నాడు సైకిల్‌.. నేడు ఇన్నోవాలు | Advanced changes in the police system | Sakshi
Sakshi News home page

నాడు సైకిల్‌.. నేడు ఇన్నోవాలు

Published Thu, Dec 12 2024 1:06 PM | Last Updated on Thu, Dec 12 2024 1:07 PM

Advanced changes in the police system

ఒకప్పుడు నిక్కర్‌ తొడిగి,సైకిల్‌ మీద పోలీసుల సవారీ

ఇప్పుడు అధునాతన వాహనాలు, చేతిలో ట్యాబ్‌లు

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కేసుల శోధన

నేరస్తులను సులువుగా పట్టుకొంటున్న ఖాకీలు

కాలనుగుణంగా పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు 
 

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పోలీస్‌ వ్యవస్థ నిత్యనూతనమవుతోంది. కరుడుగట్టిన నేరస్తులను కూడా నేరం జరిగిన గంటల వ్యవధిలోనే తేలిగ్గా పట్టుకొంటున్నారు. భయపెట్టడమే పోలీస్‌ లక్షణం అన్న కాలం నుంచి ప్రజలకు మంచి స్నేహితులు అనే స్థాయికి మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పోలీసును చూస్తే చాలు జనం పరుగులు పెట్టేవారు. ఠాణా మెట్లెక్కాలన్నా వణికేవారు. ఫ్రెండ్లీ పోలీసు విధానం అమల్లోకి వచి్చన తరువాత బాధితులు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమ గోడును చెప్పుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం చేసినా, తమకు న్యాయం జరగదని అర్థం అయినా ఉన్నతాధికారుల వద్దకూ వెళుతున్నారు. అప్పట్లో పోలీసు అంటేనే కరుకు మాటలు గుర్తుకొచ్చేవి. 

ఇప్పుడు పోలీసుల ప్రవర్తనలోనే కాదు అన్ని విషయాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నేర పరిశోధనలో పోలీసులు అప్పట్లో డాగ్‌ స్క్వాడ్‌ల మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఎంత తెలివైన నేరస్తులను కూడా సులువుగా పట్టుకోగలుగుతున్నారు. పట్టణాల్లో అయితే పోలీసు స్టేషన్లో కూర్చుని కంట్రోల్‌ సిస్టం ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందోనని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం ఏర్పడింది. అయితే పోలీసు శాఖలో ఇప్పుడు రాజకీయ జోక్యం మాత్రం పెరిగింది. పోస్టింగులన్నీ అధికార పార్టీ నేతలు చెప్పినట్టే నడుస్తున్నాయి. దీంతో మంచి చోట్ల పోస్టింగుల కోసం పోలీసు అధికారులు పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

నాడు చేతిలో తుపాకులు.. నేడు ట్యాబ్‌లు
నక్సలైట్ల కాలంలో పోలీసులు తుపాకీ లేకుండా బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ల సొంత వాహనాలకు కూడా నంబర్‌ ప్లేట్లు ఉండేవి కాదు. ఇప్పుడు పోలీసు వాహనాలు, సొంత వాహనాలకు సైతం పోలీస్‌ అని రాసుకుని దర్జాగా తిరుగగలుగుతున్నారు. తుపాకులు పోలీసు కార్యాలయాల్లో భద్రపరిచారు. ఏదైన పెద్ద ఘటన జరిగినపుడే బయటకు తీస్తున్నారు. ఇçప్పుడు ఏ పోలీసు చేతిలో చూసినా ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులను ఆపి ట్యాబ్‌లో వారి వాహన నంబర్‌ నమోదు చేసి ఫైన్‌లు వేస్తున్నారు. ఫైన్లు పెండింగ్‌ ఉన్న వాహనాలను కూడా ట్యాబ్‌ల ద్వారా ట్రాఫిక్‌ పోలీస్‌ వెబ్‌సైట్లలో క్షణాల్లో చెక్‌ చేసి పట్టుకొంటున్నారు.

నాడు సైకిల్‌.. నేడు ఇన్నోవాలు 
నాలుగైదు దశాబ్దాల క్రితం పోలీసులు నిక్కర్‌ తొడుక్కుని, జబ్బకు లాఠీ తగిలించుకుని సైకిల్‌పై సవారీ చేసేవారు. గ్రామాలే కాదు పట్టణాల్లోనూ సైకిళ్ల మీదే తిరిగేది. తరువాతి కాలంలో నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు వచ్చాయి. సైకిళ్ల స్థానంలో సైకిల్‌ మోటార్లే కాదు ఇన్నోవాలు, బొలేరో వాహనాలు వచ్చి చేరాయి. జిల్లా స్థాయి అధికారులకైతే ఫార్చూనర్లు కూడా సమకూర్చారు. నక్సలైట్ల కార్యకలాపాలు కొనసాగిన సమయంలో పోలీసులకు ప్రత్యేక నిధులు ఇచ్చేవారు. వాటితో ఇన్‌ఫార్మర్లను తయారు చేసుకుని నక్సలైట్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. వాహనాల్లో వెళితే నక్సలైట్లు మెరుపుదాడులు చేస్తారని, మారుమూల గ్రామాలకు కాలినడకనే వెళ్లేవారు. సివిల్‌ దుస్తుల్లో, నంబర్‌ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలు, అలాగే ప్రయాణికులతో కలిసి బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో తిరిగేవారు. నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోయిన తరువాత పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఏ గ్రామానికైనా దర్జాగా వెళుతున్నారు. విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (వీపీవో) విధానం అమల్లోకి వచ్చిన తరువాత ఊరికొక పోలీసు ఉండేవారు. వారు వారానికోసారైనా ఆ ఊరికి వెళ్లాల్సిందే. అక్కడి ప్రజలతో మమేకం అయి, వాళ్ల సమస్యలను తెలుసుకుని అధికారులకు నివేదించేవారు.  

