సాక్షి, సిటీబ్యూరో: ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం’ అనే సామెత పోలీసు విభాగానికి సరిగ్గా సరిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో అమలులో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నించి దెబ్బ తింటున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న పోలీసులపై దాడుల ఉదంతాలు దీన్ని వెక్కిరిస్తున్నాయి. బుధవారం సాక్షాత్తూ చిలకలగూడ ఠాణాలోనే ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడటం గమనార్హం..
బయటకు రానివి ఎన్నో..
ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో కొన్ని అసాంఘిక శక్తులు, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులతో పాటు మరికొందరు రెచ్చిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఏకంగా యూనిఫాంలో ఉన్న వారిని దూషించడంతో పాటు వారి పైనే దాడులకు దిగుతున్నారు.
గడిచిన పక్షం రోజుల్లో ఇలా..
- రాజేంద్రనగర్ పరిధిలోని ఇమ్మద్‌నగర్ ప్రాంతంలో లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై స్థానికుడు సమీర్ సహా ముగ్గురు దాడికి యత్నించారు.
- యాకత్‌పురాకు చెందిన మహ్మద్ అనీస్ ఇక్బాల్ మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌కు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో బెదిరించాడు.
కానిస్టేబుల్‌పై కత్తితో దాడి
చిలకలగూడ: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న సమయంలో అదే నిందితుడు కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. గోపాలపురం ఏసీపీ, చిలకలగూడ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన మామిడి హరి కూరగాయల వ్యాపారి. ఇతనికి డేవిడ్‌తో పాటు మరో కుమారుడు ఉన్నారు.
ఈ క్రమంలో హరి కుటుంబ సభ్యులను స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహించే శీతల శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ వారం రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మరోసారి వాగ్వాదం జరిగింది. క్షణికావేశానికి లోనైన హరి పెద్ద కుమారుడు డేవిడ్ తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో శ్రీకాంత్‌పై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం శ్రీకాంత్‌ను ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
నిందితులు హరితో పాటు ఆయన ఇద్దరు కుమారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ విచారణ చేస్తున్న సమయంలో డేవిడ్ తన వెంట ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కిరణ్‌కుమార్ మెడ, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన శ్రీకాంత్, కానిస్టేబుల్ కిరణ్ ఫిర్యాదు మేరకు మామిడి హరి, ఆయన ఇద్దరు కుమారులపై కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు.
చదవండి: Telangana: ఎంసెట్ వాయిదా!
Comments
Please login to add a commentAdd a comment