కాచిగూడ: ప్రియురాలి కోసం సొంత సంస్థకే కన్నం వేసిన ఉద్యోగిని ఆదివారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ కె.శంకర్, ఇన్‌స్పెక్టర్ యు.చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ బషీర్‌బాగ్ చంద్రనగర్‌కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ (35) గత 8 ఏళ్లుగా బషీర్‌బాగ్‌లోని శ్రీ సిద్ధి వినాయక్ జువెలర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో స్టాక్ ఇంచార్జిగా పనిచేస్తున్నాడు. గత రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీకి రాకుండా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో షాపు యజమానికి అనుమానం వచ్చి అడిట్ నిర్వహించాడు.
అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించాడు. దీంతో అనుమానం వచ్చిన యజమాని లక్షయ్ అగర్వాల్ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని సాయి లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. 28 తులాలతో పాటు 8 తులాల డైమండ్ నెక్లెస్ దొంగిలించి మణప్పురం గోల్డ్‌లోన్‌లో తాకట్టు పెట్టినట్లు తెలిపారు.
దొంగిలించిన బంగారాన్ని విక్రయించి తన ప్రియురాలితో దేవస్థానాలు, ఇతర ప్రదేశాలు తిరిగినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 3 తులాల బంగారంతో పాటు మణప్పురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లస్‌ను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా డీఐ డి.నాగార్జున, డీఎస్‌ఐ జి.వెంకటేష్, పోలీసు సిబ్బంది కె.అభిలాష్, సీహెచ్ అరుణ్‌కుమార్, ఎం.సురేష్, ఎస్.సంతోష్ చారీ, పి.విష్ణు మూర్తిలను ఏసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment