వడ్డీ వ్యాపారులకు పోలీస్ షాక్.. | Police shock to the interest of the retailers | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారులకు పోలీస్ షాక్..

Published Fri, Dec 12 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

వడ్డీ వ్యాపారులకు పోలీస్ షాక్..

వడ్డీ వ్యాపారులకు పోలీస్ షాక్..

పలువురి ఇళ్లపై దాడి
జాఫర్ పహిల్వాన్‌తో పాటు 18 మంది  అరెస్టు
పరారీలో మరో ఇద్దరు పహిల్వాన్‌లు
65 మంది ఫైనాన్సర్లకు కౌన్సెలింగ్

 
చార్మినార్/ యాకుత్‌పురా:  ‘ప్రాణాలు తోడేస్తున్నారు’ అనే శీర్షికతో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పందించారు. అధిక వడ్డీ కోసం పేదలను వేధిస్తున్న వడ్డీ వ్యాపారుల భరతం పట్టాలని తమ సిబ్బందిని ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కరుడుగట్టిన వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పాతబస్తీలో జాఫర్ పహిల్వాన్‌తో పాటు మరో 18 మంది వడ్డీవ్యాపారులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పహిల్వాన్‌ల ఇంటిపై కూడా  దాడి చేయగా వారు పారిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 65 మంది వడ్డీ వ్యాపారుకు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మాత్రమే వడ్డీ వ్యాపారం చేయాలని, ప్రాణాలు హరించే వడ్డీ వ్యాపారం చేస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. పాతబస్తీలో ఉన్న సుమారు 500 ఫైనాన్స్ కంపెనీలకు నోటీసులు సైతం జారీ చేశారు.  చెత్త బజార్‌లోని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు మహ్మద్ జావెద్‌ను వడ్డీ డబ్బులు కట్టలేదనే కక్షతో ఫైనాన్సర్ హసన్ జాఫ్రీ క త్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే.
 
జాఫర్ ఇంటిపై....


 క్రమంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారం మేరకు మాజీ కార్పొరేటర్, రౌడీషీటర్ జాఫర్ పహిల్వాన్(65) ఇంటిపై రెయిన్‌బజార్ పోలీసులు గురువారం దాడి చేసి అరెస్ట్ చేశారు. మీర్‌చౌక్ డివిజన్ ఏసీపీ ఎస్.గంగాధర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు యాకుత్‌ఫురా అమన్‌నగర్ ‘ఎ’ లోని జాఫర్ పహిల్వాన్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా జాఫర్ వారిని దూషించాడు. తనిఖీల్లో జాఫర్ ఇంట్లో ఫైనాన్స్ సంబంధించి ఎలాంటి పత్రాలు దొరకలేదు. అయితే, సోదాలకు వెళ్లిన పోలీసులను దూషించినందుకు జాఫర్‌పై ఐపీసీ సెక్షన్ 353 పోలీసులు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  జాఫర్ పహిల్వాన్‌తో పాటు అతని బంధువులు చోటా  పహిల్వాన్, సాలం పహిల్వాన్‌ల ఇళ్లల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు.
 
హద్దుమీరితే ఖబడ్దార్: డీసీపీ
 
అక్రమంగా ఫైనాన్స్ దందా కొనసాగించే వడ్డీ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ అన్నారు.  గురువారం పురానీహవేళీలోని తన కార్యాలయంలో డీసీపీ విలేకరులతో మాట్లాడుతూ, అధిక వడ్డీ కోసం పేదలను వేధించే అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే దాదాపు 65 మంది ఫైనాన్సర్స్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లెసైన్స్ లేకుండా అక్రమంగా ఫైనాన్స్ దందా చేసే వారందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ దందా ముసుగులో రౌడీషీటర్లు, గూండాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం సాయంత్రం వరకు 18 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. హద్దు వీరి ప్రవర్తించేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే ఐదారుగురిపై పీడీ యాక్ట్ కోసం నగర పోలీస్ కమిషనర్‌కు నివేదిక పంపామన్నారు. కొంతమంది వ్యాపారులు నూటికి 30 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నట్టు తమ దాడుల్లో స్పష్టమైందని డీసీపీ తెలిపారు.  సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

పోల్

Advertisement