సాహంతో పోలీసులు విమర్శల పాలవుతున్నారు. తొలిరోజు నుంచి దురుసు వ్యవహారశైలితో వివాదాస్పదమవుతుండగా.. ఆదివారం దుర్గగుడి చైర్మన్ యలమంచలి గౌరంగబాబును పోలీసులు అవమానించారు. అమ్మవారి జన్మనక్షత్రం రోజు జరిగే విశేష పూజలో ఈవో, కమిషనర్, దేవాదాయశాఖ కమిషనర్, దుర్గగుడి చైర్మన్లకు తొలి పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే పోలీసుల అత్యుత్సాహంతో చైర్మన్‌ను తొలి పూజకు వెళ్లకుండా చేశారు. తాను గుడి చైర్మన్ అని చెప్పుకున్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలంటూ ఆపేశారు. ఉదయం అదే తంతూ.. తీవ్ర మనస్థాపంతో వెళ్లిన చైర్మన్‌కు తిరిగి ఉదయం కూడా అదే సంఘటన ఎదురైంది. ఉదయం 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన గౌరంగబాబును దర్శనానికి వెళ్లకుండా డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తాను ఆలయ చైర్మన్‌ను అంటూ పదేపదే చెప్పినా ఫలితం లేకుండా పోయింది. అవమానంగా భావించి వెంటనే పాలకమండలి సమావేశం ఏర్పాటుకు ఇతర సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాత్రి తెలియక జరిగిందనకుంటే మళ్లీ ఇప్పుడు కూడా ఇలా జరగడం చాలా ఆక్షేపణీయం అని వ్యాఖ్యానించారు. కనీసం తాన చైర్మన్ చాంబర్‌కు వెళ్లడానికైనా అనుమతించమన్నా నిరాశే ఎదురైంది. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. సీపీ క్షమాపణలు.. గౌరంగబాబుకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న సీపీ ద్వారాకా తిరుమలరావు ఇంద్రకీలాద్రికి చేరుకుని దేవస్థానం చైర్మన్, సభ్యులు, ఈవోతో చర్చించారు. అనంతరం వారందరితో కలసి సీపీ మీడియాతో మాట్లాడుతూ చైర్మన్‌ను దర్శనానికి వెళ్లనీయకపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. జరిగిన తప్పుకు చింతిస్తున్నామన్నారు. ఈ చర్యకు పాల్పడిన అధికారిని గుర్తించామని, విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. తమ అధికారి చేసిన తప్పుకు తాను బాధ్యత తీసుకుంటూ చైర్మన్‌కు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. ఇక మీదట ఇలాంటివి పునరావృత్తం కావని హామీ ఇచ్చారు. నియంత్రణ కష్టసాధ్యం సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): భక్తుల్ని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. అమ్మవారి దర్శనం కోసం వినాయకుని గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది భక్తులు క్యూలైన్లో కాకుండా టోల్గేట్ ద్వారా ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని ఆ విధంగా వెళ్లకుండా నియంత్రించాలి కానీ అక్కడి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అది స్థాయికి మించిన పనైంది. క్యూలైన్ వెలుపలి నిల్చుని ఉన్న భక్తులు అదునుచూసి ఒక్కసారిగా ఉరకలు వేసి క్యూలైన్లోకి చొచ్చుకుపోయారు. దీంతో అప్పటికే వినాయకుని గుడి సమీపం నుంచి క్యూలైన్లో వస్తున్న భక్తులు ఆందోళనకు దిగారు. ఎంతసేపటికీ కొండపైకి వెళ్లే వాహనాలపైనే దృష్టిపెట్టడంతో భక్తుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. అలంకారప్రాయంగా రిసెప్షన్ మూలానక్షత్రం పురస్కరించుకుని అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి వివాదాలు చోటుచేసుకోకుండా ప్రజాప్రయోజనార్థం ఏర్పాటుచేసిన టోల్గేట్ రిసెప్షన్ సెంటర్ అలంకార ప్రాయంగా మారింది. ఇక్కడ 20కు పైగా పోలీసు శాఖ ఉద్యోగులు చేస్తున్నారు. భక్తుల కనీస అవసరాలు తీర్చడంలోనూ విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. -
నడిరోడ్డుపై నరికేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: గత బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలు... ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ ప్రాంతం... ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్‌ను విచక్షణా రహితంగా కొబ్బరిబొండాల కత్తితో నరికిన మనోహరాచారి. ఈ బుధవారం ఉదయం 11.30 గంటలు... అత్తాపూర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం.140... తన కుమారుడిని చంపిన రమేశ్‌ను వెంటాడి గొడ్డలి, కత్తితో నరికి చంపిన కిషన్‌గౌడ్, సహకరించిన లక్ష్మణ్‌గౌడ్. ఈ రెండు ఉదంతాలు వారం వ్యవధిలో పట్టపగలు నడిరోడ్డుపై చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్‌పై నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు చేష్టలుడిగి చూడటమే గాక సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమేశ్ హత్య జరిగిన ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ఉన్నా ఆపలేకపోయారు. ప్లాస్టిక్ లాఠీలతో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లు, కనీసం అదీ లేని ట్రాఫిక్ కానిస్టేబుల్ మారణాయుధాలతో ఉన్న హంతకుల వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. అంతా అయిన తర్వాత క్రైమ్ కానిస్టేబుళ్లు నిందితుల్ని వాహనంలో ఎక్కించుకుని ఠాణాకు తీసుకు వెళ్లగలిగారు. వెంటే వెళుతూ చిత్రీకరించారు... రమేశ్ హత్య జరిగిన హైదర్‌గూడ ప్రాంతం నిత్యం రద్దీ గా ఉంటుంది. రమేశ్‌ను పిల్లర్ నం.134 వద్ద అడ్డగించిన నిందితులు దాడి చేయడం ప్రారంభించారు. కిషన్ గొడ్డలితో, లక్ష్మణ్ కత్తితో విచక్షణారహితంగా నరకడం, పొడవటం ప్రారంభించారు. ప్రాణభయంతో రమేశ్ పరుగు తీస్తున్నా ఎవరూ ముందుకు రాకపోగా ఇదంతా సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తూ ఉండిపోయారు. ఈ వీడియో లు బుధవారం వైరల్‌గా మారాయి. ఓ షోరూమ్ మేనేజర్ హంతకులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డుపై జరుగుతున్నా అడ్డుకునే వారు లేకపోవడంతో కిషన్, లక్ష్మణ్‌లు విచక్షణారహితంగా రమేశ్ ను నరికి చంపేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మణ్‌ను ఎగిరి తన్నినా ఫలితం దక్కలేదు. మాధవి ఉదంతంలోనూ ఓ వ్యక్తి మనోహరాచారిని వెనుక నుంచి తన్నిన విషయం తెలిసిందే. ఆయుధం లేక చేష్టలుడిగిన పోలీసులు... హత్య జరుగుతున్నప్పుడు హైదర్‌గూడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి విధుల్లో ఉన్నారు. ఆయన ఓ దశ లో హంతకుల్ని అడ్డుకోవడానికి తన చేతిలో ఉన్న హెల్మెట్ విసిరారు. విజిల్ తప్ప ఏ ఆయుధంలేని ట్రాఫిక్ కానిస్టేబుల్ అంతకుమించి ధైర్యం చేయలేకపోయారు. హత్య పూర్తయిన తర్వాత.. హంతకులు అక్కడే ఉండి అరుస్తున్న సమయంలో ఓ దొంగను పట్టుకోవడానికి పెట్రోలింగ్ వాహనంలో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. వారి వద్దా ప్లాస్టిక్ లాఠీలే ఉండటం... హంతకుల వద్ద మారణాయుధాలు ఉండటంతో పట్టుకునేందుకు ధైర్యం చేయలేదు. గతంలో పెట్రోలింగ్ వాహనంలో ఒకటైనా తుపాకీ ఉండేది. ఫ్రెండ్లీ పోలీ సింగ్ పుణ్యమాని ఆయుధాలన్నీ బెల్ ఆఫ్ ఆరమ్స్గా పిలిచే ఆయుధాగారాలకే పరిమితమయ్యాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులూ వాటిని పట్టుకుని తిరగకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ హత్యనే కాదు.. ఎవరైనా తమను హత్య చేయడానికి వచ్చినా పారిపోవడం మినహా ఎదిరించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా స్పందించినా ఇబ్బందులే... ఈ ఉదంతం ఇలాఉంటే.. ఎవరైనా కింది స్థాయి పోలీసు సిబ్బంది చాకచక్యంగా స్పందించి, తమకు తోచిన సాయం చేసినా అధికారుల నుంచి మద్దతు లభించట్లేదు. కొన్ని రోజుల క్రితం ఫలక్‌నుమా పరిధిలో జరిగిన వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడి ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి మరో వ్యక్తిని బండరాయితో మోది చంపడానికి యత్నించాడు. అక్కడే 200 మంది ఉన్నా ఆపలేదు. పెట్రోలింగ్ వాహనం కానిస్టేబుల్ ధైర్యంతో బండరాయి ఎత్తిన వ్యక్తిని అడ్డుకుని, బాధితుడి ప్రాణం కాపాడాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ కిందపడి డిస్ప్లే పోయింది. విషయాన్ని తన అధికారికి చెప్తే... అభినందించాల్సిందిపోయి దూషించారని తెలిసింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన సొంత డబ్బుతో ట్యాబ్ బాగు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సందేశం కొందరు కానిస్టేబుళ్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో తొందరెందుకు అనే దోరణిలో కొందరు ఉన్నారు. -
ఉర్దూ తెలియక...ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు దెబ్బ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫెండ్లీ పోలీసింగ్ విధానం రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుండగా.. ముస్లిం నివాస ప్రాంతాల్లో మాత్రం అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ముస్లింల ప్రాబల్యం అధికంగా గల పాతబస్తీ, చార్మినార్ వంటి ప్రాంతాల్లో పనిచేసే పోలీసులకు ఉర్దూ భాష తెలియక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘పోలీసుల ఉద్దేశం మంచిదే అయినా, భాషా రాహిత్యం వల్ల వారు ముస్లిం వర్గాలతో మాట్లాడే సందర్భంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యం దెబ్బతింటోంద’ని అడ్వకేట్ సమీయుద్దీన్ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు.. తెలుగులో ‘మీరు’ అనే మర్యాదపూర్వక పిలుపుకు ఉర్దూలో ‘ఆప్’అనే పదం ఉంది. కానీ, దానికి బదులు ‘తు’ అనే పదాన్ని ప్రయోగించినప్పుడు ఎదుటివారి మర్యాద తగ్గించి మాట్లాడిన వారమవుతామని ఆయన అన్నారు. క్రిమినల్స్‌తో దురుసుగా మట్లాడితే ఫరవాలేదుగానీ, చిన్న చిన్న ఫిర్యాదుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్కువ చేసే వ్యాఖ్యలు పొరపాటున వ్యక్తమయినా ప్రజలకు పోలీసులపై చెడు అభిప్రాయం కలుగుతుందని మరో అడ్వకేట్ మహ్మద్ రషీద్ అన్నారు. అయితే, భారత పోలీసు సేవల చట్టం ప్రకారం.. ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారో ఆయా ప్రాంతీయ భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిబంధన ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ఆ నిబంధన పెద్దగా అమల్లోలేదు. దాంతో, గొడవలు, అల్లర్లు జరిగినప్పుడు ఆదేశాలు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. కాగా, ఉర్దూ తదితర భాషల్లో పట్టుసాధించడానికి పోలీసులకు స్వల్పకాలిక కోర్సులు ప్రవేశపెట్టనున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
థర్డ్ పార్టీ చెక్‌చేస్తోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల పనితీరు, స్టేషన్లలో బాధితులతో వ్యవహరిస్తున్న తీరుపై థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ అందిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ముందస్తుగా హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రారంభించిన సిటిజన్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థ విజయవంతం అయ్యింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఈ వ్యవస్థను జిల్లాల్లోనూ అమలు చేస్తున్నారు. ప్రతీ నెలా అన్ని జిల్లాలు, నూతన కమిషనరేట్ల పరిధిలో పోలీసుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా నాలుగు అంశాలపై... మారుమూల స్టేషన్ నుంచి జిల్లా కేంద్రాల్లో ఉన్న ఠాణాల వరకు ప్రతీచోట ఏం జరుగుతోంది? ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులతో సిబ్బంది, అధికారులు ప్రవర్తించే తీరు ఎలా ఉంటోంది? రిసెప్షన్ సెంటర్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఎలా స్పందిస్తున్నారు? సంఘటనా స్థలికి పెట్రోలింగ్, బ్లూకోట్స్ సిబ్బంది ఎంత సమయంలో వస్తున్నారు? పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సమయంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఎలా పని చేస్తోంది? మర్యాదపూర్వకంగా ఉందా? లేకా డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా.. ఇలా ప్రధానంగా నాలుగు అంశాలతో థర్డ్ పార్టీతో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రతీ ఫిర్యాదుదారుడికి థర్డ్ పార్టీ నుంచి ఫోన్‌కాల్ వెళ్తుంది.. స్టేషన్లో అధికారి, సిబ్బంది వ్యవహరించిన తీరుపై 1 నుంచి 10 వరకు గ్రేడింగ్ ఇస్తారు. ఇలా నాలుగు అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రతీ నెలా ఈ ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ జోన్ల ఐజీలకు అందుతోంది. గ్రేడింగ్ వారీగా... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 600కి పైగా పోలీస్స్టేషన్ల నుంచి వచ్చే నివేదికలను ఐజీలు పరిశీలించి థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ నుంచి వచ్చిన మార్కుల ఆధారంగా ఆ ఠాణా అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. జోనల్, జిల్లా మీటింగ్‌ల్లో సంబంధిత స్టేషన్, అధికారి, సిబ్బందికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. అలాగే పనితీరు సరిగా లేని ఠాణా, సర్కిల్, డివిజన్ల అధికారులతో చర్చించి పనితీరు మార్చుకునేలా ఐజీలు, సంబంధిత ఎస్పీ/కమిషనర్లు కృషిచేస్తున్నారు. ఏకరూప పోలీసింగ్‌లో ఇది కీలకమని, ప్రతీ చోటా పోలీస్ సేవలు పారదర్శకంగా, అంకితభావంతో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు మంచిపేరు తెచ్చేలా సిబ్బందిని, అధికారులను ప్రోత్సహించేందుకు ఈ సిటిజన్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. -
పోలీసులు..ప్రజలకు చేరువకావాలి
మైలార్‌దేవ్‌పల్లి: పోలీసులు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూ నేరాలు అరికట్టడంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ముందుకు సాగాలని సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ అన్నారు. సెన్సిటేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ యూనిఫాం సర్వీస్ డెలివరీ కార్యక్రమం శంషాబాద్ జోన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్‌లోని తలాడియం లగ్జరీ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధితులకు సకాలంలో న్యాయం జరిగినప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ పోలీసులను గౌరవిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేకమైన విధి విధానాలతో పోలీసు వ్యవస్థ ముందుకు వెళ్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగాన్ని ఇతర రాష్ట్ర పోలీసులు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత హోదాల ఆధారంగా అధికారులు స్పందించకూడదని తెలిపారు. పోలీసుల వ్యవహార శైలి సమాజంపై పడుతుందన్నారు. శాంతిభద్రతలు పరిరక్షణ, నేరరహిత సమాజం ఆవిష్కరించే ప్రయత్నాలలో ప్రజలను భాగస్వాములను చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇటీవల సీసీ కెమెరాల సహాయంతో నగరంలో పలు ముఖ్యమైన కేసులను ఛేదించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న అనేక చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ప్రజలందరికీ ఒకే విధమైన న్యాయాన్ని చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రజల్లో పోలీసులంటే భయం లేకుండా దైర్యంగా పోలీస్స్టేషన్లకు వచ్చే విధంగా పోలీసు వ్యవహారశైలి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ పద్మజారెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌కుమార్, శంషాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ సురేందర్‌రావు, మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మర్యాద..మర్యాద!
సంగారెడ్డి క్రైం: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖ పనితీరులో అనేక మార్పులు వచ్చాయి. గతంలో ప్రజలు పోలీస్స్టేషన్లకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఆ పరిస్థితిని మార్చిం ది. ఈ విధానం ద్వారా పోలీస్‌లు స్టేషన్‌కు వచ్చే ప్రజలు, బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటారు. ఫిర్యాదులను స్వీకరిస్తారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్టుగా మహిళా పోలీసులను నియమించడానికి పోలీస్ శాఖ సన్నాహాల చేస్తోంది. అన్ని పోలీస్స్టేషన్లలో ప్రజలతో పోలీసులు మమేకమవుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకించి ప్రభుత్వం ఓ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసింది. ప్రజలతో మమేకం కావడానికి వీపీఓ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పోలీసులపై నమ్మకం పెరగడాని కి, వారితో మమే కం కావడానికి గ్రా మ పోలీస్ అధికారుల నియామకాన్ని చేపట్టారు. ఈ విధానం సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి దోహదపడుతోంది. గ్రామంలో శాంతిభద్రతల విషయంలో గ్రామ పోలీస్ అధికారి పాత్ర కీలMý.ంగా మారింది. మారుమూల పల్లెలో సైతం ఎలాంటి సమస్య జరిగి నా కొద్ది సమయంలోనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది. సమాజసేవలో సిద్దిపేట పోలీసులు.. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని పో లీసులు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. మూఢనమ్మకాల నిర్మూలనకు కళాబృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. యువతలో ఉత్సహాన్ని కలిగించడానికి 2కే రన్, 3కే రన్, 5కే రన్లతో పాటు సైకిల్రేసులు, క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. 12 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం ఎరగని వర్గల్ మండలంలోని గుట్టుపల్లికి పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని బస్సు సౌకర్యం కల్పించారు. అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ముందంజలో సంగారెడ్డి పోలీసులు... నిజామాబాద్ జోన్ పరిధిలోని కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటిలో సంగారెడ్డి జిల్లా పోలీసులు స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే తీరు అందికంటే మెరుగ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా సంప్రదించి నివేదికను అందించే ఓ సంస్థ సర్వేలో ఈ విషయం వెల్లడి అయినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్తున్నాం... గతంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లంటేనే భయంగా ఉండేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైన పెద్ద మనుషులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఫ్రెండ్లీ పోలీస్ విధానం ద్వారా ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే నేరుగా స్టేషన్‌కు వెళ్లి చెప్పుకుంటున్నాం. పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తున్నారు.– సిద్దిరామాగౌడ్, మాసాయిపేట పక్కాగా ఫ్రెండ్లీ పోలీస్ విధానం.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుడితో పోలీసులు ఫ్రెండ్లీగా ప్రవర్తించాలని ఆదేశిం చాం. హైదరాబాద్ తరహాలోనే ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు చేస్తున్నాం. శిక్షణ పొందిన పోలీసులను రిసెప్షనిస్టులుగా నియమిస్తున్నాం. నేరాల నియంత్రణకు బ్లూ కోర్టులను ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. –జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ -
ఆటాడుకుందాం.. రా!
