ఫ్రెండ్లీ పోలీస్‌గా సేవలందిస్తాం
ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
► నిర్భయంగా స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు
నిర్మల్‌రూరల్ : ప్రజలకు అవసరమైనపుడు పోలీసు సిబ్బంది స్పందించాలని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదుగురు మంది ఫిర్యాదుదారులు వచ్చారు. సమస్యలను ఎస్పీకి తెలియజేసి అర్జీలను సమర్పించారు. వారి నుంచి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు పోలీసు అండగా ఉండాలని, వారితో స్నేహాభావంతో కలిసిపోవాలని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవలంబించేది మంచిమార్గంలో నడిచే వారికేనని స్పష్టంచేశారు.
శాంతి భద్రతలను విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని, వారిపై చట్టరీత్యా చర్యలుంటాయని హెచ్చరించారు. జిల్లాలో పారదర్శక పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తామన్నారు. రాత్రి సమయంలో నేరాలను అరికట్టేందుకు పెట్రోలింగ్ పెంచుతామన్నారు. పోలీసుల సహాయం కావాలనుకున్న వారు పోలీస్‌షే్టషన్ కు నిర్భయంగా రావచ్చన్నారు.