City Police Commissioner Mahender Reddy
-
వడ్డీ వ్యాపారులకు పోలీస్ షాక్..
పలువురి ఇళ్లపై దాడి జాఫర్ పహిల్వాన్‌తో పాటు 18 మంది అరెస్టు పరారీలో మరో ఇద్దరు పహిల్వాన్లు 65 మంది ఫైనాన్సర్లకు కౌన్సెలింగ్ చార్మినార్/ యాకుత్‌పురా: ‘ప్రాణాలు తోడేస్తున్నారు’ అనే శీర్షికతో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పందించారు. అధిక వడ్డీ కోసం పేదలను వేధిస్తున్న వడ్డీ వ్యాపారుల భరతం పట్టాలని తమ సిబ్బందిని ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కరుడుగట్టిన వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పాతబస్తీలో జాఫర్ పహిల్వాన్‌తో పాటు మరో 18 మంది వడ్డీవ్యాపారులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పహిల్వాన్ల ఇంటిపై కూడా దాడి చేయగా వారు పారిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 65 మంది వడ్డీ వ్యాపారుకు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మాత్రమే వడ్డీ వ్యాపారం చేయాలని, ప్రాణాలు హరించే వడ్డీ వ్యాపారం చేస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. పాతబస్తీలో ఉన్న సుమారు 500 ఫైనాన్స్ కంపెనీలకు నోటీసులు సైతం జారీ చేశారు. చెత్త బజార్‌లోని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు మహ్మద్ జావెద్‌ను వడ్డీ డబ్బులు కట్టలేదనే కక్షతో ఫైనాన్సర్ హసన్ జాఫ్రీ క త్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. జాఫర్ ఇంటిపై.... క్రమంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారం మేరకు మాజీ కార్పొరేటర్, రౌడీషీటర్ జాఫర్ పహిల్వాన్(65) ఇంటిపై రెయిన్‌బజార్ పోలీసులు గురువారం దాడి చేసి అరెస్ట్ చేశారు. మీర్‌చౌక్ డివిజన్ ఏసీపీ ఎస్.గంగాధర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు యాకుత్‌ఫురా అమన్‌నగర్ ‘ఎ’ లోని జాఫర్ పహిల్వాన్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా జాఫర్ వారిని దూషించాడు. తనిఖీల్లో జాఫర్ ఇంట్లో ఫైనాన్స్ సంబంధించి ఎలాంటి పత్రాలు దొరకలేదు. అయితే, సోదాలకు వెళ్లిన పోలీసులను దూషించినందుకు జాఫర్‌పై ఐపీసీ సెక్షన్ 353 పోలీసులు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జాఫర్ పహిల్వాన్‌తో పాటు అతని బంధువులు చోటా పహిల్వాన్, సాలం పహిల్వాన్ల ఇళ్లల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. హద్దుమీరితే ఖబడ్దార్: డీసీపీ అక్రమంగా ఫైనాన్స్ దందా కొనసాగించే వడ్డీ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ అన్నారు. గురువారం పురానీహవేళీలోని తన కార్యాలయంలో డీసీపీ విలేకరులతో మాట్లాడుతూ, అధిక వడ్డీ కోసం పేదలను వేధించే అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే దాదాపు 65 మంది ఫైనాన్సర్స్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లెసైన్స్ లేకుండా అక్రమంగా ఫైనాన్స్ దందా చేసే వారందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ దందా ముసుగులో రౌడీషీటర్లు, గూండాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం సాయంత్రం వరకు 18 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. హద్దు వీరి ప్రవర్తించేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే ఐదారుగురిపై పీడీ యాక్ట్ కోసం నగర పోలీస్ కమిషనర్‌కు నివేదిక పంపామన్నారు. కొంతమంది వ్యాపారులు నూటికి 30 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నట్టు తమ దాడుల్లో స్పష్టమైందని డీసీపీ తెలిపారు. సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
నయా మేనేజ్మెంట్
సాక్షి, సిటీబ్యూరో: ఫైళ్ల క్రమబద్ధీకరణ.... ఫిర్యాదుదారులకు మర్యాద ఇవ్వడం... ఫ్రెండ్లీ పోలిసింగ్.. ఇలా పోలీసుస్టేషన్లలో పలు మార్పులు చేసిన నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి.... ఇప్పుడు ‘పోలీసు స్టేషన్ మేనేజ్మెంట్’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇన్స్పెక్టర్(ఎస్హెచ్ఓ) నుంచి హోంగార్డు వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలి, ఏ పనికి ఎవరు జవాబుదారి వహించాలి అనేది ఓ నివేదికలో స్పష్టం చేశారు. ఈ విధివిధానాలపై అన్ని ఠాణాల సిబ్బందికి గత 30 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిశాయి. సోమవారం నుంచి ‘పోలీసు స్టేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమంలో అమలులోకి రానుంది. ప్రస్తుతం ఇలా... ఇప్పటి వరకు స్టేషన్‌కు సంబంధించిన ప్రతి విషయం ఇన్స్పెక్టరే (ఎస్హెచ్ఓ) చూసుకోవాల్సి వస్తోంది. చెడైనా.. మంచైనా అతడే బాధ్యత వహించాల్సి వస్తోంది. స్టేషన్‌లోని కానిస్టేబుల్ నుంచి అదనపు ఇన్స్పెక్టర్ వరకూ ఎవరికి ఏపని అప్పగించారు? ఎంత వరకు పూర్తి చేశారనే లెక్కా..పత్రం లేదు. కమిషనర్ తాజాగా రూపొందించిన ‘స్టేషన్ మేనేజ్మెంట్’తో ఇకపై ఇలాంటి పరిస్థితి ఠాణాల్లో కనిపించదు. ప్రతీ సిబ్బందికి నిర్ధిష్టమైన డ్యూటీ ఉంటుంది. కేటాయించిన పనినే అతడు పూర్తి చేయాలి. డ్యూటీ ముగిశాక తాను ఏం చేసిందీ ప్రతీ రోజూ అప్రయిజల్ రిపోర్ట్‌లో రాయాలి. ఈ విధానం వల్ల సిబ్బదికి డ్యూటీపై శ్రద్ధాభక్తులు పెరుగుతాయనేది కమిషనర్ మహేందర్‌రెడ్డి అభిప్రాయం. డీపీఆర్ రాయాల్సిందే ఠాణాలో పనిచేసే ఇన్స్పెక్టర్ మొదలు ప్రతీ సిబ్బంది డైలీ ప్రోగెస్ రిపోర్టు (డీపీఆర్) రాయాల్సిందే. ఎన్ని గంటలు పనిచేశారు? ఏం చేశారు? ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? ప్రజలకు ఏం సేవ చేశాం? ఫిర్యాదుదారులు సంతృప్తి చెందారా? అనే విషయాలపై డీపీఆర్‌లో పేర్కొనాల్సిందే. అడ్మిన్ అధికారిగా ఎస్ఐ... ఠాణాలో కొత్తగా అడ్మిన్ అధికారి పోస్టును సృష్టించారు. ఇందుకు ఓ ఎస్ఐను నియమించారు. ఇతను ఠాణాలోని సౌకర్యాలు, ఫైళ్లు, తదితర వ్యవహారాలనీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా పోస్టు గతంలో డీసీపీ, కమిషనర్ కార్యాలయాల్లో మాత్రమే ఉండేది. పర్యవేక్షణ ఇలా... ఎస్హెచ్ఓ - డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీ ఐ), అడ్మిన్ ఎస్ఐ, సెక్టార్ఎస్ఐలు, అడ్మిన్ఇన్స్పెక్టర్ (క్రైమ్) అడ్మిన్ ఎస్ఐ- స్టేషన్‌హౌస్ మేనేజ్మెంట్, రిసెప్షెన్ సెంటర్, స్టేషన్ రైటర్, ఈ-కాప్ కానిస్టేబుల్స్, ఎంసీ, పీఎంఈ, ఎఫ్ఎస్ఎల్ డ్యూటీ కానిస్టేబుల్స్, అకౌంటెంట్ కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ, సపోర్ట్‌స్టాఫ్ సెక్టార్ఎస్ఐ-సెక్టార్ ఏఎస్ఐ, కానిస్టేబుల్స్, బ్లూకోల్ట్స్ సిబ్బంది, పెట్రోలింగ్ కార్లు, కోర్టు స్టాఫ్, వారెంట్ కానిస్టేబుల్, సమన్స్ కానిస్టేబుల్ అదనపు ఇన్స్పెక్టర్-డిటెక్టివ్ ఎస్ఐ, క్రైమ్ కానిస్టేబుల్స్, క్రైమ్రైటర్ జవాబుదారీతనం పెంచేందుకే.. ఫెండ్లీపోలిసింగ్లో భాగంగా ఠాణా స్థాయిలో పూర్తిప్రక్షాళన చేశాం. పని విభజన చేయడంతో వారిలో జవాబుదారీతనం పెరుగుతుంది. దీంతో పాటు బాధితులకు ఠాణాలో తమ పని ఎవరు చేసి పెడతారు అనేది ఇట్టే తెలిసిపోతుంది. అలాగే, తప్పు జరిగితే ఏ స్థాయిలో జరిగింది.. బాధ్యులెవరు అనేదీ స్పష్టంగా తెలుస్తుంది. నే రాలు పెరిగినా, తగ్గినా వాటికి సంబంధిత అధికారులు/ సిబ్బంది బాధ్యత వహించాల్సిదే. -మహేందర్‌రెడ్డి, నగర పోలీసుల కమిషనర్