సాక్షి,సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను అవలంభిస్తున్న నగర పోలీసు అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. యువతతో సత్సంబంధాలు నెలకొనే విధంగా వారిని భాగస్వాములను చేస్తూ క్రికెట్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటిని ‘హైదరాబాద్ పోలీసు లీగ్ (హెచ్పీఎల్) 20–20’ మ్యాచెస్గా పిలువనున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం ప్రకటించారు. నగర వ్యాప్తంగా జరిగే ఈ పోటీల్లో 80 వేల మంది యువతను పాల్గొనేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి టీమ్‌కు ప్రత్యేక రంగుతో కూడిన, తమ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా డ్రస్ ఉంటుందని ఆయన వివరించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక సెక్టార్లు ఉంటాయి. ఒక్కో సెక్టార్‌కు ఒక ఎస్సై నేతృత్వం వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సెక్టార్ల వారీగా టీమ్‌లు తయారు చేసి ఈ పోటీలు నిర్వహించాలని సీపీ నిర్ణయించారు. ఇక్కడ గెలిచిన జట్లు ఠాణా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటాయి. ఆపై సబ్–డివిజన్, జోనల్ స్థాయిల్లోనూ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి మ్యాచ్ సౌత్ జోన్‌కు సంబంధించి ఈ నెల 21న బార్కస్ గ్రౌండ్స్‌లో జరుగనుంది. ఆసక్తిగల యువకులు, క్రీడాకారులు తమ సెక్టార్ ఎస్సై, లేదా స్థానిక ఠాణా ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో కలిసి నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లలో పాల్గొనాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు నగరానికి చెందిన ప్రముఖ ఆటగాళ్లకు కొత్వాల్ పిలుపునిచ్చారు. అందరూ భాగస్వాములైతే యువతకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. మహిళా క్రీడాకారిణుల కోసం ప్రత్యేకంగా టీమ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వేసవి కాలం నేపథ్యంలో ఎండ తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం దీని ప్రభావం క్రీడాకారులపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మ్యాచ్‌ను తెల్లవారుజామునే ప్రారంభించి ఉదయం 10.30 గంటల్లోగా పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హెచ్పీఎల్ సిరీస్ ముగిసిన తర్వాత ఎక్కువ రన్లు చేసిన, వికెట్లు తీసిన, బెస్ట్ పార్ట్నర్షిప్.. ఇలా మొత్తం 10 కేటగిరీలో వ్యక్తిగత అవార్డులు సైతం ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్‌లో నగర యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీపీ కోరారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు మచ్చ
చాంద్రాయణగుట్ట: ఒకవైపు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసులను ప్రజలకు చేరువ చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుండగా మరోవైపు కొందరు అధికారులు తమ వైఖరితో పోలీస్ వ్యవస్థకే అప్రదిష్ట తీసుకువస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు అభయం కల్పిస్తూ వారితో హుందాగా నడుచుకోవాల్సిన అధికారులు ఒక్కోసారి సంయమనం కోల్పోయి వారితో అసభ్యపదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా పాతబస్తీలోని ఛత్రినాక ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ ఫిర్యాదుదారుడితో మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా...? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే....గురువారం రాత్రి గౌలిపురా పటేల్‌నగర్‌కు చెందిన వార్డు కమిటీ సభ్యుడు సర్వేశ్వర్ సమీపంలో ఉన్న బూడిదగడ్డ నుంచి రాళ్లు పడుతున్నట్లు ఛత్రినాక ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్‌కు ఫోన్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా సర్వేశ్వర్ను బూతులు తిట్టాడు. అనంతరం బాధితుడు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా అక్కడ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో వెనుదిరిగారు. విచారణ చేపడతాం: కమిషనర్. ఫిర్యాదుదారుడి పట్ల ఇన్స్పెక్టర్ మాట్లాడిన తీరుపై విచారణ చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చార్జ్ మెమో జారీ: డీసీపీ సత్యనారాయణ. వార్డు సభ్యుడి పట్ల అమర్యాదగా మాట్లాడిన ఛత్రినాక ఇన్స్పెక్టర్కు క్రమశిక్షణ ఉల్లంఘన కింద చార్జ్ మెమో జారీ చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అతను ఫ్రెండ్లీ పోలీసింగ్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడన్నారు. పటేల్‌నగర్‌లో రాళ్ల దాడికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. వార్డు సభ్యుడు సర్వేస్ కుమార్ మధ్య జరిగిన సంభాషణను ఎడిట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజమని తేలితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈ ఠాణా.. వసతుల ఖజానా!
సాక్షి, హైదరాబాద్: గందరగోళం మధ్య రణగొణ ధ్వనులు.. చెల్లాచెదురుగా పడిఉండే ఫైళ్లు, కాగితాలు.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బంది.. సాధారణంగా పోలీసుస్టేషన్ పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను అవలంభిస్తున్న నగర పోలీసులు వీటిని మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. మౌలిక వసతులకు సంబంధించి పశ్చిమ మండలం పరిధిలోని పంజగుట్ట ఠాణా దేశంలోనే తొలి మోడల్ పోలీసుస్టేషన్‌గా అవతరించింది. కేసుల పరిష్కారం, ప్రజల మన్ననలతో ‘సెకండ్ బెస్ట్ పోలీసుస్టేషన్ ఇన్ ఇండియా’గా అవార్డును ఇటీవల దక్కించుకున్న నేపథ్యంలో ఆ ఠాణా వివరాలివీ.. అడుగడుగునా ఆహ్లాదం.. ఇన్స్పెక్టర్, సబ్–ఇన్స్పెక్టర్ల చాంబర్స్‌తోపాటు పోలీసుస్టేషన్ పరిపాలనా విభాగం మొత్తం మొదటి అంతస్తులో ఉంది. మొదటి అంతస్తు వరకూ రాలేని వృద్ధులు, వికలాంగుల వద్దకు పోలీసులే వస్తారు. దీనికి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంది. రోజంతా ఒత్తిడితో పని చేసే అధికారులు, సిబ్బందికి హెల్ప్ డెస్క్ పక్కనే ‘స్ట్రెస్ ఫ్రీ జోన్’ ఉంది. ఈ జోన్లోకి వెళ్లి మెడిటేషన్ వీడియోలు చూసి రిలాక్స్ అయ్యే ఏర్పాట్లు చేశారు. ఇక్కడే మహిళా సిబ్బందికి ప్రత్యేక రెస్ట్ రూమ్ ఉంది. స్టేషన్ భవనం ఎంట్రీలోనే ఆ రోజుకు ఉత్తమ సేవలు అందించిన సిబ్బంది ఎవరో తెలిపే బోర్డు కనిపిస్తుంది. సాధారణంగా ఏదైనా పోలీసుస్టేషన్‌కు వెళ్లినప్పుడు ఫిర్యాదు చేయడానికి అవసరమైన కాగితం ఫిర్యాదుదారులే తెచ్చుకోవాలి. ఇక్కడ మాత్రం ప్రతి బాధితుడికీ సిబ్బందే కాగితం, పెన్ను అందించడంతో పాటు ఫిర్యాదు రాయడంలో సహకరిస్తారు. ఠాణా రెండో అంతస్తులో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ ఏరియా మరో ప్రత్యేక ఆకర్షణ. సమష్టి కృషి ఫలితంగానే ‘పంజగుట్ట పోలీసుస్టేషన్ నిర్వహణ, నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం సమష్టి కృషితోనే సాధ్యమైందని.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సిబ్బంది సహకారం ఫలితంగానే జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఠాణా ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ అన్నారు. 2016లో 947 కేసులు నమోదైతే.. గతేడాది ఆ సంఖ్య 773కు తగ్గిందని..2016లో రికవరీ 84%గా ఉంటే... గతేడాది 87 శాతానికి పెరిగిందని చెప్పారు. ఏ ఫైల్ అయినా 30 సెకన్లలోనే.. అలాగే ఏదైనా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫలానా ఫైల్ కావాలని అడిగితే దాన్ని వెతకడానికి గంటలు, రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే పంజగుట్ట ఠాణాలో వీటి నిర్వహణను పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. కేసు.. అది నమోదైన సంవత్సరం, వాటి తీరుతెన్నుల వారీగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫైళ్లలో భద్రపరుస్తున్నారు. ఫలితంగా పంజగుట్ట ఠాణాలో ఏ కేసుకు సంబంధించిన ఫైల్ అయినా 30 సెకన్లలోనే బయటకు తీసేందుకు ఆస్కారం ఏర్పడింది. వీటికితోడు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను ఉంచారు. మూడో అంతస్తులో అధికారులు, సిబ్బంది కోసం జిమ్, యోగా ఏరియాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వీటితో పాటు రిలాక్స్ ఏరియా, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మినీ లైబ్రరీ, రీడింగ్ ఏరియా, గవర్నమెంట్ ప్రాపర్టీ రూమ్, క్లూస్ టీమ్, కేస్ ప్రాపర్టీ డిపాజిట్ రూమ్ తదితరాలన్నీ ఈ అంతస్తులోనే ఉన్నాయి. ఈ పోలీసుస్టేషన్ మిద్దెపై సేంద్రియ పద్ధతిలో ‘పంటలు’ పండిస్తున్నారు -
ఇచట దొంగలకు శిక్షణ ఇవ్వబడును!
దొంగతనం చేయడంలో వారికి పెట్టింది పేరు. చోరీలు ఎలా చేయాలో నేర్పేందుకు ఇక్కడ శిక్షణ పాఠశాలలే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దొంగతనం చేస్తూ బతకడమే ఈ బస్తీవాసుల జీవనం. వీరిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. కరడుగట్టిన 25 మంది మాన్గార్ బస్తీ నేరగాళ్లు పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో అసలీ బస్తీ కథేంటి? చోర కళలో ఆరితేరడంలో అంతర్యమేమిటి? వీరి జీవనంలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు చేస్తున్న కృషి తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మాన్గార్ బస్తీలో దొంగల బడులు చోర కళలో శిక్షణనిస్తున్న పాఠశాలలు ఇక్కడి వారికి ఇదే వృత్తి మార్పు కోసం పోలీసుల ప్రయత్నం స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలు సాక్షి, నాంపల్లి: రెండు శతాబ్దాల క్రితం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 500 కుటుంబాలు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్గార్ బస్తీలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి. ఇక్కడి పిల్లలు చదువుకునేందుకు ఇష్టపడరు. పెద్దలు సైతం వీరిని బడికి పంపించరు. కానీ దొంగతనాలు నేర్పే బడికి మాత్రం పంపిస్తారు. బస్తీలో పదుల సంఖ్యలో ఈ పాఠశాలలున్నాయి. ఇక్కడ చోర కళ మాత్రమే నేర్పిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల మెడలోని గొలుసు ఎలా తెంచుకోవాలి? జేబులు కత్తిరించి, ఎలా బయటపడాలో ప్రాక్టీస్ చేయిస్తారు. ‘నాయకుడి’ నరకం.. ప్రతిరోజూ ఈ దొంగల ముఠాలు ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో, ర్యాలీలు, పాదయాత్రలలో సంచరిస్తాయి. కొన్ని ముఠాలు జాతరలు, దేవాలయాల వద్ద తిష్టవేస్తాయి. దొంగలించిన సొమ్మంతా ముఠా నాయకుడికి అం దజేస్తారు. ఈ క్రమంలో దొంగ పోలీసులకు చిక్కితే విడిపించడానికి అవసరమయ్యే ఖర్చు, తల్లిదండ్రుల పోషణ, వైద్య ఖర్చులు అన్నీ ముఠా నాయకుడే చెల్లిస్తాడు. చెల్లించిన పైకానికి 30 శాతం వడ్డీ వసూలు చేస్తాడు. అసలు, వడ్డీ చెల్లించకుంటే పిల్లలు వారి అధీనంలోనే ఉండాలంటాడు. ఇలా తీసుకున్న డబ్బు చెల్లించలేక, ఇచ్చిన మాటను కాదనలేక, ఎదురించినా బస్తీలో ఇవ ుడలేక ఎంతో మంది తమ కుటుంబాలను చేతులారా నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కృషి.. నేరాలను అదుపు చేయడానికి రెండేళ్ల క్రితం ఈ బస్తీ నుంచే పోలీసులు కట్టడి ముట్టడి (కార్డన్ సెర్చ్)కి శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో 70 శాతం చైన్ స్నాచింగ్ కేసులు తగ్గాయి. పోలీసుల వరుస దాడులు, కేసుల నమోదు, పీడీ యాక్టులతో సగం మంది నేరాలు మానేసి, ఉపాధి పనుల బాట పట్టారు. బస్తీ ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు నిరంతరం తపిస్తున్నారు. ఇందులో భాగంగానే మాన్గార్ బస్తీలో లయన్స్ క్లబ్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సామూహిక అన్నదానాలు, దుస్తుల పంపిణీ, అవగాహన సదస్సులు, హెల్త్ క్యాంపులు, ఉద్యోగ మేళాలు చేపడుతున్నారు. జీవితాలు నాశనం చేసుకోవద్దు.. తరతరాలుగా దొంగతనాలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దొంగతనాలు చేస్తూ ఫైనాన్సియర్లను బతికిస్తున్నారు. తాతముత్తాతల వృత్తినే మళ్లీ ఎంచుకుని జీవించడం సరికాదు. నేర ప్రవృత్తిని వీడనాడాలి. పిల్లలను బాగా చదివించుకోవాలని బస్తీవాసులను కోరుతున్నాం. – వెంకటేశ్వరరావు, డీసీపీ నేరగాళ్ల చిట్టా ఇదీ.. మాతంగి సునీల్.. మాతంగి సునీల్ అలియాస్ మదన్ 40 కేసుల్లో నిందితుడు. జంటనగరాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై కేసులున్నాయి. చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా పద్ధతి మార లేదు. కాంబ్లే దీపక్.. మాన్గార్ బస్తీకి చెందిన కాంబ్లే దీపక్ అలియాస్ బోకుడు. ఇతనిపై 50 కేసులున్నాయి. కరడుగట్టిన నేరస్తుడిగా పేరుంది. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. ఆకాష్.. ఆకాష్ అలియాస్ బాండియా నేరాలు చేయడంలో సిద్ధహస్తుడు. 50 కేసులున్నాయి. క్షణాల్లోనే మెడలోని గొలుసులు తెంచేస్తాడు. అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా ఎలాంటి మార్పులేదు. నర్సింహ.. హెచ్. నర్సింçహ అలియాస్ మొగిలి 60 కేసుల్లో నిందితుడు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తిష్ట వేసి ప్రయాణికుల బ్యాగులు, లగేజీలు దోచుకెళ్తాడు. పలుమార్లు జైలుశిక్ష అనుభవించి బయటకు వ చ్చాడు. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. నాడె గోపి.. నాడె గోపి అలియాస్ ఫయాజ్ 25 కేసుల్లో నిందితుడు. దోపిడీ కేసుల్లో నేరస్తుడు. నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు న్నాయి. పోలీసులకు చిక్కకుండా సవాల్‌గా నిలిచాడు. మాన్గార్‌బస్తీ మారుతోంది! కరుడుగట్టిన 25 మంది నేరగాళ్ల లొంగుబాటు నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా సరెండర్లు లొంగిపోయిన వారిపై 32 ఠాణాల్లో 200 కేసులు సాక్షి,సిటీబ్యూరో: మాన్గార్‌బస్తీ... ఈ పేరు చెబి తే పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, దోపిడీ, దొంగతనాలు చేసే నేరగాళ్ళకు కేరాఫ్ అడ్రస్. ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా, చివరకు పీడీ యాక్ట్‌లు ప్రయోగించినా వీరిలో మార్పు కనిపించేది కాదు. ఈ ప్రాంతంలో రైడింగ్‌కు వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చిన పోలీసులు లేరనే చెప్పవచ్చు. హబీబ్‌నగర్ పోలీసులు ఆరు నెలల కృషి ఫలితంగా ఇలాంటి ఘరానా నేరచరిత్ర ఉన్న ఆ ప్రాంతంలో మార్పు వస్తోంది. నగర పోలీసు చరిత్రలోనే తొలిసారిగా 25 మంది కరుడుగట్టిన మాన్గార్‌బస్తీ నేరగాళ్ళు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాసం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. వీరంతా కేవలం లొంగిపోవడం మాత్రమే కాదని... ఇకపై నేరాలు సైతం చేయమంటూ పోలీసుల ఎదుట ప్రమాణం చేశారు. ఈ ఘనత హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ పరవస్తు మధుకర్స్వామికే దక్కుతుంది. కొన్నేళ్ళ క్రితం మహా రాష్ట్ర, కర్నాటకల నుంచి వచ్చి ఈ బస్తీలో స్ధిరపడిన వారిలో అత్యధికులు నేరప్రవృత్తినే ఎంచుకున్నారు. వీరిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ప్రవర్తన మార్చుకున్న వారికి ఉపాధి కల్పించడానికి ‘జాబ్ కనెక్ట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా ఇప్పటికే అనేక మందికి కార్పొరేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు ఇప్పించారు. మాన్గార్‌బస్తీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేరాలు చేస్తున్న ఎనిమిది ప్రధాన గ్యాంగులను గుర్తించిన పోలీసులు వాటినే ‘టార్గెట్’గా చేసుకున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వీటిలోని 25 మంది సభ్యులను సన్మార్గంలోకి తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు అవలంభిస్తూ వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ తమపై నమ్మకం పెంచుకున్నారు. ప్రవృత్తిని మార్చుకుంటే భవిష్యత్తులోనూ పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బం దులు ఉండవంటూ భరోసా ఇచ్చారు. ఫలితంగా ఆ 25 మందీ సోమవారం డీసీపీ ఎదుట లొంగిపోయారు. వీరు ఇప్పటికే సిటీలోని 32 ఠాణాల పరిధిలో నమోదైన 200 కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్ళివ చ్చారు. వివిధ పోలీసుస్టేషన్లలో 106 నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 194 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ఒక్కొక్కరి పై పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నాయి. వీటిలో జేబు దొంగతనాల నుంచి దోపిడీల వరకు వివిధ నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం వీరందరినీ కోర్టు ముందు హాజరుపరునున్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించడంతో పాటు సొత్తు రికవరీ చేసి బాధితులకు అందించనున్నారు. వీరికి ఉద్యోగాలతో పాటు జీవనోపాధి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ విధానాన్ని కోనసాగిస్తూ మిగిలిన నేరగాళ్ళు సైతం మారేందుకు ఆస్కారం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం మావోయిస్టుల విషయంలో మాత్రమే అనుసరించే సరెండర్ పాలసీని మాన్గార్‌బస్తీ నేరగాళ్ళకూ వర్తిం చడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. సారూ.?
సాక్షి, భద్రాద్రి : ఏడాది కాలంగా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడంలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ఓ బాధితురాలు ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి తనకు న్యాయం చేసేవారు లేరా అని అర్థించారు. వివరాలు.. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన ఐతం సోనీ గత ఏడాది అక్టోబర్ 20వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. మరుసటి రోజు ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే అక్కడి ఎస్ఐ రాంచరణ్ దొంగతనం కేసు నిలవదంటూ తప్పుదోవ పట్టించి అత్యాచారం కేసు పెట్టించాడు. దీంతో బాలకృష్ణ తనకు, సోనీకి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ ప్రచారం చేశాడు. ఈ ప్రచారంతో గ్రామంలో పరువు పోయిందంటూ సోనీతో పాటు ఆమె భర్త శ్రీనివాస్‌లు గ్రామం విడిచి వెళ్లిపోయారు. తమతో తప్పుడు ఫిర్యాదు చేయించారంటూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం కలిశారు. అయినా లాభం లేకపోవడంతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవగా ఆయన ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని రోజులు సస్పెండ్ చేసి తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. గ్రామంలో అవమానం భారం తాళలేక సోనీ, శ్రీనివాస్‌లు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. కలెక్టర్ విచారణకు ఆదేశించగా..విచారణ కమిటీ సోనీకి అనుకూలంగానే నివేదిక ఇచ్చింది. ఎస్ఐపై మాత్రం ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం ఎస్పీని కలిసేందుకు వచ్చినా సిబ్బంది కలవనీయకపోవడంతో బాధితురాలు ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించింది. త్రీటౌన్ సీఐ షుకూర్ బాధిత మహిళకు నచ్చజెప్పి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. రెండు రోజుల్లో న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.