అప్పుడు చేతిరాత...ఇప్పుడు కంప్యూటర్‌ 
గతంలో కేసుల నమోదుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ రాయడం, అరెస్టు, రిమాండ్‌ డైరీ రాయడం ఆఖరుకు చార్జిïÙట్‌ రాయడానికి గంటల కొద్దీ సమయం పట్టేది. ఏ పోలీసు స్టేషన్‌కు వెళ్లినా స్టేషనరీ సమస్య కనిపించేది. బాధితులు లేదా నిందితుల తరపు వారికి చెప్పి స్టేషన్‌కు కావలసిన పేపర్‌ బండిల్స్, కార్బన్‌ పేపర్లు...ఇలా అన్ని తెప్పించుకునేవారు. తరువాతి కాలంలో ప్రభుత్వాలు పోలీసు స్టేషన్లకు నిర్వహణ ఖర్చులు ఇవ్వడం ద్వారా వసూళ్లకు కొంతమేర అడ్డుకట్ట పడింది. కంప్యూటర్లు రావడంతో ఈ విధానమంతా మారిపోయింది. ప్రతి విషయాన్ని కంప్యూటర్‌లో కంపోజ్‌ చేయడమే. కంపోజింగ్‌ తరువాత తప్పు ఒప్పులు చెక్‌ చేసి ప్రింట్స్‌ తీసి ఫైల్‌ తయారు చేయడమే తరువాయి.  

కమాండ్‌ కంట్రోల్‌ రూంలు 
జిల్లా కేంద్రాల్లోని పోలీసు కార్యాలయాల్లో కమాండ్‌ కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలన్నింటికీ అనుసంధానం చేయడంతో కూర్చున్న చోటు నుంచే పర్యవేక్షించే వెసులుబాటు కలిగింది. రిజొల్యూషన్‌ ఎక్కువ ఉన్న కెమెరాలు బిగించడంతో ప్రతీది చూసుకునే అవకాశం ఏర్పడింది. వాహనదారులు గానీ, మరెవరైనా సరే ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే జిల్లా పోలీసు కార్యాలయం నుంచే వారి ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు.  

నేర పరిశోధనలో టెక్నాలజీ వాడకం 
గతంలో హత్య జరిగితే ఘటనా స్థలానికి పోలీసు జాగిలాలను వెంట బెట్టుకుని వెళ్లేవాళ్లు. అవి ఎంత దూరం పరుగు పెడితే అంతదూరం వెళ్లడం, అక్కడ నుంచి అనుమానితులను పట్టుకుని వారిని రోజుల తరబడి కుళ్ల»ొడిచేవాళ్లు. అసలు నేరస్తుడో కాదో కానీ, అనుమానంతోనే పట్టుకుని చిత్రహింసలు పెట్టేవారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచి్చన తరువాత నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు సులువైంది. చిన్న క్లూతో నేరస్తులను ఇట్టే పట్టేస్తున్నారు. ఊరూరా, వాడవాడలా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. సీసీ పుటేజీలను తీసుకుని, అందులోని అనుమానితుల వివరాలు సేకరించడం, అలాగే సెల్‌ఫోన్‌ నెట్వర్క్‌ ట్రాకింగ్‌ ద్వారా నేరం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన వ్యక్తుల ఫోన్‌ నంబర్లను గుర్తించడం, వేలి ముద్రల ఆధారంగా నేరస్తులు ఎవరో తెలుసుకోవడం... ఇలా అనేక టెక్నాలజీలు నేరపరిశోధనలో కీలకంగా మారాయి.  

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ 
అప్పట్లో పోలీసు అంటేనే ఒక రకమైన భయం. వాళ్ల దగ్గరకి వెళితే ఎలా ప్రవçర్తిస్తారో తెలియదు. ఆపద వచి్చనా, ఇబ్బందులు ఎదురైనా సరే వెళ్లడానికి జంకేవారు. తరువాతి కాలంలో పోలీసు మ్యాన్యువల్‌లో

అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వాలు మారినపుడల్లా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అందులో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజలు కొంత ధైర్యంగా వెళ్లగలుగుతున్నారు. ఇప్పుడు

కూడా అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ఉన్నా, చాలా వరకు మార్పయితే కనబడుతోంది. స్టేషన్‌లో రిసెప్షనిస్ట్‌గా మహిళా కానిస్టేబుల్‌ ఉండడం, ఫిర్యాదు చేయటానికి వచ్చినవారిని కూర్చోబెట్టి వారి సమస్య ఏమిటో తెలుసుకుని అధికారిని కలిపించే ప్రయత్నం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement