ఓ కేఫ్‌లో ఇరానీ చాయ్ తాగాలంటే ఎంతలేదన్నా రూ. 10 నుంచి రూ. 20 మధ్య ఖర్చు పెట్టాల్సిందే. అలాగే ఒక ఉస్మానియా బిస్కెట్ తినాలంటే కనీసం రూ. 5 చెల్లించాల్సిందే. అలాంటిది పోలీసుల అదుపులో ఉండే నిందితులకు రూ. 2కే ఉదయం టీ, అల్పాహారంతోపాటు రెండు పూటలా భోజనం అందించాలట! ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? అధికారికంగా అదుపులో ఉన్న నిందితుల రోజు ఖర్చుల కింద ప్రభుత్వం పోలీసులకు అంతే ఇస్తోంది మరి!!
సాక్షి, హైదరాబాద్: వివిధ నేరాలకు సంబంధించి అనుమానితులు, నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనివార్యం. అదే సమయంలో వారి యోగక్షేమాల్ని చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబీకులకు కూడా తెలియదు కాబట్టి వారికి ఉదయం టీ నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ పోలీసులే సమకూర్చాల్సి ఉంటుంది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తిండి ఖర్చు దగ్గరే తేడా కొడుతోంది. ఎందుకంటే.. ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒక్కో నిందితుడి ఆహార ఖర్చు కింద అక్షరాలా రెండు రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. నిజాం కాలంలో ఇది ఒక రూపాయిగా ఉండగా కొన్ని దశాబ్దాల క్రితం ఉదారతతో రెట్టింపు చేస్తూ రూ. 2కు పెంచారు. ఆ తరువాత ఈ విషయాన్ని అంతా మరచిపోవడంతో ఇప్పటికీ అదే అమలవుతోంది. దీంతో పోలీసులు ఎవరూ ఈ సొమ్ము తీసుకోవట్లేదు. దానికీ ఓ ఆసక్తికర కారణం ఉందని అధికారులు చెబుతున్నారు.
అసలుకు మించి బిల్లులకు ఖర్చు...
వాస్తవ ఖర్చుల మాట ఎలా ఉన్నా ప్రభుత్వం ఇస్తున్న రూ. 2 అయినా తీసుకుందామనుకున్నా దానికి దాదాపు రూ. 10కిపైగా ఖర్చు చేయాల్సి వస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ, రికవరీల కోసం కనిష్టంగా వారం నుంచి 10 రోజులపాటు కస్టడీలో ఉంచుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది అనివార్యంగా మారిపోయింది.
చట్ట ప్రకారం ఎవరిని అదుపులోకి తీసుకున్నా కచ్చితంగా 24 గంటల్లో అరెస్టు చూపడమో లేదా విడిచి పెట్టడమో చేయాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి రోజుకు రూ. 2 కంటే ఎక్కువ బిల్లు పెట్టుకొనే అవకాశం ఉండదు. అంతకంటే ఎక్కువ బిల్లు పెట్టుకోవాలంటే చట్టపరంగా చిక్కులు ఎదురవుతాయి. ఈ లెక్కన నెలలో అదుపులోకి తీసుకున్న ఒక ఐదుగురు నిందితులకు సంబంధించిన రోజువారీ ఆహార ఖర్చు బిల్లు గరిష్టంగా రూ. 10 వరకే పెట్టాల్సి ఉంది.
పైగా దీనికోసం ఓ దరఖాస్తును టైప్ చేసి ఆ మొత్తానికి సరిపడా బిల్లు పెట్టి సంబంధిత ఉన్నతాధికారి కార్యాలయానికి తీసుకెళ్లి మంజూరు చేయించుకొని రావాలి. ఇందుకు సొంత ద్విచక్ర వాహనంలో వెళ్లి రావాల్సి ఉంది. వాటన్నింటికీ కనీసం రూ. 70 ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసు విభాగంలో ఎవరూ ఈ బిల్లుల్ని తయారు చేయడం, ఉన్నతాధికారులకు పంపడం చేయట్లేదు.
వీలైతే ఈ ఖర్చుల్ని పోలీసులు భరించడమో లేదా సదరు వ్యక్తి జేబులో ఉన్న వాటితో సరిపెట్టడమో చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో నేరుగా ఆ వ్యక్తి ఇంటి నుంచే భోజనం తెప్పించి పెడుతున్నారు. అయితే అనుమానితుడు అనారోగ్యంతో ఉంటే ఈ ఖర్చులకు తోడు వైద్యం, మందుల భారమూ పోలీసులకు అంటుకుంటోంది.
నిందితుల కంటే ఖైదీలకే బెటర్...
నిందితుడిని అరెస్టు చూపించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాక పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంటే అప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నన్ని రోజులకు బిల్లు పెట్టుకొనే అవకాశం ఉంది. కానీ ఈ మొత్తం కూడా గరిష్టంగా రూ. 28 దాటేందుకు వీల్లేదు. పైగా ఆ సొమ్ము కోసం కూడా పోలీసులు దాదాపు రూ. 70 ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఏళ్లుగా ఈ మొత్తాన్ని పెంచకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని పోలీసులు చెబుతున్నారు.
రాష్ట్ర జైళ్లలోని ఖైదీలకు ఇచ్చే రేషన్ ఆధారంగా సరాసరి లెక్క కడితే ప్రస్తుతం రోజుకు ఒక్కొక్కరికీ రూ. 16పైనే కేటాయిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. కనీసం వారికి ఖర్చు చేసేంత మొత్తం అయినా అదుపులోకి తీసుకొనే నిందితుడు/అనుమానితుడి ఖర్చులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. అవసరాలు ఒకటే అయినప్పుడు ఠాణాలకు ఓ కేటాయింపు, జైళ్లకు మరో కేటాయింపు ఉండటం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ) కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment