
నయా మేనేజ్‌మెంట్
సాక్షి, సిటీబ్యూరో: ఫైళ్ల క్రమబద్ధీకరణ.... ఫిర్యాదుదారులకు మర్యాద ఇవ్వడం... ఫ్రెండ్లీ పోలిసింగ్.. ఇలా పోలీసుస్టేషన్లలో పలు మార్పులు చేసిన నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి.... ఇప్పుడు ‘పోలీసు స్టేషన్ మేనేజ్‌మెంట్’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇన్‌స్పెక్టర్(ఎస్‌హెచ్‌ఓ) నుంచి హోంగార్డు వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలి, ఏ పనికి ఎవరు జవాబుదారి వహించాలి అనేది ఓ నివేదికలో స్పష్టం చేశారు. ఈ విధివిధానాలపై అన్ని ఠాణాల సిబ్బందికి గత 30 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిశాయి. సోమవారం నుంచి ‘పోలీసు స్టేషన్ మేనేజ్‌మెంట్’ కార్యక్రమంలో అమలులోకి రానుంది.
ప్రస్తుతం ఇలా...
ఇప్పటి వరకు స్టేషన్‌కు సంబంధించిన ప్రతి విషయం ఇన్‌స్పెక్టరే (ఎస్‌హెచ్‌ఓ) చూసుకోవాల్సి వస్తోంది. చెడైనా.. మంచైనా అతడే బాధ్యత వహించాల్సి వస్తోంది. స్టేషన్‌లోని కానిస్టేబుల్ నుంచి అదనపు ఇన్‌స్పెక్టర్ వరకూ ఎవరికి ఏపని అప్పగించారు? ఎంత వరకు పూర్తి చేశారనే లెక్కా..పత్రం లేదు.
కమిషనర్ తాజాగా రూపొందించిన ‘స్టేషన్ మేనేజ్‌మెంట్’తో ఇకపై ఇలాంటి పరిస్థితి ఠాణాల్లో కనిపించదు. ప్రతీ సిబ్బందికి నిర్ధిష్టమైన డ్యూటీ ఉంటుంది. కేటాయించిన పనినే అతడు పూర్తి చేయాలి. డ్యూటీ ముగిశాక తాను ఏం చేసిందీ ప్రతీ రోజూ అప్రయిజల్ రిపోర్ట్‌లో రాయాలి. ఈ విధానం వల్ల సిబ్బదికి డ్యూటీపై శ్రద్ధాభక్తులు పెరుగుతాయనేది కమిషనర్ మహేందర్‌రెడ్డి అభిప్రాయం.
డీపీఆర్ రాయాల్సిందే
ఠాణాలో పనిచేసే ఇన్‌స్పెక్టర్ మొదలు ప్రతీ సిబ్బంది డైలీ ప్రోగెస్ రిపోర్టు (డీపీఆర్) రాయాల్సిందే. ఎన్ని గంటలు పనిచేశారు? ఏం చేశారు? ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? ప్రజలకు ఏం సేవ చేశాం? ఫిర్యాదుదారులు సంతృప్తి చెందారా? అనే విషయాలపై డీపీఆర్‌లో పేర్కొనాల్సిందే.
అడ్మిన్ అధికారిగా ఎస్‌ఐ...
ఠాణాలో కొత్తగా అడ్మిన్ అధికారి పోస్టును సృష్టించారు. ఇందుకు ఓ ఎస్‌ఐను నియమించారు. ఇతను ఠాణాలోని సౌకర్యాలు, ఫైళ్లు, తదితర వ్యవహారాలనీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా పోస్టు గతంలో డీసీపీ, కమిషనర్ కార్యాలయాల్లో మాత్రమే ఉండేది.
పర్యవేక్షణ ఇలా...
ఎస్‌హెచ్‌ఓ - డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీ ఐ),
అడ్మిన్ ఎస్‌ఐ, సెక్టార్‌ఎస్‌ఐలు, అడ్మిన్‌ఇన్‌స్పెక్టర్ (క్రైమ్)
అడ్మిన్ ఎస్‌ఐ- స్టేషన్‌హౌస్ మేనేజ్‌మెంట్, రిసెప్షెన్ సెంటర్, స్టేషన్ రైటర్, ఈ-కాప్ కానిస్టేబుల్స్, ఎంసీ, పీఎంఈ, ఎఫ్‌ఎస్‌ఎల్ డ్యూటీ కానిస్టేబుల్స్, అకౌంటెంట్ కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ, సపోర్ట్‌స్టాఫ్
సెక్టార్‌ఎస్‌ఐ-సెక్టార్ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్స్, బ్లూకోల్ట్స్ సిబ్బంది, పెట్రోలింగ్ కార్లు, కోర్టు స్టాఫ్, వారెంట్ కానిస్టేబుల్, సమన్స్ కానిస్టేబుల్
అదనపు ఇన్‌స్పెక్టర్-డిటెక్టివ్ ఎస్‌ఐ, క్రైమ్ కానిస్టేబుల్స్, క్రైమ్‌రైటర్
జవాబుదారీతనం పెంచేందుకే..
ఫెండ్లీపోలిసింగ్‌లో భాగంగా ఠాణా స్థాయిలో పూర్తిప్రక్షాళన చేశాం. పని విభజన చేయడంతో వారిలో జవాబుదారీతనం పెరుగుతుంది. దీంతో పాటు బాధితులకు ఠాణాలో తమ పని ఎవరు చేసి పెడతారు అనేది ఇట్టే తెలిసిపోతుంది. అలాగే, తప్పు జరిగితే ఏ స్థాయిలో జరిగింది.. బాధ్యులెవరు అనేదీ స్పష్టంగా తెలుస్తుంది. నే రాలు పెరిగినా, తగ్గినా వాటికి సంబంధిత అధికారులు/ సిబ్బంది బాధ్యత వహించాల్సిదే.
-మహేందర్‌రెడ్డి, నగర పోలీసుల కమిషనర్